Left Parties: వామపక్షాలదీ అదే సిద్ధాంతం.. ప్రజా సమస్యలపై పోరాటమూ దాదాపు ఒకటే. కానీ ఎన్నికలకొచ్చేసరికి మాత్రం ఎవరి దారి వారిదే. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణలో సీపీఐ, సీపీఎం మధ్య రాజకీయ సమన్వయంపై మరోసారి చర్చ మొదలైంది. కాంగ్రెస్‌తో కలిసి సాగాలని సీపీఐ భావిస్తున్నట్లు, కానీ సొంతంగా పోటీ చేయాలన్న ఆలోచనలో సీపీఎం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి కాంగ్రెస్‌తో కలిసి సాగిన సీపీఐకి రాజకీయ సాన్నిహిత్యం కొనసాగుతుండగా, సీపీఎం తన స్వతంత్ర రాజకీయ బలాన్ని పెంచుకునే దిశగా ఆలోచిస్తోంది. ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రెండు పార్టీల మధ్య సమన్వయానికి మరో పరీక్షగా మారాయి.రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వామపక్షాల ఐక్యత చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ పార్టీ ఇటు సీపీఐ, అటు సీపీఎంను సంప్రదించింది. సీపీఐ మాత్రం సానుకూలంగా ఉండగా, సీపీఎం మాత్రం పోటీకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న సీపీఐ.. కొత్తగూడెంలో విజయం సాధించింది. ఆ తర్వాత కూడా రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేసిన సందర్భాలున్నాయి. అయితే స్థానిక సంస్థలు, మున్సిపల్ తో పాటు ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లోనూ సొంతంగా పోటీ చేసి సత్తాను చాటింది. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ అనుసరించే వైఖరిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలన్న ప్రతిపాదనపై సీపీఐ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కీలకంగా మారింది. కాంగ్రెస్‌తో ఉన్న రాజకీయ సంబంధాలను కొనసాగించాలా? లేక సీపీఎంతో కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించాలా? అన్నది తేలాల్సి ఉంది. రెండు వామపక్ష పార్టీలు ఒకే అభ్యర్థి కోసం పనిచేస్తే ఓట్ల సమీకరణకు అవకాశం ఉంటుందని, వేర్వేరుగా సాగితే తమకున్న పరిమిత బలం మరింత చీలిపోయే ప్రమాదం ఉంటుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి తదితరులు సీపీఎం రాష్ట్ర నాయకత్వంతో సమావేశమయ్యారు. అయితే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తమ పార్టీ కూడా పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తోందని వెల్లడించారు. ఇతర వామపక్షాలతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. గతంలో సీపీఎం బలపరిచిన ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో రెండుసార్లు విజయం సాధించారు. ఈ నేపథ్యంలో పట్టభద్రుల్లో తమకు ఉన్న ఆదరణను మరోసారి పరీక్షించుకోవాలన్న ఆలోచన సీపీఎంలో ఉన్నట్లు కనిపిస్తోంది.
ఖమ్మం-నల్లగొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలోనూ పట్టుందని అక్కడకూడా అభ్యర్థిని నిలపాలని సీపీఎం భావిస్తున్నట్లు సమాచారం. ఈ సమయంలో ఏకాభిప్రాయం కుదరకపోతే సొంతంగా పోటీ చేయడం ద్వారా పార్టీ ఉనికిని చాటుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓటర్ నమోదుపై పార్టీ దృష్టిసారించింది.ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీల మద్దతును కోరుతోంది. ఈ పరిస్థితుల్లో సీపీఎం తీసుకునే నిర్ణయం రాష్ట్రస్థాయి రాజకీయ సమీకరణాలకే కాకుండా, కూటమి పార్టీల మధ్య సమన్వయానికి కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
వామపక్షాలు సిద్ధాంతపరంగా దగ్గరగా ఉన్నా, ఎన్నికల రాజకీయాల్లో ఒకే మార్గంలో సాగడం లేదు. కాంగ్రెస్‌తో పొత్తు, స్థానాల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక, స్థానిక రాజకీయ పరిస్థితులు వంటి అంశాలపై వేర్వేరు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. దీంతో ఎన్నికల సమయంలో మాత్రమే పొత్తులు పెట్టుకోవడం కాకుండా, దీర్ఘకాలిక రాజకీయ కార్యాచరణ అవసరమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై ఉమ్మడిగా పోరాడే అవకాశం వామపక్షాలకు ఉంది. అయినప్పటికీ ఎన్నికల బరిలో ఎవరికి వారు అభ్యర్థులను నిలబెట్టుకుంటే, ఒకే తరహా భావజాలం ఉన్న ఓటర్లు వేర్వేరు పార్టీలవైపు మళ్లే అవకాశముంటుంది. ఈ పరిణామం ఇతర పార్టీలకు అనుకూలంగా మారవచ్చన్నది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఏపీకి ‘అర్ణబ్’ తుఫాను ముప్పు.. రేపటికి తీవ్ర వాయుగుండం.. డేంజర్ జోన్లో ఆ జిల్లాలు!
వామపక్షాల మధ్య ఐక్యత ఉంటే ఓట్ల సమీకరణకు అవకాశం పెరుగుతుందని, వేర్వేరుగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయే ప్రమాదం ఉంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఉమ్మడి అభ్యర్థి ఎంపిక, పోటీ చేసే నియోజకవర్గాలపై ఏకాభిప్రాయం, ప్రచారంలో సమన్వయం కుదరడం అంత సులభం కాదు. కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలా? వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలపాలా? లేక సొంతంగా పోటీ చేయాలా? అన్నది ఈ పార్టీల ముందున్న ప్రధాన రాజకీయ ప్రశ్న.పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ గుర్తుతోపాటు అభ్యర్థి వ్యక్తిగత ప్రతిష్ఠ, విద్యావంతులతో ఉన్న సంబంధాలు, ఉద్యోగ–నిరుద్యోగ సమస్యలపై వైఖరి కూడా ప్రభావం చూపుతాయి. అందువల్ల కేవలం పొత్తుల లెక్కలతోనే విజయం సాధ్యమవుతుందనేది నిర్దారణకు రాలేం. ఓటర్లను చేరుకోవడం, విశ్వసనీయతను పెంచుకోవడం, సమస్యలపై స్పష్టమైన కార్యాచరణను ప్రకటించడం కూడాకీలకం.
ప్రస్తుతం కాంగ్రెస్ మద్దతు కోరడం, సీపీఎం స్వతంత్ర పోటీని పరిశీలించడం, సీపీఐ వైఖరిపై స్పష్టత రావాల్సి ఉండటంతో వామపక్షాల తదుపరి పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. చివరకు రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణకు వస్తాయా? కాంగ్రెస్‌తో సీపీఐ కొనసాగుతుందా? సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగుతుందా? అన్నది ఆయా పార్టీల అధిష్టానాలు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఎన్నికల సమయంలో ఎవరి వ్యూహం వారిదైనా.. ఓట్లను సమీకరించుకోవడం, రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడం అనే లక్ష్యాలు మాత్రం రెండు వామపక్షపార్టీలకకు కీలకమే. ఈ తరుణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వామపక్షాల ఐక్యతకు మరో పరీక్షగా నిలవబోతున్నాయి.
Also Read: అసెంబ్లీ సైకిల్ది.. మున్సిపాలిటీ ఫ్యాన్దేనా? ఇచ్ఛాపురంలో పీఠం ఎవరిది?