iPhone Duo Sale: యాపిల్ తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ డ్యుయోపై ఎప్పటి నుంచో ఆసక్తి నెలకొంది. ఐఫోన్ 18 ప్రో లాంచ్ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ఫోన్.. ఈనెల 23 (నేటి) నుంచే భారత్‌లో అమ్మకానికి వచ్చింది. అయితే, లాంచ్ అయిందని వెంటనే స్టోర్‌కు వెళ్లి ఫోన్ కొనేయొచ్చని అనుకుంటే పొరపాటే. ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు భారీగా రావడంతో డెలివరీ కోసం 2027 జనవరి మధ్య వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ ఫోన్‌ను ఇప్పుడు కొనడం సాధ్యమేనా? ధరలు, ఆఫర్లు, స్టోర్ల వివరాలు తెలుసుకుందాం.
భారత్‌లో ఐఫోన్ డ్యుయో ప్రారంభ ధర రూ.2,99,900గా ఉంది. 256GB స్టోరేజ్ మోడల్‌కు ఈ ధర చెల్లించాలి. 512GB వేరియంట్ ధర రూ.3,24,900 కాగా, 1TB మోడల్ ధర రూ.3,74,900గా ఉంది. ఇక టాప్ వేరియంట్ 2TB స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర రూ.4,49,900. ఈ ఫోన్ స్టార్ వైట్, నైట్ స్కై రంగుల్లో అందుబాటులో ఉంది.
Also Read: iPhone Duo స్టాక్‌పై యాపిల్ కీలక నిర్ణయం? కొనుగోలుదారులకు నిరాశ తప్పదు!
ఈ ఫోన్ కొనేవారికి యాపిల్ కొన్ని ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. అర్హత ఉన్న ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులతో కొనుగోలు చేస్తే గరిష్ఠంగా రూ.7,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేస్తే దాని విలువ ఆధారంగా గరిష్ఠంగా రూ.81,500 వరకు ప్రయోజనం లభించవచ్చు. అయితే, ఎక్స్‌ఛేంజ్ విలువ ఫోన్ మోడల్, కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.
అక్టోబర్ 23న దేశంలోని ఆరు అధికారిక యాపిల్ స్టోర్లు ఉదయం 8 గంటలకే తెరుచుకున్నాయి. ఢిల్లీలో సాకేత్, నోయిడాలో డీఎల్ఎఫ్ మాల్ ఆఫ్ ఇండియా, బెంగళూరులో హెబ్బల్, ముంబైలో బీకేసీ, బోరివలి, పుణెలో కోరేగావ్ పార్క్ స్టోర్లు ఇందులో ఉన్నాయి. పుణె స్టోర్ రాత్రి 9:30 గంటలకు, మిగతా స్టోర్లు రాత్రి 10 గంటలకు మూతపడతాయి. అయితే, ముందుగా బుక్ చేసుకున్నవారే ఈరోజు ఫోన్ తీసుకునే అవకాశం ఉంది.
ప్రీ-ఆర్డర్ చేయని వారు యాపిల్ అధికారిక వెబ్‌సైట్ లేదా యాపిల్ స్టోర్ యాప్‌లో కొత్త ఆర్డర్లు స్వీకరిస్తున్నారా, డెలివరీకి ఎంత సమయం పడుతుందో చెక్ చేయాలి. క్రోమా, విజయ్ సేల్స్ వంటి అధీకృత రిటైలర్ల దగ్గర కూడా వివరాలు తెలుసుకోవచ్చు. అయితే, వెంటనే స్టాక్ దొరుకుతుందని హామీ లేదు.
Also Read: రే-బాన్ మెటా గ్లాసెస్‌లో ఊహించని అప్డేట్.. ఇప్పుడిక దారి వెతకడం, మ్యూజిక్ వినడం సూపర్ ఈజీ!