Japanese Comedy Drama: ఒకప్పుడు అతడి పేరు తెలియని వారే లేరు. సినిమాలు, నాటకాలతో ఎంతో పేరు సంపాదించాడు. ఎక్కడికి వెళ్లినా అభిమానులు చుట్టుముట్టేవారు. కానీ ఒక్కరోజులోనే అందరూ అతడిని మర్చిపోతే… తనను ప్రాణంగా అభిమానించిన వాళ్లు కూడా గుర్తుపట్టకపోతే… చివరికి సొంత కుటుంబం కూడా పరాయివాడిలా చూస్తే ఆ నటుడి పరిస్థితి ఎలా ఉంటుంది ? స్టార్‌డమ్ ఎంత తాత్కాలికమో, గుర్తింపు కోల్పోయిన వ్యక్తి మళ్లీ తన స్థానాన్ని సంపాదించుకోవడానికి ఎంతగా కష్టపడాల్సి వస్తుందో చూపించే జపనీస్ సిరీస్ ‘డిడ్ సమ్‌వన్ హాపెన్ టు మెన్షన్ మీ?’ (Did Someone Happen to Mention Me?). మరి స్టార్స్ జీవితం ఎలా ఉంటుందో కళ్ళకు కట్టిన ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.
జెన్ తకసెగావా ఒకప్పుడు జపాన్ లో పేరున్న నటుడు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని, దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదిస్తాడు. అతడి పేరు చెబితే చాలు, చాలామందికి వెంటనే గుర్తొచ్చే స్థాయికి ఎదుగుతాడు. వేదికపై తన ప్రతిభను నిరూపించుకోవడమే కాకుండా, లండన్ లో నాటక ప్రదర్శనలతోనూ పేరు తెచ్చుకుంటాడు. ముఖ్యంగా ‘కింగ్ లియర్’ పాత్రలో అతడి నటనకు మంచి స్పందన లభిస్తుంది. ఇంతటి గుర్తింపు సంపాదించిన జెన్ జీవితం ఒకరోజు అనూహ్యంగా మారిపోతుంది.
జపాన్ కు తిరిగి వచ్చిన తర్వాత అతడికి ఎదురయ్యే పరిస్థితి ఊహించని విధంగా ఉంటుంది. ఒకప్పుడు తనను చూసేందుకు ఆసక్తి చూపించిన వాళ్లు ఇప్పుడు అతడిని గుర్తుపట్టరు. తన పేరు చెప్పినా ఎవరికీ ఏమీ గుర్తుకురాదు. అంతేకాదు, సొంత కుటుంబం కూడా అతడిని గుర్తించనట్టుగా ప్రవర్తిస్తుంది. తన జీవితంలో ఇంత పెద్ద మార్పు ఎందుకు జరిగిందో జెన్ కు అర్థం కాదు. తాను అదే మనిషినని చెప్పుకోవడానికి ప్రయత్నించినా, అతడి మాటలను ఎవరూ నమ్మరు.
ఒకప్పుడు తన ప్రతిభకు గుర్తింపుగా లభించిన గౌరవం ఇప్పుడు కనిపించదు. అధికారులు కూడా అతడిని సాధారణ వృద్ధుడిలా చూస్తారు. తన గతాన్ని గుర్తుచేసే వ్యక్తులు లేకపోవడం, తన పేరు మీద సంపాదించుకున్న గుర్తింపు ఒక్కసారిగా మాయమవడం జెన్ ను తీవ్రంగా కలవరపెడుతుంది. అయినా అతడు అక్కడితో ఆగిపోడు. తన పాత జీవితాన్ని తిరిగి పొందాలంటే ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంటాడు.
అప్పటివరకు స్టార్ గా వెలిగిన జెన్ మళ్లీ మొదటి నుంచి ప్రయత్నించాల్సి వస్తుంది. చిన్న పాత్రల కోసం ఆడిషన్లకు వెళ్లడం, సినిమా సెట్లలో అవకాశాల కోసం ఎదురు చూడడం అతడి జీవితంలో భాగమవుతాయి. ఒకప్పుడు తనను గుర్తించడానికి జనం పోటీ పడితే, ఇప్పుడు కనీసం తన ప్రతిభను గుర్తించే ఒక్కరైనా దొరుకుతారా అని ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో అతడు ఎదుర్కొనే పరిస్థితులు నవ్వు తెప్పిస్తూనే, గుర్తింపు కోసం మనిషి పడే తపనను కూడా చూపిస్తాయి. అసలు జెన్ ను అందరూ ఎందుకు మర్చిపోయారు ? తన పాత గుర్తింపును తిరిగి సంపాదించుకోగలడా ? అనేదే ఈ సిరీస్‌లో చూడాల్సిన అసలుసిసలైన కథ.
కోజి యకుషో ప్రధాన పాత్రలో నటించిన జపనీస్ సిరీస్ ‘డిడ్ సమ్‌వన్ హాపెన్ టు మెన్షన్ మీ?’ (Did Someone Happen to Mention Me?). అక్టోబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. వినూత్నమైన కథలు, హాస్యం, భావోద్వేగాలతో కూడిన డ్రామాలు ఇష్టపడేవారికి ఈ సిరీస్ కొత్త అనుభూతిని ఇవ్వొచ్చు. ఒకప్పుడు ప్రపంచమంతా గుర్తించిన వ్యక్తి, మళ్లీ తన ఉనికిని నిరూపించుకోవాల్సి వస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఈ కథను ఆసక్తికరంగా మారుస్తుంది.
Read Also: షార్ట్ కట్‌లో కోటీశ్వరుడు కావాలని పాడు పని… రాత్రికి రాత్రే రోడ్డున పడే క్యాబ్ డ్రైవర్