Historical Drama OTT : 11వ శతాబ్దం… ఒకవైపు సామ్రాజ్యాన్ని కాపాడేందుకు పోరాడుతున్న శక్తులు… మరోవైపు అలముత్ కోటను స్వాధీనం చేసుకుని సరికొత్త ఉద్యమానికి నాంది పలికిన హసన్ సబ్బా. ఒకప్పుడు ప్రాణ స్నేహితులైన ఇద్దరు వ్యక్తులు… పరిస్థితుల కారణంగా బద్ధ శత్రువులుగా మారితే ? మధ్యలో ఓ పరాక్రమవంతుడైన యోధుడు ఎంటరైతే ? ప్రేమ, నమ్మకం, నమ్మకద్రోహం, అధికారం, యుద్ధాలతో సాగే ఈ చారిత్రాత్మక కథ ఎలా ఉంటుంది ? అదే Castle Walls సిరీస్. మరి ఈ సిరీస్ స్పెషాలిటీ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
కథలో ప్రధానంగా కనిపించే వ్యక్తి హసన్ సబ్బా. ఇరాన్ లోని ప్రసిద్ధ అలముత్ కోటను స్వాధీనం చేసుకున్న అతను… అప్పటికే కొనసాగుతున్న సామ్రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు. కోట అతని చేతుల్లోకి వెళ్లడంతో అక్కడి రాజకీయ సమీకరణాలే ఒక్కసారిగా మారిపోతాయి. మరోవైపు హసన్ సబ్బాకు ఒకప్పుడు అత్యంత సన్నిహితుడైన నిజాముల్ ముల్క్ సామ్రాజ్యాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తుంటాడు.
ఒకప్పుడు స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య ఇప్పుడు సిద్ధాంతాలు, అధికారం, లక్ష్యాల విషయంలో తీవ్ర విభేదాలు ఏర్పడతాయి. దీంతో స్నేహితులే శత్రువులుగా మారే పరిస్థితి వస్తుంది. ఇదే సమయంలో బందీఖానా నుంచి బయటపడిన ఓ శక్తివంతమైన యోధుడు అజాజిల్ కథలోకి వస్తాడు. తన పరాక్రమంతో నిజాముల్ ముల్క్ నమ్మకాన్ని సంపాదించిన అతను… సామ్రాజ్యం తరఫున పోరాడే కీలక వ్యక్తిగా మారతాడు. అజాజిల్ ప్రయాణం ఒకవైపు యుద్ధాలతో సాగుతుంటే… మరోవైపు హసన్ సబ్బా ప్రభావం వేగంగా విస్తరిస్తుంటుంది.
ప్రేమ, నమ్మకం, నమ్మకద్రోహం మధ్య వ్యక్తిగత సంబంధాలు కూడా రాజకీయ పోరాటాలతో ముడిపడతాయి. అలముత్ కోట చుట్టూ జరుగుతున్న పరిణామాలు అక్కడి ప్రజల జీవితాలను ఎలా మార్చాయి ? హసన్ సబ్బా లక్ష్యం ఏమిటి ? నిజాముల్ ముల్క్ అతన్ని ఎలా ఎదుర్కొన్నాడు ? అజాజిల్ ఏ వైపు నిలిచాడు ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సిరీస్ కథ. 11వ శతాబ్దపు చరిత్రను ఆధారంగా చేసుకున్న ఈ టర్కిష్ సిరీస్… అలముత్ కోట చుట్టూ జరిగిన రాజకీయ, సైనిక పరిణామాలను ఆసక్తికరమైన కథగా చూపిస్తుంది. అంతేకాదు పూర్తిగా AI సాంకేతికతతో రూపొందిన టర్కిష్ సిరీస్‌గా కూడా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది.
Also Read : భూతాలు లేవు, దెయ్యాలు లేవు… అయినా గుండెల్లో రైళ్లు పరిగెత్తించే హారర్ థ్రిల్లర్… 7.9 రేటింగ్
‘క్యాజిల్ వాల్స్’ సిరీస్ ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. ఇది చారిత్రాత్మక నేపథ్యంతో సాగే టర్కిష్ డ్రామా. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా ఏఐ జెనరేటెడ్ టర్కిష్ సిరీస్గా రూపొందించడం విశేషం. కేవలం 2 ఎపిసోడ్లు మాత్రమే ఉన్న ఈ మినీ సిరీస్‌లో ఒక్కో ఎపిసోడ్ సుమారు 15 నిమిషాల నిడివి ఉంటుంది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. కాబట్టి ఒరిజినల్ టర్కిష్ ఆడియోతో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ సహాయంతో చూడాల్సి ఉంటుంది. చరిత్ర, యుద్ధాలు, అధికార పోరాటాలు, స్నేహం-శత్రుత్వం వంటి అంశాలు ఆసక్తికరంగా అనిపించే వారికి… ఏఐతో రూపొందిన సిరీస్ ఎలా ఉంటుందో చూడాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.