Action Thriller: కూతురికి అత్యవసరంగా ఆపరేషన్ చేయించాలి. అందుకోసం తండ్రి లండన్ కు వెళ్తాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో అతడే అక్కడి జైలులో చిక్కుకుంటాడు. కూతురి దగ్గరకు వెళ్లే మార్గం మూసుకుపోయిన సమయంలో… అదే జైలులో ఉగ్రవాదులు భారీ కుట్రకు తెర తీస్తే ? బయటపడే అవకాశం ఉన్నా, పారిపోకుండా వాళ్లను అడ్డుకోవాల్సిన పరిస్థితి వస్తే ? తండ్రి ప్రేమ, జైలు పోరాటం, ఉగ్రవాదుల కుట్రలతో తెరకెక్కిన తమిళ యాక్షన్ థ్రిల్లర్ ‘మిషన్ చాప్టర్ 1’ (Mission: Chapter 1). మరి ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది అంటే…
గుణశేఖరన్ అలియాస్ గుణ తన కూతురు సనాను ఎంతో ప్రేమిస్తాడు. ఆమెకు తీవ్రమైన ఆరోగ్య సమస్య రావడంతో లండన్ లో ఆపరేషన్ చేయించాలని నిర్ణయించుకుంటాడు. అయితే చికిత్సకు అవసరమైన డబ్బును సాధారణ బ్యాంకింగ్ మార్గంలో వెంటనే పంపించడం సాధ్యం కాకపోవడంతో హవాలా మార్గాన్ని ఆశ్రయిస్తాడు. డబ్బు తీసుకునేందుకు ఇచ్చిన పది రూపాయల నోటుతో కూతురిని తీసుకుని లండన్ చేరుకుంటాడు.
అక్కడ ఆసుపత్రిలో సనాను చేర్పించిన తర్వాత, ఆ నోటు గురించి తెలుసుకున్న కొందరు దుండగులు గుణను దోచుకోవడానికి ప్రయత్నిస్తారు. తనను తాను రక్షించుకునే క్రమంలో పోలీసులతో గొడవ జరగడంతో అతను అరెస్టవుతాడు. దీంతో లండన్ లోని వాండ్స్ వర్త్ జైలులో బందీగా ఉండాల్సి వస్తుంది. కూతురి ఆపరేషన్ కోసం అవసరమైన పనులు పూర్తి చేయలేకపోతున్నాననే ఆందోళన అతడిని వెంటాడుతుంది. జైలర్ సాండ్రా జేమ్స్ ను బయటకు వెళ్లేందుకు అనుమతి కోరినా ఫలితం ఉండదు.
ఇదే సమయంలో ఉమర్ ఖాద్రీ నేతృత్వంలోని ఉగ్రవాదులు జైలుపై దాడికి కుట్ర పన్నుతారు. జైలులోని భద్రతా వ్యవస్థను దెబ్బ తీసి, తమకు చెందిన ముగ్గురు ఖైదీలను విడిపించుకోవాలనేది వారి ప్లాన్. విద్యుత్ వ్యవస్థ, సమాచార వ్యవస్థలను దెబ్బ తీసి జైలులో అల్లర్లు సృష్టిస్తారు. ఖైదీలు బయటకు రావడంతో పరిస్థితి అదుపు తప్పుతుంది.
అయితే గుణ సాధారణ ఖైదీ కాదనే విషయం క్రమంగా బయట పడుతుంది. అతను గతంలో భారతదేశంలో జైలర్ గా పని చేసిన వ్యక్తి. జైలు నిర్వహణపై ఉన్న అవగాహన, పోరాట నైపుణ్యాలతో ఉగ్రవాదుల కుట్రను అడ్డుకోవడానికి రంగంలోకి దిగుతాడు. కూతురి దగ్గరకు వెళ్లాలనే ఆరాటం ఉన్నప్పటికీ, ప్రమాదంలో ఉన్న జైలు సిబ్బందిని కాపాడటానికి ప్రయత్నిస్తాడు.
గుణను ఇబ్బందుల్లోకి నెట్టిన అసలు కారణం ఏమిటి ? ఉగ్రవాదులు అతడినే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు ? జైలులో మొదలైన ఈ పోరాటం చివరకు అతని కూతురి ప్రాణాలకు ఎలా ముడిపడుతుంది ? అనేదే మిగతా కథ. అరుణ్ విజయ్ యాక్షన్ తో పాటు తండ్రి–కూతుళ్ల అనుబంధం, జైలులో జరిగే పోరాటాలు సినిమాలో హైలెట్ .
‘మిషన్ చాప్టర్ 1’ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. ఒరిజినల్ తమిళ వెర్షన్‌తో పాటు హిందీ వెర్షన్ కూడా ఉంది. తెలుగు ఆడియో అందుబాటులో లేదు. జైలు నేపథ్యంలోని యాక్షన్, ఉగ్రవాదుల కుట్రలు, తండ్రి తన కూతురిని కాపాడుకునే పోరాటం ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చొచ్చు.