Psychological Thriller on OTT : ఓ విజయవంతమైన జర్నలిస్ట్ జీవితం ఎంతో పర్ఫెక్ట్ గా సాగిపోతుంటుంది. కానీ ఒక రోజు ఆమె చేతికి ఓ నవల వస్తుంది. మొదటి పేజీ చదివిన వెంటనే ఆ పుస్తకంలోని కథ తన జీవితానికి సంబంధించినదేనని ఆమెకు అర్థమవుతుంది. ఇన్నేళ్లుగా దాచుకున్న ఓ రహస్యం ఇప్పుడు పుస్తకం రూపంలో ప్రపంచం ముందుకు వస్తే ? తన కుటుంబం, కెరీర్, గౌరవం అన్నీ ఒక్కసారిగా ప్రమాదంలో పడితే ? అసలు ఆ పుస్తకం రాసింది ఎవరు ? తన గతాన్ని బయట పెట్టాలని ఎందుకు చూస్తున్నారు ? ఇలాంటి ప్రశ్నలతో ప్రేక్షకుడిని చివరి వరకు గందరగోళంలో ఉంచే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్ ‘Disclaimer’.
కేథరిన్ రావెన్ స్క్రాఫ్ట్ ఓ ప్రముఖ డాక్యుమెంటరీ జర్నలిస్ట్. ఇతరుల జీవితాల్లో దాగి ఉన్న నిజాలను బయట పెట్టడంలో ఆమెకు మంచి పేరుంటుంది. భర్త రాబర్ట్, కొడుకు నికోలస్‌తో ఆమె జీవితం సంతోషంగానే సాగుతుంటుంది. కానీ ఓ రోజు ఆమెకు ‘The Perfect Stranger’ అనే పుస్తకం అందుతుంది. అందులోని కథ చదివిన కేథరిన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే ఆ పుస్తకంలోని ప్రధాన పాత్ర తనేనని ఆమెకు అర్థమవుతుంది.
ఆ పుస్తకం ఆమె గతంలోని ఓ సంఘటనను బయట పెడుతుంది. దాదాపు 20 ఏళ్ల క్రితం ఇటలీలో జరిగిన ఓ ఘటన, ఓ యువకుడితో కేథరిన్ కు ఉన్న సంబంధం, ఆ తర్వాత జరిగిన విషాదం ఇందులో కీలకంగా మారతాయి. పుస్తకం బయటకు రావడంతో కేథరిన్ జీవితంపై అనుమానాలు మొదలవుతాయి. ఆమె భర్తకు కూడా గతంపై సందేహాలు వస్తాయి. మరోవైపు పుస్తక రచయిత ఎవరో తెలుసుకోవడానికి కేథరిన్ ప్రయత్నిస్తుంది.
ఇక్కడి నుంచి కథ వర్తమానం, గతం మధ్య ముందుకు వెనక్కి సాగుతుంది. ఒకే ఘటనను వేర్వేరు వ్యక్తుల దృష్టికోణాల్లో చూపిస్తూ, నిజం ఏది, ఎవరి మాట నమ్మాలి అనే ప్రశ్నను ప్రేక్షకుల ముందుంచుతుంది. పుస్తకం వెనుక ఉన్న వ్యక్తి అసలు ఉద్దేశం ఏంటి ? కేథరిన్ దాచిన నిజం ఏమిటి ? ఇన్నేళ్ల తర్వాత ఆ రహస్యం ఎందుకు బయటకు వచ్చింది ? అనేది తెలియాలంటే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ను చూడాల్సిందే.
Also Read : 19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా
రెనీ నైట్ రాసిన నవల ఆధారంగా రూపొందిన ‘డిస్క్లైమర్’ సిరీస్ కు ఆల్ఫోన్సో క్యూరోన్ దర్శకత్వం వహించారు. కేట్ బ్లాంచెట్, కెవిన్ క్లైన్, సాచా బారన్ కోహెన్, కోడి స్మిట్-మ్యాక్‌ఫీ, లెస్లీ మాన్‌విల్, లూయిస్ పార్ట్రిడ్జ్, జంగ్ హో-యోన్ కీలక పాత్రల్లో నటించారు. మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. ఈ 2024 సిరీస్ Apple TVలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం IMDbలో సిరీస్ రేటింగ్ 7.5గా ఉంది. అయితే కొన్ని ఎపిసోడ్లకు 7.7 కంటే ఎక్కువ రేటింగ్స్ ఉన్నాయి. ఓటీటీలో తెలుగు ఆడియో అధికారికంగా లిస్ట్ కాలేదు. ఇంగ్లీష్‌తో పాటు కొన్ని ఇతర భాషల ఆడియోలు, పలు భాషల్లో సబ్‌టైటిల్స్ ఉన్నాయి. మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్, దాగిన రహస్యాలు, నమ్మలేని కథనాలు ఇష్టపడేవారికి ఇదొక మంచి గ్రిప్పింగ్ బింజ్ వాచ్.