
Revanth reddy on Jamili elections(Latest political news telangana) :
జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ప్రమాదమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. జమిలి ఎన్నికలకు తాము పూర్తిగా వ్యతిరేకమని తేల్చిచెప్పారు. రాష్ట్రాల హక్కులను హరించడానికే బీజేపీ జమిలి ఎన్నికల అంశాన్ని తెరపైకి తెస్తోందని మండిపడ్డారు.
కొంతకాలంగా జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోందని రేవంత్ అన్నారు. కానీ దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు బీజేపీ మాయ మాటలను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని స్పష్టం చేశారు. కర్ణాటకలో బీజేపీ అగ్రనేతలు గల్లీగల్లీ తిరిగినా, మోదీ, అమిత్ షా 30 రోజులు ప్రచారం చేసినా బీజేపీ గెలలేదన్నారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్‌లో మోదీ నోరెత్తలేదని మండిపడ్డారు. మణిపూర్‌పై చర్చించుకుండా ప్రజలను పక్కదారి పట్టించారని విమర్శించారు. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపని సర్వేలు చెబుతున్నాయని రేవంత్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు 38 శాతం ఓట్లు వస్తున్నాయని తేలిందన్నారు. బీఆర్ఎస్ 31 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందన్నారు.
బీజేపీ ఓటమి భయంతోనే తెరపైకి వన్ నేషన్ – వన్ ఎలక్షన్ తీసుకొస్తుందని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇండియా కూటమి జమిలి ఎన్నికలకు వ్యతిరేకమన్నారు. జమిలి ఎన్నికల కమిటీ సభ్యుడిగా అధీర్ రంజన్ వైదొలిగారని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని స్ఫష్టం చేశారు. అందుకే జమిలి ఎన్నికలకు బీఆర్ఎస్ అనుకూలంగా ఉందన్నారు. జమిలి ఎన్నికలకు మద్దతు ఇస్తూ 2018లో సీఎం కేసీఆర్ లేఖ రాశారని గుర్తు చేశారు. జమిలి విధానంతో రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధ్యక్ష తరహా ఎన్నికల కోసమే వన్ నేషన్ – వన్ ఎలక్షన్ తీసుకురావాలని చూస్తున్నారని ఆరోపించారు. అధ్యక్ష తరహా ఎన్నికలు వస్తే దక్షిణాది ఉనికే ప్రశ్నార్థకం అవుతుందని రేవంత్ అన్నారు.