క్షేత్రస్థాయిలో ఉద్యోగులంతా సంఘాలపై గుర్రుగా ఉన్నారు. సర్కార్ పట్టింపులేనితనంతో అసహనం పెరిగిపోయింది. జీతభత్యాలు పెంచుమని అడిగిన ప్రతీసారి ఏదో ఒకటి చెప్పి బుజ్జగించి వెనక్కి పంపడమే తప్ప.. ఇచ్చిందేమీ లేదనే అసంతృప్తి పేరుకుపోయింది. దీనంతటికీ కారణం ఉద్యోగ సంఘాలేనని డిసైడ్ అయిన ఉద్యోగులు.. ఉద్యోగ జేఏసీ నేతలపై తీవ్ర ఒత్తిడి పెంచారు ఈసారి.
సర్కార్‌తో తాడోపేడో తేల్చుకోండి.. ఇలా వెళ్లి అలా తిరిగి వస్తామంటే కుదరదు.. తియ్యటి మాటలకు తీర్థం పోతే.. మా బతుకులు ఆగమవుతున్నాయని గట్టిగానే అర్సుకుని వదిలారు. దీంతో ఇక తప్పేలా లేదని, ఉద్యోగ జేఏసీ పెద్దలు మారం జగదీశు, ఏలూరి శ్రీనివాసులు సీరియస్ ముఖాలు పెట్టారు. ఇక వినేదే లేదని సర్కార్ వద్ద భీష్మించుకు కూర్చున్నారు.
అయినా సీఎం రేవంత్ వినలేదు. ఇక్కడ ఉన్నదేందీ? మీకు ఇచ్చేదేందీ..? ఈ బెదిరింపులేలా..? అని గదమాయించే ప్రయత్నం చేశారు. మరో సందర్భంలో బుజ్జగించారు కూడా. ప్లీజ్ వినండి.. మీరే రోడ్డెక్కితే ఎట్లా.. ఓ రెండేండ్లు ఆగండి.. అన్నీ నేను సెట్ చేస్తా.. మీరు బేఫికర్ ఉండండి.. అని అభయహస్తం ఇచ్చారు.
అయినా నమ్మలేదు ఉద్యోగులు. రేపటి నుంచి.. అంటే పదో తారీఖు (గురువారం)న ఛలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో దీన్ని సక్సెస్ చేయాలనే నిర్ణయించారు. అక్కడ ఉద్యోగులంతా మంచి కసి మీద ఉన్నారు. దీంతో సర్కార్ మధ్యే మార్గంగా సీఎస్‌ను రంగంలోకి దింపి దౌత్యం వహించేలా చేసింది.
సీఎస్ రాతపూర్వక హామీ ఇవ్వడంతో ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈనెల 18 వరకు టైమ్ ఇచ్చి.. 19న మళ్లీ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి మరీ శాంతించారు. పీఆర్‌సీని అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను మంజూరు చేయాలని, ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన రూ. 10వేల కోట్లు విడుదల చేయాలని, కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ఉపసంహరించి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కొత్త హెల్త్ ఇన్సురెన్స్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఛలో హైదరాబాద్ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
వీటిపై చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజూ ఇచ్చిన రాత పూర్వక హామీని విశ్వసించి తమ ఆందోళన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు టీ ఉద్యోగ జేఏసీ ప్రకటించింది.