Korean Crime Comedy Action Series: తప్పు జరుగుతున్నప్పుడు ప్రశ్నించాలని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. అన్యాయం ఎదురైనప్పుడు బాధితుడికి అండగా నిలబడాలని కూడా ఉంటుంది. కానీ తప్పు చేస్తున్న వారికి అధికారం, డబ్బు, పలుకుబడి ఉంటే చాలామంది మౌనంగా ఉండిపోతారు. అలాంటిది ఓ పూజారి మాత్రం అన్యాయాన్ని చూసి ఊరుకోడు. పైగా, అతడికి కోపం వస్తే ఎదుటివారు ఎంతటి వారైనా లెక్కచేయని స్వభావం ఉంటుంది. అవినీతిపరుల ఆట కట్టించేందుకు అతడు పోలీసులతోనే పోరాడాల్సి వస్తుంది. ఈ క్రేజీ కొరియన్ సిరీస్ పేరు ‘ది ఫైరీ ప్రీస్ట్’ (The Fiery Priest). మరి ఈ ఆసక్తికరమైన సిరీస్ స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో అంటే…
కిమ్ హే ఇల్ ఓ క్యాథలిక్ ప్రీస్ట్. దేవుడిపై విశ్వాసం, న్యాయం పట్ల నిబద్ధత ఉన్నప్పటికీ అతడికి కోపం ఎక్కువ. ఎవరైనా తప్పు చేస్తే ప్రశ్నించకుండా ఉండలేడు. అన్యాయం చేసిన వారిని ఎదిరించే క్రమంలో ఒక్కోసారి తన ఆగ్రహాన్ని అదుపు చేసుకోలేకపోతాడు. అందుకే అతడి ప్రవర్తన సాధారణ పూజారులకు భిన్నంగా ఉంటుంది. అతడి కోపం వల్ల ఎదురయ్యే పరిణామాలు కథలో హాస్యాన్ని పండిస్తే, అదే స్వభావం నేరస్థులతో పోరాడే సమయంలో అతడికి బలంగా మారుతుంది.
హే ఇల్ సియోల్‌లోని కుడామ్ ప్రాంతానికి వచ్చి అక్కడి కేథడ్రల్‌లో బాధ్యతలు చేపడతాడు. అక్కడ ఫాదర్ లీ యంగ్ జూన్ అతడికి మార్గదర్శిగా ఉంటాడు. అయితే ఆ ప్రాంతంలో రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్నవారు, వ్యాపార ప్రయోజనాలు చూసుకునే వ్యక్తుల మధ్య అవినీతి బలంగా పాతుకుపోయి ఉంటుంది. బయటకు మంచివారిలా కనిపించే కొందరు తమ ప్రయోజనాల కోసం ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తుంటారు. వీరి వ్యవహారాలను ప్రశ్నించే ఫాదర్ లీకి కూడా సమస్యలు ఎదురవుతాయి.
ఓ దశలో ఫాదర్ లీ మరణించడం హే ఇల్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. అతడి మరణం వెనుక ఏదో రహస్యం ఉందని అనుమానించిన హే ఇల్, అసలు నిజాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో పోలీస్ డిటెక్టివ్ గు డే యంగ్, ప్రాసిక్యూటర్ పార్క్ క్యుంగ్ సన్ తో అతడి పరిచయం ఏర్పడుతుంది. గు డే యంగ్ మొదట్లో హే ఇల్‌కు భిన్నమైన స్వభావంతో కనిపిస్తాడు. పార్క్ క్యుంగ్ సన్ కూడా తనదైన పద్ధతిలో వ్యవహరిస్తుంది. మొదట విభేదాలు ఎదురైనా, క్రమంగా వీరంతా ఒకే కేసులోని చిక్కుముడులను విప్పేందుకు కలిసి పని చేయాల్సి వస్తుంది.
ఫాదర్ లీ మరణం వెనుక ఉన్నవారిని గుర్తించే ప్రయత్నంలో స్థానిక అవినీతి, నేరాల వెనుక ఉన్న సంబంధాలు బయటపడతాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకోవాలని చూసే వ్యక్తులను ఎదుర్కోవడానికి హే ఇల్ తనదైన పద్ధతిలో ముందుకెళ్తాడు. అతడి ఆవేశపూరిత ప్రవర్తన, డిటెక్టివ్ దర్యాప్తు, ప్రాసిక్యూటర్ వ్యూహాలు కలిసినప్పుడు అనేక ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.
‘ది ఫైరీ ప్రీస్ట్’ 2019లో విడుదలైన కొరియన్ క్రైమ్ కామెడీ యాక్షన్ సిరీస్. ప్రైమ్ వీడియో (Prime Video)లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో మాత్రం లేదు. కిమ్ హే ఇల్‌గా కిమ్ నామ్ గిల్ (Kim Nam-gil), గు డే యంగ్‌గా కిమ్ సంగ్ క్యున్ (Kim Sung-kyun), పార్క్ క్యుంగ్ సన్‌గా లీ హా నీ (Lee Ha-nee) నటించారు.
Read Also: దేశాన్ని కుదిపేసే కుట్ర… సొంత టీమ్‌లోనే శత్రువు… కొరియన్ యాక్షన్ థ్రిల్లర్