Dorothy OTT Release: కొన్ని సినిమాలు యాక్షన్ తో ఆకట్టుకుంటాయి. మరికొన్ని ప్రేమకథలతో మనసుకు దగ్గరవుతాయి. ఇంకొన్ని మాత్రం సమాజం మాట్లాడటానికి ఇష్టపడని విషయాలనే తెరపైకి తీసుకొచ్చి చర్చకు దారితీస్తాయి. ఓ ఊరిలో అందరూ అబ్బాయిలు ఇలా ఉండాలి, అమ్మాయిలు ఇలా ప్రవర్తించాలి అంటూ కొన్ని రూల్స్ పెట్టుకుంటారు. కానీ వాటిని ప్రశ్నించే వ్యక్తి ఎదురైతే ఏం జరుగుతుంది ? స్నేహం, మగతనం గురించి ఉండే పాత ఆలోచనలు, వ్యక్తిగత స్వేచ్ఛ మధ్య సంఘర్షణ మొదలైతే సంబంధాలు ఎలా మారతాయి ? కీర్తి సురేష్ నటించిన తమిళ చిత్రం ‘డొరోథీ’ (Dorothy) ఇలాంటి సామాజిక అంశాలను తెరపైకి తీసుకొచ్చింది. పెద్దల కోసం రూపొందించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు సహా పలు భాషల్లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ వివాదాస్పద సినిమాను ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అంటే…
కథ 1995లోని మదురై ప్రాంతంలోని ఓ గ్రామంలో సాగుతుంది. సుబ్బు స్థానిక గ్యాంగ్‌స్టర్ వీరయ్య కుమారుడు. అతడికి కార్తితో మంచి స్నేహం ఉంటుంది. ఇద్దరి మధ్య కులం, ఆర్థిక స్థితి, సామాజిక నేపథ్యం వంటి తేడాలున్నా, వారి స్నేహం మాత్రం బలంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచే సుబ్బు తన స్నేహితుడికి ధైర్యంగా ఉండాలని, అబ్బాయిలు ఏడవకూడదని చెబుతుంటాడు. బాధను బయట పెట్టడం బలహీనత అని భావించే ఈ ఆలోచన వారి చిన్ననాటి స్నేహంలో భాగమవుతుంది.
కాలం గడిచేకొద్దీ ఇద్దరి వ్యక్తిత్వాలు మారతాయి. చిన్నప్పుడు ఇతరులకు ధైర్యం చెప్పిన సుబ్బు, చుట్టూ జరుగుతున్న అన్యాయాలను చూసి భావోద్వేగానికి గురవుతాడు. మరోవైపు, కార్తి క్రమంగా హింస వైపు ఆకర్షితుడవుతాడు. ఒకప్పుడు ఒకరి కోసం మరొకరు నిలబడిన ఈ స్నేహితుల మధ్య కూడా ఆలోచనల తేడాలు పెరుగుతాయి. ఇలాంటి సమయంలో డొరోథీ వారి జీవితాల్లోకి వస్తుంది. ఆమె పాత్ర కేవలం కొత్త వ్యక్తి పరిచయంతో ఆగిపోదు. గ్రామంలో పాతుకుపోయిన ఆలోచనలను, ఇద్దరు స్నేహితుల నమ్మకాలను కూడా కదిలిస్తుంది.
డొరోథీకి సంబంధించిన ఓ అనూహ్య సంఘటన తర్వాత సుబ్బులో ఇంతకాలం బయటపడని భావోద్వేగాలు ఉప్పొంగుతాయి. కుటుంబంలో దాచిపెట్టిన ఓ పాత నిజం కూడా బయటకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విషయం సుబ్బు కుటుంబాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ? కార్తి ఈ పరిణామాలను ఎలా అర్థం చేసుకుంటాడు ? ఇన్నేళ్ల స్నేహం ఈ కొత్త నిజాన్ని తట్టుకోగలదా ? అనే ప్రశ్నలకు ఆన్సర్ కావాలంటే ఈ సినిమాను డోంట్ మిస్. సినిమాలో మగతనం, భావోద్వేగాలను దాచుకోవాలనే ఒత్తిడి, సమాజం విధించే పరిమితులు, ప్రేమను అంగీకరించడం వంటి అంశాలను టచ్ చేస్తుంది.
‘డొరోథీ’ అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులోకి వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ ఆడియోలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సినిమా A సర్టిఫికెట్‌తో విడుదలైంది. కాబట్టి ఇది కుటుంబమంతా కలిసి చూడాల్సిన నార్మల్ ఎంటర్‌టైనర్ కాదు. కీర్తి సురేష్ డిఫరెంట్ రోల్ చేసింది. సుబ్బు పాత్రలో సనంత్ రెడ్డి (Sananth Reddy), కార్తిగా రిషికాంత్ (Rishikanth), డొరోథీగా కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించారు. ముత్తుకుమార్, రామచంద్రన్ దురైరాజ్ తదితరులు కూడా కీలక పాత్రల్లో కనిపిస్తారు.