Emotional Drama : కమర్షియల్ ఫైట్లు, థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ లను చూసి బోర్ కొట్టిందా ? అయితే ఇప్పుడు ఒక ఎమోషనల్ డ్రామా గురించి చెప్పుకోవాల్సిందే. ఇది కన్నీళ్ళ పెట్టిస్తూ మనసుని కదిలించే ఒక ఎమోషనల్ ఫ్యామిలీ సినిమా. ఒక మామూలు కుటుంబంలో పెద్ద కొడుక్కి తీవ్రమైన మానసిక జబ్బు చేస్తే, ఆ తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవించారు, అన్నయ్య చనిపోయాక ఆ చెల్లెలు ఎలా ఏడ్చిందో చూపించే గుండె బరువెక్కే కథ ఇది. సినిమా అంతా పాత రోజులను గుర్తుచేసేలా చాలా నిదానంగా, విజువల్స్ పరంగా చాలా రియాలిటీగా సాగుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఇంట్లో ఒకరికి ఒంట్లో బాగోకపోతే ఆ ఇల్లంతా ఎంత బాధపడుతుందో కళ్ళకు కట్టినట్టు చూపించే ఒక ఆర్ట్ సినిమా ఇది.
ఈ ఎమోషనల్ డ్రామా పేరు ‘బ్లూ హెరాన్ (Blue Heron)’. ఈ సినిమా నిర్మాణం, శైలి పరంగా ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. దర్శకురాలు సోఫీ రోమ్వారి తన సొంత జీవిత అనుభవాల ఆధారంగా ఈ కథను ఎంతో సున్నితంగా తెరకెక్కించారు. 1990ల కాలం నాటి అనుభూతిని ప్రేక్షకులకు అందించడం కోసం ఈ చిత్రాన్ని పాతకాలపు హోమ్ వీడియో ఫార్మాట్లలో చిత్రీకరించారు. అంతర్జాతీయ వేదికలపై ఈ సినిమాకు భారీ ప్రశంసలు దక్కాయి. 78వ లోకార్నో చలనచిత్రోత్సవంలో ప్రీమియర్ అయిన ఈ చిత్రం, సోఫీ రోమ్వారికి ఉత్తమ మొదటి చిత్ర దర్శకురాలిగా ప్రతిష్టాత్మక ‘Swatch First Feature Award’ ను తెచ్చిపెట్టింది. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) లోనూ విమర్శకులు దీనిని ఒక అద్భుతమైన కెనడియన్ కళాఖండంగా కొనియాడారు. స్ట్రీమింగ్ హక్కులు: ఈ సినిమా యూఎస్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను జనస్ ఫిల్మ్స్ (Janus Films) సొంతం చేసుకుంది. ఈ చిత్రం ప్రస్తుతం అంతర్జాతీయంగా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత (దాదాపు 2026 జూన్ లేదా జూలై నాటికి) ఇది The Criterion Channel లో డిజిటల్ ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది.
1990ల చివరి కాలంలో సాగే ఈ కథలో ఒక హంగేరియన్ వలస కుటుంబం తమ జీవితాల్లో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు కెనడాలోని వాంకోవర్ ఐలాండ్‌కు మారుతుంది. ఆ కుటుంబంలో నలుగురు పిల్లలు ఉండగా, అందరికంటే చిన్నదైన ఎనిమిదేళ్ల ‘సాషా’ గుండానే సినిమా మొదటి భాగం నడుస్తుంది. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా సాగిపోతున్న వారి జీవితంలో, సాషా పెద్దన్నయ్య అయిన ‘జెరెమీ’ ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు రావడం మొదలవుతాయి. జెరెమీ తీవ్రమైన మానసిక అనారోగ్యం (mental illness) బారిన పడటంతో, అతని ప్రవర్తన రోజురోజుకూ అదుపుతప్పి కుటుంబానికి ప్రమాదకరంగా మారుతుంది. కొడుకుపై ఉన్న ప్రేమని చంపుకోలేక, అలాగని మిగిలిన పిల్లల రక్షణను నిర్లక్ష్యం చేయలేక ఆ తల్లిదండ్రులు అనుభవించే మానసిక వేదన గుండెలను పిండేస్తుంది.
సినిమా రెండవ భాగంలో కథ ఒక్కసారిగా 20 సంవత్సరాలు ముందుకు సాగుతుంది. ఇప్పుడు పెద్దదైన సాషా ఒక ఫిల్మ్‌మేకర్‌గా మారుతుంది. గతంలో జరిగిన కొన్ని విషాదకర పరిణామాల వల్ల ఆమె అన్నయ్య జెరెమీ చిన్న వయసులోనే చనిపోయి ఉంటాడు. అన్నయ్య మరణం తర్వాత ఆ కుటుంబం అనుభవించిన దుఃఖం, ఒంటరితనం నుండి బయటపడటానికి సాషా ప్రయత్నిస్తుంది. చిన్నతనం నాటి తన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా గుర్తుచేసుకుంటూ, తన అన్నయ్య జీవితం ఆధారంగా ఆమె ఒక సినిమా ప్రాజెక్ట్‌ను తెరకెక్కించాలని నిర్ణయించుకుంటుంది. చివరిగా సాషా తన అన్నయ్య జ్ఞాపకాలతో సినిమాను నిర్మించే ప్రక్రియను చూపిస్తారు. జ్ఞాపకాలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, కాలంతో పాటు అవి ఎలా మారిపోతాయో ఆమెకు అర్థమవుతుంది. చనిపోయిన అన్నయ్య జ్ఞాపకాలతో రాజీ పడుతూ, తన మనసులోని బాధను ఎలా అధిగమించిందనే ముగింపుతో ఈ చిత్రం అత్యంత ఎమోషనల్ గా ముగుస్తుంది.
Read Also : చరిత్రలోనే అత్యధిక పాపులారిటీ సాధించిన మహిళా సింగర్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ డాక్యుమెంటరీ