Kannada Horror Mystery Thriller: ఇంట్లో అందరూ కలిసి సంతోషంగా ఉండాల్సిన సమయంలో… వరుసగా అనుకోని సంఘటనలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుంది ? అందులోనూ కుటుంబంలో జరిగిన మరణాల వెనుక అసలు కారణం ఏంటో తెలియకపోతే, ప్రతి చిన్న విషయం అనుమానంగానే కనిపిస్తుంది. ఒకవైపు దేవుడిపై నమ్మకం, మరోవైపు ఇంట్లో జరుగుతున్న వింతలు… అసలు నిజం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించే ఓ మహిళ కథే ‘అయ్యన మనే 2’ (Ayyana Mane 2). మొదటి సీజన్‌లో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచిన ఈ కన్నడ మిస్టరీ థ్రిల్లర్, రెండో సీజన్‌లో మరిన్ని కుటుంబ రహస్యాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో అన్నది తెలుసుకుందాం పదండి.
జాజీ పెళ్లి చేసుకుని తన భర్త దుష్యంత్ కుటుంబానికి చెందిన పాత ఇంట్లోకి అడుగు పెడుతుంది. అప్పటి నుంచే ఆమెకు ప్రశాంతత కరువవుతుంది. ఆ ఇంట్లో కోడళ్లుగా వచ్చిన మహిళలు అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోవడం వెనుక ఏదో రహస్యం ఉందనే అనుమానం ఆమెను వెంటాడుతుంది. ఈ మరణాలన్నీ కుటుంబానికి సంబంధించిన కొండయ్య దేవుడి శాపం వల్లే జరుగుతున్నాయని కొందరు నమ్ముతుంటారు. కానీ జాజీ మాత్రం జరుగుతున్న ప్రతిదాన్నీ గుడ్డిగా నమ్మకుండా, అసలు నిజం తెలుసుకోవాలని అనుకుంటుంది.
మొదటి సీజన్‌లో ఈ ఇంట్లో జరిగిన మరణాలు, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు, బయటకు రాని నిజాలు వంటి అంశాలు ఉంటాయి. ఇప్పుడు రెండో సీజన్ లో నాగలాంబిక మరణం చుట్టూ ఉన్న మిస్టరీకి ప్రాధాన్యం పెరుగుతుంది. మహాలయ అమావాస్య సమీపిస్తుండగా ఇంట్లో వింత సంకేతాలు కనిపించడం మొదలవుతుంది. గతంలో జరిగిన సంఘటనలు మళ్లీ గుర్తుకొస్తూ కుటుంబ సభ్యుల్లో భయాన్ని పెంచుతాయి.
మరోవైపు పూర్ణికి కనిపించే వింత దృశ్యాలు ఇంట్లో అనుమానాలను మరింత పెంచుతాయి. నిజంగానే ఏదైనా అతీంద్రియ శక్తి ఆ ఇంటిని వెంటాడుతోందా ? లేక ఈ భయాన్ని ఆసరాగా చేసుకుని ఎవరో తమ రహస్యాలను దాచిపెడుతున్నారా ? అనే సందేహం కలుగుతుంది. జాజీకి ఎదురయ్యే అసలు సవాలు కూడా ఇదే. కుటుంబ సభ్యులందరినీ అనుమానించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరిని నమ్మాలి ? ఎవరిని నమ్మకూడదనే ప్రశ్న ఆమెను వెంటాడుతుంది.
రెండో సీజన్‌లో కుటుంబంలో జరిగే మరో విషాదం కథను కొత్త మలుపు తిప్పుతుంది. ఆ తర్వాత ఓ చిన్నారి కనిపించకుండా పోవడం, ఒక పెళ్లి కార్డు ద్వారా కీలకమైన ఆధారం బయటపడటం వంటి పరిణామాలు ఉత్కంఠను పెంచుతాయి. చేతిరాతకు సంబంధించిన ఆధారం కూడా చివరి భాగంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీంతో ఇప్పటివరకు జరిగిన సంఘటనల వెనుక ఉన్న నిజం ఏంటనే ఆసక్తి పెరుగుతుంది. ఇంతకీ ఆ ఇంట్లో ఏం జరుగుతోంది ? క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏంటి ? అనేది తెలుసుకోవాలనే సిరీస్ ను చూడాల్సిందే.
‘అయ్యన మనే 2’ అక్టోబర్ 23 నుంచి జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సీజన్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్‌లు ఉన్నాయి. జీ5లో ఈ సిరీస్‌కు కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల ఆడియో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి తెలుగులో మిస్టరీ, హారర్ థ్రిల్లర్ సిరీస్‌లు చూడాలనుకునే వారు ఈ సిరీస్ ను మిస్ అవ్వొద్దు. అయితే మొదటి సీజన్ చూడని వారు ముందుగా దాన్ని చూస్తే, జాజీ కుటుంబంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి మొదలైన రహస్యాలు, రెండో సీజన్‌లో వచ్చే మలుపులు మరింత స్పష్టంగా అర్థమవుతాయి. ఈ సిరీస్‌లో ఖుషి రవి (Khushi Ravi), మానసి సుధీర్ (Manasi Sudhir), అక్షయ్ నాయక్ (Akshay Nayak), హిత చంద్రశేఖర్ (Hitha Chandrashekar), అనిరుధ్ ఆచార్య (Anirudh Acharya) నటించారు. రమేశ్ ఇంద్ర (Ramesh Indira) దర్శకత్వం వహించారు. ఈ సీజన్‌లో ప్రతి సంఘటన వెనుక మరో రహస్యం దాగి ఉందేమోననే భావన ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.