Kannada Supernatural Horror Thriller: చనిపోయిన తల్లి తన కళ్ల ముందే కనిపిస్తోందని ఓ చిన్నారి చెబుతుంది.. మొదట ఆ పాప మాటలను ఎవరూ నమ్మరు. కానీ ఆ తర్వాత ఇంట్లో జరిగే వింత సంఘటనలు ఒక్కొక్కటిగా అందరినీ భయపెడతాయి. చిన్నారిని వెంటాడుతున్నది నిజంగానే తల్లి ఆత్మేనా ? లేక దాని వెనుక మరేదైనా భయంకరమైన శక్తి ఉందా ? ఈ మిస్టరీని ఛేదించేందుకు ఓ పోలీసు అధికారి అఘోరీని ఆశ్రయిస్తాడు. అక్కడి నుంచి ఆత్మలు, పూజలు, ఊహించని పరిణామాలతో సాగే కన్నడ హారర్ థ్రిల్లర్ ‘భైరాదేవి’ (Bhairadevi). హర్రర్ మూవీ లవర్స్ ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అంటే…
ఓ పోలీసు అధికారి కుటుంబంలో మొదలైన వింత సంఘటనలు క్రమంగా పెద్ద సమస్యగా మారతాయి. అతడి కుమార్తెకు చనిపోయిన తల్లి కనిపిస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. మొదట చిన్నారి భయంతో అలా చెబుతోందని అనుకున్నా, ఆ తర్వాత జరిగే సంఘటనలు వారి అనుమానాలను పెంచుతాయి. ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉన్నట్లు అనిపించడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఎదురవుతుంది.
తన కుమార్తెకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని ఆ పోలీసు అధికారి భయపడతాడు. ఈ సమస్యకు సాధారణంగా పరిష్కారం దొరకదని భావించి, అతీంద్రియ శక్తుల గురించి తెలిసిన ఓ అఘోరీ సాయం కోరతాడు. ఆమె రంగంలోకి దిగిన తర్వాత అక్కడ జరుగుతున్న సంఘటనల వెనుక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం మొదలవుతుంది. అయితే ఆ కుటుంబాన్ని భయపెడుతున్నది ఏమిటో గుర్తించడం అంత సులభంగా ఉండదు.
ఆత్మల ఉనికి, అఘోరీ చేసే పూజలు, భయంకరమైన పరిస్థితులు కథలో ఉత్కంఠను పెంచుతాయి. ఒకవైపు తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే పోలీసు అధికారి ప్రయత్నిస్తుంటే, మరోవైపు ఈ సమస్యకు ముగింపు పలికేందుకు అఘోరీ పోరాడుతుంది. కనిపించని శక్తుల వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? చిన్నారికి నిజంగానే తల్లి ఆత్మ కనిపిస్తోందా ? ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి ఆ కుటుంబం బయట పడుతుందా ? అన్నదే సినిమాలో చూసి తెలుసుకోవలసిన అంశం.
‘భైరాదేవి’ కన్నడలో రూపొందిన హారర్ థ్రిల్లర్. ప్రస్తుతం ఈ సినిమా Jio Hotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ లేదు. కాబట్టి సినిమా చూడాలనుకునే వారు ఓటీటీలో కన్నడ భాషలోనే చూడాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో రాధిక కుమారస్వామి (Radhika Kumaraswamy), రమేశ్ అరవింద్ (Ramesh Aravind), అను ప్రభాకర్ (Anu Prabhakar) ముఖ్య పాత్రల్లో నటించారు. రాధిక కుమారస్వామి ప్రధాన పాత్రలో కనిపించగా, శ్రీజై (Srijai) దర్శకత్వం వహించారు. హారర్ సన్నివేశాలు, ఆధ్యాత్మిక అంశాలు, అతీంద్రియ శక్తుల చుట్టూ తిరిగే కథ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.