Feel good Movie : ఓటీటీలో ఎన్నో కొత్త కొత్త సినిమాలు అందుబాటులో ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు ఏదైనా కొత్తగా చూద్దాం అన్పిస్తుంది. కొన్నిసార్లు మంచి మనసుకు హత్తుకునే మూవీని చూడాలి అన్పిస్తుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుందా ? అయితే ఈ మూవీ మీ కోసమే. మరి ఈ స్టోరీ ఏంటి ? సినిమా పేరేంటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
2013లో విడుదలైన బెంగాలీ డ్రామా ‘అపూర్ పంచాలి’ (Apur Panchali). కౌశిక్ గంగోపాధ్యాయ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సత్యజిత్ రే ‘పథేర్ పంచాలి’లో అపు పాత్ర పోషించిన చిన్నారి నటుడు సుబీర్ బెనర్జీ జీవితం ఆధారంగా తీసిన సెమీ-బయోపిక్. ఇది ఒక ఎమోషనల్, ఆలోచనాత్మకమైన సినిమా. అపు త్రయం (పథేర్ పంచాలి, అపరాజితో, అపూర్ సంసార్)లోని అపు జీవితంతో సుబీర్ జీవితం మధ్య అద్భుతమైన సారూప్యతలను చూపిస్తుంది. సుమారు 1 గంట 37 నిమిషాలు రన్ టైమ్ ఉన్న ఈ చిత్రానికి IMDbలో 7.6 రేటింగ్ ఉంది. అంతేకాదు బెంగాలీ సినిమాల్లో ఒక మంచి ఎమోషనల్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకుంద. అపు త్రయం గురించి తెలిసిన వాళ్లకు ఇది మరింత స్పెషల్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం జియో హాట్ స్టార్ (Jio hotstar)లో అందుబాటులో ఉంది.
ఒక యంగ్ ఫిల్మ్ స్టూడెంట్ అర్క (గౌరవ్ చక్రబర్తి) సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ నుంచి జర్మనీలో జరిగే అవార్డ్ సెర్మనీకి సుబీర్ బెనర్జీని ఆహ్వానించడానికి వెళ్తాడు. ఎందుకంటే ఒకప్పుడు సుబీర్ పథేర్ పంచాలిలో అపు అనే బాలుడి పాత్రను పోషించాడు. ఈ విషయమై అర్క సుబీర్ ఇంటికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూస్తే సుబీర్ (అర్ధేందు బెనర్జీ) వయసు ఇప్పుడు 60కి పైగానే ఉంటుంది. ఒంటరిగా బతుకుతున్న ఆయన కొంచెం బద్ధకంగా కన్పిస్తాడు. అలాగే పొరుగు వాళ్లు అతను కోపిష్టి అని అనుకుంటూ ఉంటారు. ఇక అర్క రాకతో విషయం తెలుసుకుని, మొదట సుబీర్ అవార్డ్ తీసుకోవడానికి నిరాకరిస్తాడు. కానీ అర్క పట్టు వదలకుండా తన మాటలతో, పట్టుదలతో అతన్ని మాట్లాడించి, తన జీవిత కథ చెప్పమని అడుగుతాడు.
ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. సుబీర్ తన చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాడు. ‘పథేర్ పంచాలి’ సెట్‌లో ఎలా ఎంటర్ అయ్యాడు? సత్యజిత్ రే ఎలా డైరెక్ట్ చేశాడు? ఫిల్మ్ షూటింగ్ సమయంలోని సరదాలు, కష్టాలు అన్నీ ఒక్కొక్కటిగా అతని కళ్ళ ముందు మెదులుతాయి. కానీ తర్వాత అతని జీవితం అపు లైఫ్ లాగే భయంకరంగా మారిపోతుంది: చిన్నప్పుడు ఫేమస్ అయ్యాడు. తర్వాత ఫిల్మ్స్ లేవు, ఒంటరితనం, తల్లిదండ్రులు, భార్య మరణం, ఆర్థిక ఇబ్బందులు, సొసైటీ అతన్ని మరచిపోవడం వంటి బాధకరమైన సంఘటనలు అతని జీవితంలో జరుగుతాయి. అతని భార్య మరణం అపూర్ సంసార్‌లో అపు భార్య మరణం లాగే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే అతను పోషించిన రీల్ లైఫ్ పాత్రకు జరిగినట్టే రియల్ లైఫ్ లోనూ జరుగుతుందన్న మాట. ఇది అతన్ని ఎమోషనల్‌గా కుంగదీస్తుంది. చివరికి సుబీర్ అర్కతో సన్నిహితంగా మాట్లాడతాడు. తన గతాన్ని అంగీకరించి, అవార్డ్ తీసుకోవడానికి సిద్ధపడతాడు. మరి అతన్ని అర్క ఏం చెప్పి అవార్డు తీసుకోవడానికి ఒప్పించాడు? అనేది ఈ ఎమోషనల్ జర్నీని చూసి తెలుసుకోవాలి. ఫేమ్, ఒంటరితనం వంటి అంశాలతో.సినిమా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. నాస్టాల్జిక్ ఫీలింగ్ తో ఎమోషనల్ గా గుండెను మెలిపెట్టే ఈ మూవీ కన్నీళ్ళు పెట్టించడమే కాదు, ఆలోచింపజేస్తుంది కూడా. ఇది సుబీర్ బెనర్జీ జీవితానికి ఒక ట్రిబ్యూట్.
Also Read : షాహిద్ కపూర్ – త్రిప్టీ దిమ్రీ మూవీకి కోర్టులో ఊరట… థియేట్రికల్ రన్ తరువాత ఈ ఓటీటీలోనే స్ట్రీమింగ్