Citadel 2: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన స్పై థ్రిల్లర్ సిరీస్ ‘సిటాడెల్’ రెండో సీజన్‌తో మళ్ళీ రచ్చ చేసేందుకు సిద్ధమైంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సిరీస్ అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేసి, స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. మే 6, 2026 నుంచి ఈ హై-వోల్టేజ్ యాక్షన్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. నదియా సిన్హాగా ప్రియాంక చేసిన సాహసాలు, రిచర్డ్ మ్యాడెన్‌తో ఆమె కెమిస్ట్రీ ఈ సీజన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
సిటాడెల్ సీజన్ 2 స్ట్రీమింగ్ తేదీ కోసం ఏప్రిల్ నుంచే ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే మే 6 నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే, మొత్తం ఏడు ఎపిసోడ్‌లను అమెజాన్ ప్రైమ్ ఒకేసారి విడుదల చేస్తోంది. అంటే వారం వారం వేచి చూడాల్సిన అవసరం లేకుండా, ఒకే రోజు మొత్తం సిరీస్‌ను చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళంతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుండటం మన ప్రేక్షకులకు పెద్ద గుడ్ న్యూస్.
ఈ సీజన్‌లో కథాంశం మరింత సీరియస్‌గా మారనుంది. ‘మాంటికోర్’ అనే విద్రోహ సంస్థ నుంచి మానవాళికి పొంచి ఉన్న ముప్పును అడ్డుకోవడమే నదియా, మేసన్ లక్ష్యం. వీరికి తోడుగా ఈసారి కొంతమంది కొత్త ఏజెంట్లు కూడా వచ్చి చేరారు. జాక్ రేనార్, మాట్ బెర్రీ వంటి నటీనటులు కీలక పాత్రల్లో మెరవనున్నారు. ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో తెలియని గందరగోళం మధ్య సాగే ఈ పోరాటంలో ప్రియాంక చోప్రా తన నైపుణ్యంతో ఎలా విజయం సాధిస్తుందనేది ట్రైలర్ లో ఆసక్తికరంగా చూపించారు.
వరుణ్ ధావన్, సమంత నటించిన ‘సిటాడెల్ హనీ బన్నీ’ ఇండియాలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ వెర్షన్‌తో ప్రియాంక గ్లోబల్ లెవల్‌లో తన సత్తా చాటేందుకు రెడీ అయింది. రూసో బ్రదర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సిరీస్ మేకింగ్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. మొత్తానికి మే 6వ తేదీన ఓటీటీ ప్రేక్షకులకు ఒక భారీ యాక్షన్ విందు భోజనం సిద్ధంగా ఉంది. మరి నాడియా సిన్హా ఈసారి ప్రపంచాన్ని ఎలా కాపాడుతుందో చూడాలంటే మే 6 వరకు ఆగాల్సిందే!
గ్లోబల్ స్టార్ గా ఎదిగిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న వారణాసి సినిమాలో నటిస్తోంది . ఇందులో పవర్ఫుల్ యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టడానికి సిద్ధమయ్యింది . పైగా మందాకిని అనే పాత్ర ఈమె పోషిస్తుంది. ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ALSO READ:ఆ క్షణం భయంతో వణికిపోయా.. కారు ఆపి మరీ చుట్టుముట్టారు- బుల్లితెర నటి ఆవేదన!