High Cholesterol: సాధారణంగా చాలా మందికి గుండె జబ్బులు లేదా హై కొలెస్ట్రాల్ వంశపారంపర్యంగా వస్తుంటాయి. ఇంట్లో అమ్మానాన్నలకు ఉంటే.. వారి పిల్లలకూ వస్తుందనే భయం సహజంగానే ఉంటుంది. అయితే, కేవలం జన్యువుల మీదనే నెపం నెట్టేసి చేతులు ఎత్తేయాల్సిన పనిలేదని కొత్త అధ్యయనం తేల్చిచెప్పింది. మనం తినే ఆహారపు అలవాట్లతో చెడు కొలెస్ట్రాల్ ముప్పును పూర్తిగా తిప్పికొట్టవచ్చని చెన్నైలోని మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (MDRF) నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
మన దేశంలో తెల్ల అన్నం, మైదాతో చేసిన పదార్థాలు, నూనెలో వేయించిన తినుబండారాలు, నెయ్యి ఎక్కువగా తినడం సాధారణం. అయితే, శరీరానికి అవసరమైనదాని కంటే ఎక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకున్నప్పుడు, ఆ మిగులు శక్తి కాలేయంలో కొవ్వుగా మారుతుంది. ఇది రక్తంలోకి చేరి ట్రైగ్లిజరైడ్లను పెంచుతుంది. దీనివల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం పెరుగుతుంది. అయితే, జన్యుపరంగా ఎంత రిస్క్ ఉన్నా.. మంచి డైట్ ఫాలో అయితే ఈ ముప్పును సులభంగా తగ్గించుకోవచ్చు.
Also Read: మెదడు చురుగ్గా ఉండాలని ఒమేగా-3 మింగేస్తున్నారా? కొత్త రీసెర్చ్ ఏం చెబుతోందంటే?
మనం తినే ఆహారంలో పీచు పదార్థాలు, పండ్లు, కూరగాయలు తక్కువై, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు ఎక్కువైతేనే అసలు సమస్య వస్తుంది. పాలిష్ చేసిన తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్ లేదా తృణధాన్యాలు వాడటం మంచిది. అలాగే వంటనూనె విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొబ్బరి నూనె, పామాయిల్, నెయ్యికి బదులుగా వేరుశెనగ, నువ్వుల నూనె లేదా ఆవనూనె వంటి ఆరోగ్యకరమైన నూనెలను ఎంచుకోవడం మేలు.
రోజూ మనం తినే ప్లేట్‌లో సగం భాగం కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. మిగతా భాగంలో ప్రోటీన్లు, తక్కువ కార్బోహైడ్రేట్లు ఉండేలా బ్యాలెన్స్ చేయాలి. ప్యాకెట్లలో వచ్చే జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్, స్వీట్లకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఏ ఒక్క ఆహార పదార్థమో ఈ సమస్యకు కారణం కాదు, మొత్తం మన డైట్ క్వాలిటీ ఎలా ఉందనేదే ముఖ్యం.
చిన్నపాటి జీవనశైలి మార్పులతోనే చాలామందిలో కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తుంది. కానీ, సమస్య చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం డాక్టర్ల సలహా మేరకు మందులు వాడాల్సిందే. కొలెస్ట్రాల్ ఎవరికైనా రావచ్చు.. కానీ సరైన తిండి, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉంటే ఆ ముప్పును మనం ఇట్టే దరిచేరకుండా చూసుకోవచ్చు.
Also Read: పైకి ఆరోగ్యంగా ఉన్నట్లున్నా.. మీ ఎముకలను లోలోపలే తినేస్తున్న చెడు అలవాట్లు ఇవే!