దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు SBI కస్టమర్ల వ్యక్తిగత డేటా డార్క్‌వెబ్‌లో ప్రత్యక్షమైంది. సుమారు 3.75 లక్షల రికార్డులను పరిశీలించగా… అందులో 3,897 కస్టమర్ రికార్డుల్లో వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు SBI ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. లీకైన సమాచారంలో కస్టమర్ల పేర్లు, మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, ఈ మెయిల్ ఐడీలు, నివాస చిరునామాలతో పాటు బ్రాంచ్ వివరాలు, CIF నంబర్లు, లీడ్ ఐడీలు ఉన్నట్లు గుర్తించారు. రుణాలు, లీడ్ రికార్డులకు సంబంధించిన మెటాడేటా కూడా ఉన్నట్లు SBI వెల్లడించింది.
సైబర్ ఎటాక్‌పై ఈ నెల 16న థ్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ హెచ్చరికలు అందాయి. దీంతో బ్యాంక్ సైబర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్, కంటెయిన్మెంట్ ప్రోటోకాల్స్‌ను యాక్టివేట్ చేసింది. అక్టోబర్ 21న స్టాక్ ఎక్స్ఛేంజీలకు వివరాలను వెల్లడించింది. అసలు డేటా ఎంతవరకు నిజమైనది? ఎక్కడి నుంచి లీక్ అయింది? SBI వ్యవస్థల్లోకి హ్యాకింగ్ జరిగిందా? లేక మూడోపక్ష సంస్థల ద్వారా సమాచారం బయటకు వెళ్లిందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. డేటా మొత్తం పరిధిని నిర్ధారించేందుకు సెర్ట్ ఇన్ అనుమతించిన స్వతంత్ర సైబర్ సెక్యూరిటీ సంస్థను SBI రంగంలోకి దించింది.
డేటా లీక్ వల్ల కోర్ బ్యాంకింగ్ కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు లేదా బిజినెస్ కంటిన్యూటీపై ఎలాంటి ప్రభావం లేదని SBI స్పష్టం చేసింది. మరోవైపు వ్యక్తిగత వివరాలు బయటపడటంతో ఫిషింగ్, KYC పేరుతో మోసాలు, లక్ష్యిత సైబర్ మోసాల ముప్పు పెరిగే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ డేటా లీక్‌కు సంబంధించి సిరియూసిమ్ అనే హ్యాకర్ గ్రూప్.. థ్రెట్ యాక్టర్ బ్రీచ్ఫోరమ్స్ అనే సైబర్ క్రైమ్ వేదికపై సుమారు 3.75 లక్షల రికార్డులతో పాటు 3,722 పీడీఎఫ్ డాక్యుమెంట్లు తమ వద్ద ఉన్నట్లు ప్రకటించింది. ఈ డేటాలో ప్రధానంగా రుణాలు, కస్టమర్ల దరఖాస్తులు, అకౌంట్ ఓపెనింగ్ ఫారాలు, కేవైసీ (KYC) పత్రాలు ఉన్నాయని ఆ గ్రూప్ ప్రచారం చేసింది. తమ వాదనకు బలం చేకూర్చేందుకు కొద్దిమంది కస్టమర్ల నమూనా రికార్డులను కూడా బహిరంగంగా ఉంచింది. ఈ భారీ డేటా సెట్లో కొన్ని వేల మంది నిజమైన కస్టమర్ల వివరాలతో పాటు, లోన్ కోసం సంప్రదించిన లీడ్స్ లేదా ఇతరత్రా సమాచారం మిళితమై ఉండవచ్చని సైబర్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: బంగ్లా జంటకు సౌదీలో ఉరి.. ఢాకాకు సమాచారం ఇవ్వకుండానే, అసలు ఏం జరిగింది?
ఈ డేటా లీక్ వల్ల బ్యాంకు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్స్ (CBS) హ్యాక్ కాలేదని, ఖాతాల్లోని నగదు లేదా ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి ప్రభావం పడలేదని ఎస్బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఖాతాదారుల అందరి అకౌంట్లు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. అయితే.. కస్టమర్ల పేర్లు, మొబైల్ నంబర్లు, ఈ-మెయిళ్లు, సీఐఎఫ్ (CIF) నంబర్లు బయటకు రావడంతో, మోసగాళ్లు వీటిని అడ్డంపెట్టుకుని ఫేక్ కాల్స్ లేదా ఫిషింగ్ మోసాలకు పాల్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.