Suspense thriller OTT : షార్ట్ ఫిలిమ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. వీటి నిర్మాణాలు, తక్కువ బడ్జెట్ తో ఉండటంతో టాలెంట్ నిరూపించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు చాలామంది. ఇలా వచ్చిన వాటిలో కొన్నిటికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో మలయాళం నుంచి వచ్చిన ఒక షార్ట్ ఫిలిం అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు దక్కించుకుంది. ఈ చిత్రం మహిళలు ఎదుర్కొనే రెండు ప్రధాన సమస్యలను హైలైట్ చేస్తుంది. పబ్లిక్ టాయిలెట్స్ కొరత, లైంగిక వేధింపుల భయం. మీకు ఒక హారర్ సినిమా చూస్తున్నట్లే అనిపిస్తుంది ఈ షార్ట్ ఫిలింను చూస్తుంటే.
ఈ సోషల్ మెసేజ్ షార్ట్ ఫిలిం పేరు ‘ఈవా’ (EVA). సోహన్‌లాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో పాయల్ ముఖర్జీ లీడ్ రోల్ లో నటించారు. సుమారు 16 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమాను YouTube ఛానల్‌లో ఉచితంగా చూడవచ్చు.ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాల్లో ప్రదర్శించబడింది. స్వీడన్ ఫిలిం అవార్డ్స్, థాయ్‌లాండ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, భూటాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వంటి అనేక వేదికలపై అవార్డులను గెలుచుకుంది.
ఈవా (పాయల్ ముఖర్జీ) అనే అమ్మాయి కొత్తగా ట్రాఫిక్ పోలీస్ ఉద్యోగంలో చేరుతుంది. ఒకరోజు ఒక మంత్రి కాన్వాయ్ వెళ్తుందని, సిటీకి దూరంగా ఉండే ఒక నిర్మానుష్యమైన రోడ్డు దగ్గర ఆమెకు డ్యూటీ వేస్తారు. అక్కడ కనీసం మనుషులు కూడా తిరగరు. గంటల తరబడి ఎండలో నిలబడి ఉండటంతో ఆమె అలసిపోతుంది కూడా. ఇంతలో ఒక కారు వేగంగా వెళ్లడంతో ఆమెపై బురద పడుతుంది. చుట్టుపక్కల ఎక్కడా పబ్లిక్ టాయిలెట్స్ లేకపోవడంతో, చేసేదేమీ లేక రోడ్డు పక్కనే ఉన్న ఒక పాడుబడిన భవనంలోకి వెళ్తుంది. ఆ బిల్డింగ్ చూడటానికి చాలా భయంకరంగా, చీకటిగా ఉంటుంది.
ఆ భవనంలోకి వెళ్ళిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. అక్కడ ఆమెకు ఎవరో తనను వెంబడిస్తున్నట్టు, గమనిస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవైపు బయట డ్యూటీ టెన్షన్, మరోవైపు ఆ గదిలో వినిపించే వింత శబ్దాలతో ఆమెలో భయం మొదలవుతుంది. దెయ్యం ఉందో లేదో తెలియదు కానీ, అక్కడ కొంతమంది ఆమెను వెంబడించడంతో కథ భయంకరమైన క్లైమాక్స్ కు చేరుకుంటుంది. చివరికి ఆమెను వెంబడించింది ఎవరు ? ఆమె వాళ్ళ నుంచి తప్పించుకుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : గదిలో భయపెట్టే దయ్యం… తల్లికూతుర్ల అగచాట్లు… ఊహకు అందని క్లైమాక్స్