Digital Arrest: సైబర్ నేరగాళ్ల మాయగాళ్లు అమాయకులనే కాదు, దేశాన్ని రక్షించిన రిటైర్డ్ ఆర్మీ అధికారులను కూడా వదలిపెట్టడం లేదు. పోలీసు అధికారులు, ముంబై క్రైమ్ బ్రాంచ్, దర్యాప్తు సంస్థల పేర్లు చెప్పి బెదిరిస్తూ.. సైబర్ కేటుగాళ్లు రిటైర్డ్ కల్నల్ దంపతులను డిజిటల్ అరెస్ట్ పేరుతో దారుణంగా మోసం చేశారు.
ఆధార్ అక్రమాల పేరుతో భయాందోళన
రిటైర్డ్ కల్నల్ తమవాడ సుధాకర్ (67) కు ఇటీవల ఒక అపరిచిత ఫోన్ కాల్ వచ్చింది. ఆయన ఆధార్ వివరాలను చట్టవిరుద్ధమైన, అక్రమ కార్యకలాపాలకు వినియోగించారంటూ ఫోన్ చేసిన వ్యక్తులు బెదిరించారు. ఆ తర్వాత తమను ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులుగా పరిచయం చేసుకుంటూ వాట్సాప్ వీడియో కాల్స్ చేశారు. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని నమ్మించి, వారిని తీవ్ర భయాందోళనకు గురిచేశారు.
నకిలీ పత్రాలతో మైండ్ గేమ్
బాధితులను పూర్తిగా నమ్మించడానికి కేటుగాళ్లు నకిలీ ఎఫ్‌ఐఆర్‌లు, ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు, అరెస్ట్ వారెంట్లు పంపారు. అంతేకాకుండా ఈడీ, సుప్రీంకోర్టు పేరుతో నకిలీ పత్రాలు సృష్టించారు. ఈ విషయం బయటకు చెప్పినా లేదా కుటుంబ సభ్యులకు తెలిపినా వారిని కూడా అరెస్ట్ చేస్తామని తీవ్రంగా బెదిరించారు.
రూ.61.85 లక్షల స్వాహా
ఖాతాల్లోని నిధుల ధ్రువీకరణ చేయాలనే నెపంతో సుధాకర్, ఆయన భార్యకు చెందిన వివిధ ఖాతాల నుంచి ఐదు నకిలీ బ్యాంకు ఖాతాలకు విడతల వారీగా రూ. 61,85,000 బదిలీ చేయించుకున్నారు. అక్టోబర్ 9 తర్వాత నిందితుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, తాము మోసపోయామని గ్రహించిన దంపతులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో బీఎన్‌ఎస్ (BNS) చట్టంతో పాటు ఐటీ యాక్ట్ 66(C), 66(D) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: మీ బాధలో మేమున్నూ.. అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి