AI Crime Thriller: భవిష్యత్తులో మనుషులు చేసే పనులనే కాదు… వాళ్లు నేరాలు చేసే అవకాశాలను కూడా ఓ ఏఐ ముందుగానే నిర్ణయిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది… పోలీసులు కూడా అదే వ్యవస్థ చెప్పినట్టు నడుచుకోవాల్సి వస్తే, తప్పు చేసిన వాళ్లను పట్టుకోవడం కంటే వ్యవస్థలోని తప్పులను బయట పెట్టడమే పెద్ద సవాలుగా మారుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఫ్రెంచ్ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘డాగ్ 51’ (Dog 51). దీన్ని దేంట్లో చూడాలి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
2045లో పారిస్ నగరం మూడు జోన్లుగా విడిపోయి ఉంటుంది. ప్రజల ఆర్థిక, సామాజిక స్థాయిని బట్టి వారికి నివాస ప్రాంతాలను కేటాయిస్తారు. సంపన్నులు ఒక జోన్bలో ఉంటే, పేదలు మరో జోన్ లో దుర్భరమైన పరిస్థితుల్లో బతుకుతుంటారు. నగరంలో నేరాలను నియంత్రించే బాధ్యత ఆల్మా అనే శక్తివంతమైన ఏఐ వ్యవస్థపై ఉంటుంది. నేరం జరిగాక దర్యాప్తు చేయడమే కాదు, ఎవరు నేరం చేసే అవకాశం ఉందో కూడా ఈ వ్యవస్థ అంచనా వేస్తుంది.
అయితే ఆల్మాను రూపొందించిన జార్జెస్ కెసెల్ హత్యకు గురవుతాడు. ఈ కేసును దర్యాప్తు చేసే బాధ్యత రెండో జోన్ కు చెందిన తెలివైన పోలీసు అధికారిణి సాలియా మాల్బెర్గ్ కు అప్పగిస్తారు. ఆమెకు మూడో జోన్ లో పని చేసే అనుభవజ్ఞుడైన పోలీసు జెమ్ బ్రెక్ట్ సహకరించాల్సి వస్తుంది. జెమ్ కు వ్యవస్థపై నమ్మకం ఉండదు. అయినప్పటికీ ఈ హత్య వెనుక నిజం తెలుసుకోవడానికి ఇద్దరూ కలిసి దర్యాప్తు ప్రారంభిస్తారు.
మొదట ఈ హత్య వెనుక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న జోన్ మాఫ్రామ్, అతడి బ్రేక్ వాల్స్ ఉద్యమం ఉన్నట్లు అనుమానిస్తారు. కానీ ఆధారాలను లోతుగా పరిశీలించిన కొద్దీ కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. కెసెల్ హత్యకు సంబంధించిన కీలకమైన వీడియో ఆధారం బయట పడటంతో, సాలియాకు ఆల్మా వ్యవస్థపైనే అనుమానాలు మొదలవుతాయి. ఆ నిజాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఆమె ప్రాణాలకే ప్రమాదం ఎదురవుతుంది.
మరోవైపు జెమ్ దర్యాప్తును కొనసాగిస్తూ ప్రభుత్వంలోని పెద్దల దగ్గరకు చేరుకుంటాడు. అక్కడ అతడికి తెలిసే నిజం మరింత భయంకరంగా ఉంటుంది. నేరాలను అరికట్టాల్సిన ఆల్మా తన సృష్టికర్తల నియంత్రణను దాటి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ, తనకు అడ్డుగా ఉన్న వారిని తొలగిస్తుంటుంది. కెసెల్ ఈ ప్రమాదాన్ని గుర్తించి వ్యవస్థను మార్చాలని ప్రయత్నించడంతో అతడే ఆల్మా చేతిలో హత్యకు గురవుతాడు. ఆ నిజాన్ని దాచడానికి హత్య కేసు దర్యాప్తును కూడా ఏఐ తనకు అనుకూలంగా మలుస్తుంది.
చివరికి ఈ కుట్రను బయట పెట్టేందుకు జెమ్ ప్రయత్నిస్తాడు. కానీ నిజాన్ని ప్రజలకు చేరవేసే క్రమంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోతాడు. మాఫ్రామ్ అతడి ద్వారా బయటపడిన ఆధారాలను ప్రజల ముందుంచడంతో ఆల్మాపై తిరుగుబాటు మొదలవుతుంది. ప్రజలు తమను నిరంతరం పర్యవేక్షించే పరికరాలను వదిలేసి, జోన్ల మధ్య ఉన్న అడ్డంకులను దాటేందుకు ముందుకొస్తారు. సాలియా మాత్రం జెమ్ ను కోల్పోయిన బాధతో మిగిలిపోతుంది. మరి చివరకు ఏం అవుతుంది ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
సెడ్రిక్ జిమెనెజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గిల్లెస్ లెలూష్, అడెల్ ఎక్సార్కోపౌలోస్, లూయీ గారెల్ ప్రధాన పాత్రల్లో నటించారు. సామాజిక అసమానతలు, పోలీసు వ్యవస్థ, ఏఐ నియంత్రణ వంటి అంశాలను క్రైమ్ థ్రిల్లర్ తో కలిపి చూపించారు. భారతదేశంలో ఈ సినిమా ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్ లలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగు ఆడియో అందుబాటులో లేదు. ఏఐ వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలు, హత్య వెనుక మిస్టరీ, ప్రభుత్వ కుట్రలు కలిసిన కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఏఐ చేసిందే చట్టం అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది.