Fantasy Adventure Animation: ఒక సాధారణ అడవిలో ఉండే ఎలుగుబంట్లకు అకస్మాత్తుగా పురాతన మాయా శక్తులు వస్తే ? ఆ శక్తులతో మరో రహస్య ప్రపంచంలోకి వెళ్లాల్సి వస్తే ? పైగా ఆ శక్తులే రెండు ప్రపంచాల వినాశనానికి కారణమైతే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఇదే ఆసక్తికరమైన ఫాంటసీ అడ్వెంచర్ తో తెరకెక్కిన యానిమేషన్ మూవీ ‘Boonie Bears The Hidden Protector’ (2026). మరి ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ ను తెలుగులో ఓటీటీలో ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
చైనీస్ పురాణాలు, జానపద కథల్లో కనిపించే ‘నియాన్’ అనే రహస్యమైన పురాణ జీవి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. బ్రియార్, బ్రాంబుల్ అనే ఎలుగుబంటి సోదరులతో పాటు వారి స్నేహితుడు విక్ జీవితాల్లోకి ఊహించని అతిథి రావడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ జీవి తన వద్ద ఉన్న పురాతన ఎలిమెంటల్ మాయా శక్తులను ఈ ముగ్గురికీ అందిస్తుంది. అక్కడి నుంచి వాళ్లకు ఎదురయ్యే సవాళ్లు ఊహించని మలుపులు తీసుకుంటాయి. మాయా శక్తులు పొందిన బ్రియార్, బ్రాంబుల్, విక్ ఒక మనుషులకు కనిపించని రహస్య ప్రపంచమైన ‘ఈవ్ సిటీ’లోకి ప్రవేశిస్తారు.
అక్కడ తమకు వచ్చిన శక్తులను ఎలా నియంత్రించాలి ? వాటిని ఎలా ఉపయోగించాలి ? అనే విషయాల్లో శిక్షణ తీసుకోవాల్సి వస్తుంది. మార్షల్ ఆర్ట్స్‌తో తమ సామర్థ్యాలకు మరింత పదును పెడతారు. అయితే కొత్త శక్తులు వచ్చిన తర్వాత బ్రియార్ లో ఓ కొత్త సమస్య మొదలవుతుంది. ఎప్పుడూ అందరినీ కాపాడే పెద్దన్నగా ఉండే అతడు… ఇప్పుడు మిగిలిన ఇద్దరి కంటే తానే బలహీనుడిననే భావనకు లోనవుతాడు. తన స్థానాన్ని కోల్పోతున్నాననే ఆత్మన్యూనత అతడిని మరింత గందరగోళంలోకి నెడుతుంది.
అదే సమయంలో ఈ పరిస్థితిని ఓ దుష్ట శక్తి తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. బ్రియార్ బలహీనతను ఆసరాగా చేసుకుని అతడిని తమ కుట్రలోకి లాగుతుంది. చివరికి ఈ కుట్ర మానవ ప్రపంచానికే కాదు… మాయా ప్రపంచానికి కూడా భారీ ముప్పుగా మారుతుంది. రెండు లోకాలను నాశనం చేయగల ‘షా’ అనే పురాతన వినాశకర శక్తిని మేల్కొలిపే పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు బ్రియార్, బ్రాంబుల్, విక్ ముందున్న అసలు సవాలు ఒక్కటే. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి ఆ భయంకరమైన శక్తిని ఎలా ఆపాలి ? చివరికి స్నేహం, ధైర్యం, ఐక్యతే తమ అసలైన బలం అని తెలుసుకున్న ఈ ముగ్గురూ కలిసి ఎలా ఫైట్ చేశారు ? రెండు ప్రపంచాలను కాపాడేందుకు వాళ్లు చేసిన పోరాటం ఏంటి ? అన్నదే సినిమా క్లైమాక్స్.
ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ యానిమేషన్ మూవీని తెలుగు డబ్బింగ్‌తో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ్ భాషల్లో కూడా చూడవచ్చు. తెలుగు టీవీ ప్రేక్షకులకు ఇప్పటికే పరిచయమైన Boonie Bears ఫ్రాంచైజీని ఇష్టపడే పిల్లలకు ఇది ప్రత్యేకంగా నచ్చే అవకాశం ఉంది. అలాగే ఫాంటసీ, అడ్వెంచర్, యాక్షన్‌తో పాటు కుటుంబ బంధాలు, స్నేహం, ఐక్యత వంటి ఎమోషనల్ అంశాలను కూడా కలిపిన ఈ సినిమా పిల్లలతో కలిసి ఫ్యామిలీ అంతా చూసేందుకు మంచి ఆప్షన్.