Chamala Kiran: బీఆర్ఎస్ పార్టీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే సత్యదూరమైన విమర్శలు చేస్తోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. గాంధీభవన్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నామన్న విషయాన్ని విస్మరించి బీఆర్ఎస్ నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ధీమాక్ లేని దీవానా మాటలు
పదేళ్ల పాటు అధికారంలో ఉండి రూపురేఖలు మార్చేశామని చెప్పుకునే బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు సుద్దపూసల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ ధీమాక్ లేని దీవానా మాటలు చెప్తున్నారని, గడ్డం పెంచినంత మాత్రాన ఆయన చెప్పే అబద్ధాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. తమకు ఓట్లు వేయలేదన్న కక్షతోనే రాష్ట్రంలో మంచి జరగకూడదని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు.
కాళేశ్వరం వైఫల్యాలు – నీటి నిల్వలేవి?
కాళేశ్వరం ప్రాజెక్టులోని అసలు లోపాలను కప్పిపుచ్చుకునేందుకు నాటకాలు ఆడుతున్నారని ఎంపీ చామల దుయ్యబట్టారు. కన్నెపల్లి నుండి మేడిగడ్డ వరకు నీళ్లు ఎత్తిపోయాలంటే కనీసం 93.5 మీటర్ల నీటిమట్టం ఉండాలని, కానీ ప్రస్తుతం 89.20 మీటర్లు మాత్రమే ఉందన్నారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారంలో ఎత్తిపోతలకు సరిపడా నీళ్లు లేవని చెప్పారు. గోదావరి ప్రవాహ నీటిని వాడుకోవడానికి కట్టిన ప్రాజెక్టులో నీళ్లు ఎత్తిపోసినా నిల్వ ఉంచే సామర్థ్యం లేకపోవడం వారి వైఫల్యమేనన్నారు. నీళ్లు ఆంధ్రాకు వెళ్తున్నాయనడం విడ్డూరమని, మేడిగడ్డ కింద ఉన్న దేవాదుల, సీతారాం ప్రాజెక్టుల ద్వారా ఆ నీళ్లు మన తెలంగాణకే అందుతున్నాయని స్పష్టం చేశారు.
అఖిలపక్ష సమావేశానికి రండి
రాష్ట్రంలో బొగ్గు, నీళ్లు, విద్యుత్ రంగాల పరిస్థితి దిగజారడానికి గత ప్రభుత్వ చిత్తశుద్ధి లేమియే కారణమని ఆరోపించారు. 150 ఏళ్ల తర్వాత వచ్చిన ఎల్ నినో ప్రకృతి విపత్తు అని, అది ఎవరూ కొంటేనో లేక తెస్తేనో వచ్చింది కాదని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 28న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఎల్ నినో పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించారు. రాజకీయాలు పక్కనబెట్టి, అన్ని రాజకీయ పక్షాలు ఈ భేటీకి వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం తగిన సూచనలు ఇవ్వాలని చామల కిరణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Also Read: బొగ్గు కాదు.. ఇక సింగరేణిలో బంగారం, లిథియం తవ్వకాలు: భట్టి విక్రమార్క మాస్టర్ ప్లాన్!