Flipkart Delivery Boy: కస్టమర్లకు డెలివరీ చేయాల్సిన రూ.లక్షలు విలువ చేసే పార్సిళ్లను విక్రయించేందుకు యత్నించిన ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్‌ను పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ లోని సూరత్ లో జరిగిన ఈ ఘటన.. డెలివరీలో పేరుతో కొందరు చేస్తున్న మోసాలను కళ్లకు కట్టింది. భావ్‌నగర్‌లోని మోతీబాగ్ రోడ్డులో ఉన్న గంగాజలియా సరస్సు సమీపంలో ఒక వ్యక్తి ఎలాంటి బిల్లులు లేకుండా మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులను విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని విచారించారు.
నిందితుడ్ని అదుపులోకి తీసుకొని.. అతడి వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడ్ని రుత్వి మక్వానా అలియాస్ కోలీగా పోలీసులు పేర్కొన్నారు. తొలుత ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి బిల్లులు చూపించాలని పోలీసులు కోరగా.. అతడు సరైన సమాధానం ఇవ్వలేదు. దీంతో పోలీసులు ఆ వస్తువులను స్వాధీనం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే పోలీసుల విచారణలో నిందితుడు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తాను సూరత్‌లో ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నానని దాదాపు 15 రోజుల క్రితం ఈ పార్సెళ్లను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. ఖరీదైన ఉత్పత్తులు ఉన్న డెలివరీ బ్యాగ్‌లను తీసుకుని వాటిని కస్టమర్లకు అందించకుండా తన వద్దే ఉంచుకుని పరారయ్యేవాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.
కాగా, నిందితుడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ రూ. 4,60,512గా తేలింది. ఇందులో 13 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. గూగుల్ పిక్సెల్, శామ్‌సంగ్ గెలాక్సీ, వివో, మోటోరోలా, పోకో, లావా, హెచ్‌ఎమ్‌డి మెుబైల్స్ తో పాటు బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్‌వాచ్‌లు, రిస్ట్ వాచ్‌లు, సుగంధ ద్రవ్యాలు, పర్సనల్ కేర్ ఉత్పత్తులు, దుస్తులు, ఎలక్ట్రానిక్ యాక్సెసరీలు ఉన్నాయి. వీటితో పాటు రూ. 22,000 విలువైన ఆపిల్ ఎయిర్‌పాడ్స్ కూడా నిందితుడి దగ్గర లభించాయి.
Also Read: సుప్రీంకోర్టు చెంపదెబ్బ కొట్టినా చంద్రబాబుకి బుద్ధి రాలేదు: కాకాణి గోవర్ధన్ రెడ్డి
అలాగే పర్ఫ్యూమ్‌లు, బాడీ స్ప్రేలు, ఫేస్ వాష్‌లు, మాయిశ్చరైజర్లు, టూత్‌పేస్ట్, సబ్బులు, ఛార్జర్లు, పవర్ బ్యాంక్, కార్ పాలిష్ జెల్, నైట్ లాంప్ వంటి వస్తువులు కూడా దొరికాయి. దుస్తుల విభాగంలో ఐదు జీన్స్ ప్యాంట్లు, నాలుగు టీ-షర్టులు, ఒక షర్టు, ట్రౌజర్లు, బెల్ట్ తదితర వ్యక్తిగత వస్తువులు ఉన్నాయి. అరెస్ట్ అనంతరం నిందితుడిని గంగాజలియా పోలీసు స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటనపై సూరత్‌లోని సరోలీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. చోరీకి సంబంధించిన పరిస్థితులు, వస్తువుల రికవరీపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also Read: జన్యుపరంగా కొలెస్ట్రాల్ ముప్పు ఉన్నా తగ్గించుకోవచ్చా? చెన్నై అధ్యయనం ఏం చెబుతోంది?