Japanese Action Series: రాజ్యాధికారం కోసం జరిగే యుద్ధాల్లో సైన్యాల బలం ఎంత ముఖ్యమో, శత్రువుల కదలికలను ముందుగానే పసిగట్టే నింజాల పాత్ర కూడా అంతే కీలకం. ముఖ్యంగా పాలకుడి నిర్ణయంతో ఒక వర్గం మొత్తం ప్రమాదంలో పడితే, అతడిని ఎదిరించడానికి ప్రాణాలకు తెగించే యోధులు రంగంలోకి దిగితే పోరాటం నెక్స్ట్ లెవెల్ కి చేరుతుంది. జపాన్ చరిత్రలోని అధికార పోరాటాలను నింజాల సాహసాలతో కలిపి చూపించే హిస్టారికల్ యాక్షన్ సిరీస్ ‘షాడోస్ ఆఫ్ ది టెన్ నింజా’ (Shadows of the Ten Ninja). టోకుగావా ఇయేయాసు ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ, టొయోటోమి వర్గానికి అండగా నిలిచే సనాడా యోధుల పోరాటమే ఈ సిరీస్ నేపథ్యం. మరి యాక్షన్ ప్రియులు ఈ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో అందుబాటులో ఉందా లేదా ? అనే వివరాల్లోకి వెళ్తే…
జపాన్ లో జరిగిన చారిత్రక సెకిగహరా యుద్ధంలో టోకుగావా ఇయేయాసు విజయం సాధించి, దేశంలో అత్యంత శక్తివంతమైన పాలకుడిగా ఎదుగుతాడు. ఆ యుద్ధం జరిగి పద్నాలుగేళ్లు గడిచినా, టొయోటోమి వర్గానికి సంబంధించిన పోరాటం పూర్తిగా ముగిసిపోదు. ఆ వర్గానికి మద్దతుగా నిలిచిన యోధుడు యుకిమురా సనాడా, కొడోయామాలో నిర్బంధంలో ఉంటాడు. అతడికి నమ్మకంగా ఉండే నింజాలు మాత్రం రహస్యంగా సేవలు కొనసాగిస్తుంటారు. ఇదే సమయంలో సాసుకే సరుటోబి అనే నింజా పరిచయమవుతాడు. స్ట్రాంగ్ ఫిజికల్ స్ట్రెంత్, నింజా విద్యలో నైపుణ్యం ఉన్నప్పటికీ, అతడు ఎవరికీ విధేయుడిగా ఉండటానికి ఇష్టపడడు. దొంగతనాలు చేస్తూ తనకు నచ్చినట్టు జీవిస్తుంటాడు.
అయితే గతంలో తనకు నింజా విద్య నేర్పిన గురువు వైట్ క్లౌడ్ స్లాష్ ను ఐదేళ్ల తర్వాత కలుస్తాడు. శక్తిని ఇతరుల కోసం ఉపయోగించాలని గురువు చెప్పినా, సాసుకే మాత్రం ఆ మాటలను వెంటనే అంగీకరించడు. అలాంటి సమయంలో టోకుగావా వర్గానికి చెందిన నింజా అక్కడికి రావడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. సాసుకే జీవితాన్ని ఎఫెక్ట్ చేసే విషాద సంఘటన చోటు చేసుకుంటుంది. దీంతో అతడి ప్రయాణం కొత్త మలుపు తిరుగుతుంది. గురువు అప్పగించిన బాధ్యతను నెరవేర్చేందుకు కొడోయామా వైపు బయలుదేరిన సాసుకేకు, అక్కడ సనాడా యోధులు ఎదురవుతారు.
అప్పటివరకు తనకంటూ ప్రత్యేకంగా జీవించిన అతడు, ఇప్పుడు ఓ పెద్ద పోరాటంలో భాగం అవుతాడు. మరోవైపు టొయోటోమి వంశానికి చెందిన యువ నాయకుడు హిడేయోరి తిరుగుబాటు చేయవచ్చనే భయంతో ఇయేయాసు ఆ వర్గంపై పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధమవుతాడు. ఈ పరిణామంతో యుకిమురా కూడా నిర్బంధం నుంచి బయటపడి, తనకు నమ్మకంగా ఉన్న నింజాలతో కలిసి టోకుగావా సైన్యాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ సిరీస్ లో ప్రధాన ఆకర్షణ కేవలం కత్తి యుద్ధాలు మాత్రమే కాదు. సాసుకే లాంటి స్వతంత్రంగా జీవించే నింజా, ఒక పెద్ద లక్ష్యం కోసం తన శక్తిని ఉపయోగించాల్సి రావడం, యుకిమురా తన వర్గాన్ని కాపాడుకునేందుకు చేసే ప్రయత్నం, ఇయేయాసు అధికారాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదల వంటి అంశాలతో సాగుతుంది కథ.
‘షాడోస్ ఆఫ్ ది టెన్ నింజా’ 2026 అక్టోబర్ 23 నుంచి జపాన్‌లో టీవీ అసాహిలో ప్రసారమవుతోంది. అంతర్జాతీయంగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ ఆడియో అందుబాటులో లేదు. హికారు ఇవామోటో (Hikaru Iwamoto), తైషి నకగావా (Taishi Nakagawa), రిక్కా ఇహారా (Rikka Ihara) ప్రధాన పాత్రల్లో నటించారు. జపాన్ చారిత్రక నేపథ్యం, నింజాల పోరాటాలు, భారీ యాక్షన్ సన్నివేశాలు ఇష్టపడేవారికి ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది.
Read Also: గాయపడిన అమ్మాయిని కాపాడి దేశాన్ని కుదిపేసే కుట్రలో బలయ్యే పోలీస్… తెలుగులోనూ స్ట్రీమింగ్