French Heist Thriller: ఒక వ్యక్తి జైల్లో ఉంటే అతడు బయట జరిగే నేరాలకు ఎలా బాధ్యుడు అవుతాడు ? అతడిని పోలిన వ్యక్తి అదే స్టైల్ లో దొంగతనాలు చేస్తుంటే పోలీసులు ఎవరిని నమ్మాలి ? దొంగతనం జరిగిన ప్రదేశంలో ఆధారాలన్నీ ఒకరినే చూపిస్తున్నా, ఆ వ్యక్తి మాత్రం తాను నిర్దోషినని చెబితే కేసు ఎలా ముందుకు సాగుతుంది ? ఇలా తెలివి, వేషధారణ, ప్లానింగ్ తో పోలీసులను తికమక పెట్టే జెంటిల్‌మన్ దొంగ అసానే డియోప్ మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నెట్‌ఫ్లిక్స్ పాపులర్ ఫ్రెంచ్ సిరీస్ ‘లూపిన్’ (Lupin) నాలుగో భాగం తాజాగా విడుదలైంది. ఈసారి అసానే తనపై పడిన నేరారోపణలను తుడిచేసుకోవడమే కాకుండా, తన పేరుతో ఆటలాడుతున్న వ్యక్తి ఎవరో కనిపెట్టాల్సి వస్తుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ కొత్త పార్ట్ స్ట్రీమింగ్ ఎక్కడ ? అనేది వివరంగా తెలుసుకుందాం పదండి.
అసానే డియోప్ చిన్నప్పటి నుంచే ఆర్సేన్ లూపిన్ అనే కల్పిత జెంటిల్‌మన్ దొంగ పాత్రకు అభిమానిగా పెరుగుతాడు. తన తండ్రి బబాకర్ ఒక విలువైన నెక్లెస్ దొంగతనం చేశాడనే తప్పుడు ఆరోపణలతో చిక్కుల్లో పడటం, ఆ తర్వాత అతడి మరణం అసానే జీవితాన్ని మార్చేస్తాయి. తన తండ్రిని అన్యాయంగా ఇరికించిన సంపన్నుడు హ్యూబర్ట్ పెల్లెగ్రినీపై ప్రతీకారం తీర్చుకోవాలని అసానే నిర్ణయించుకుంటాడు. ఆ ప్రయాణంలో అతడు తన తెలివితేటలు, వేషాలు మార్చుకునే నైపుణ్యం, ముందుగానే వేసుకున్న ప్లాన్లతో పోలీసులను ముప్పుతిప్పలు పెడతాడు.
గత భాగాల్లో అసానే అనేక ప్రమాదాలను ఎదుర్కొని, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. మూడో భాగం చివర్లో అతడు పోలీసులకు లొంగిపోవడంతో జైల్లోకి వెళ్తాడు. నాలుగో భాగం ప్రారంభమయ్యే సమయానికి అసానే జైల్లోనే ఉంటాడు. ఈసారి అతడు గతంలా దొంగతనాలు చేయాలని అనుకోడు. శిక్ష అనుభవించి, కొడుకు రౌల్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకుని కుటుంబంతో ప్రశాంతంగా జీవించాలని భావిస్తాడు.
కానీ అతడి పేరుతో ఓ రహస్య ప్రకటన వెలువడుతుంది. ఒకేసారి పలు మ్యూజియాల్లో దొంగతనాలు జరగబోతున్నాయి అనేది ఆ ప్రకటన సారాంశం. భద్రత కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ దొంగతనాలు విజయవంతమవుతాయి. అసానే జైల్లో ఉన్నా, సీసీటీవీ దృశ్యాల్లో అతడే ఓ మ్యూజియంలో కనిపిస్తాడు. ఓ దాడిలో పోలీసు అధికారి బెల్కాసెమ్ తీవ్రంగా గాయపడటంతో అనుమానం మరింత పెరుగుతుంది. అసానే తాను నిర్దోషినని చెబుతున్నా, ఆధారాలు మాత్రం అతడికి వ్యతిరేకంగా ఉంటాయి.
తన పేరును ఉపయోగించుకుని నేరాలు చేస్తున్న వ్యక్తిని బయట పెట్టాలంటే అసానే జైలు నుంచి తప్పించుకుని మరోసారి లూపిన్ వేషంలోకి రావాల్సి వస్తుంది. అతడి కుటుంబం, స్నేహితులు, పోలీసుల మధ్య సంబంధాలు మరోసారి కీలకంగా మారతాయి. అసానే నిజంగా ఎవరి కోసం ఈ గేమ్ ఆడుతున్నాడు ? అతడిని ఇరికిస్తున్న వ్యక్తి ఎవరు ? తన నిర్దోషిత్వాన్ని ఎలా నిరూపించుకుంటాడు ? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ పార్ట్.
‘లూపిన్’ నాలుగో భాగం అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులోకి వచ్చింది. ఫ్రెంచ్ ఒరిజినల్‌తో పాటు ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ ఆడియోలతో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. స్మార్ట్ హీస్ట్‌లు, మిస్టరీలు, ఊహించని ట్విస్టులు ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కొత్త భాగం చూసే ముందు గత కథ గుర్తు చేసుకోవాలనుకుంటే మొదటి మూడు భాగాలను కూడా రీక్యాప్ చేసుకోవచ్చు.
Read Also: 90 ఏళ్లకోసారి వచ్చే ఫెస్టివల్… పండగకు పిలిచి పాతిపెట్టే ప్లాన్… సీట్ ఎడ్జ్ సర్వైవల్ థ్రిల్లర్