Korean Rom Com Series: కొరియన్ రొమాంటిక్ కామెడీ డ్రామాలకు ఓటీటీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ప్రేమకథతో పాటు కెరీర్, ఒంటరితనం, పెళ్లి, రిలేషన్‌షిప్స్ వంటి అంశాలను కలిపి చూపించే సిరీస్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు అలాంటి కథతోనే వచ్చిన కొరియన్ సిరీస్ ‘ది ప్రాక్టికల్ గైడ్ టు లవ్’ (The Practical Guide to Love). ప్రముఖ నేవర్ వెబ్‌టూన్ ‘ఎఫిషియంట్ డేటింగ్ ఫర్ సింగిల్స్’ ఆధారంగా రూపొందిన ఈ సిరీస్‌లో ప్రేమను కూడా లాభనష్టాల లెక్కలతో చూసే ఓ యువతి జీవితంలోకి ఇద్దరు భిన్నమైన వ్యక్తులు వస్తారు. ఒకరు భద్రత, స్థిరత్వానికి ప్రతీక అయితే… మరొకరు భావోద్వేగాలు, ఉత్సాహానికి ప్రతిరూపంగా నిలుస్తారు. మరి ఆమె ప్రేమ గురించి చివరకు ఏం తెలుసుకుంది ? మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉందో తెలుసుకునే ముందు కథలోకి వెళ్దాం పదండి.
లీ ఉయ్-యాంగ్ పాత్రలో హాన్ జి-మిన్ నటించింది. ఓ లగ్జరీ హోటల్ లో పర్చేసింగ్ మేనేజర్ గా పని చేసే ఉయ్-యాంగ్ తన కెరీర్ విషయంలో చాలా క్లారిటీగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ముందుగా ప్లాన్ చేసుకుంటుంది. ప్రతి నిర్ణయాన్ని లాభనష్టాలతో బేరీజు వేసుకుంటుంది. కానీ ప్రేమ విషయంలో మాత్రం ఆమెకు ఎదురుదెబ్బ తగులుతుంది. తనను ఇష్టపడుతున్నాడని భావించిన ఓ సహోద్యోగి విషయంలో పొరపాటు పడిన తర్వాత, ప్రేమ తనంతట తానుగా జీవితంలోకి వస్తుందని ఎదురుచూడటం మానేస్తుంది.
తనకు సరిపోయే భాగస్వామిని తానే వెతుక్కోవాలని నిర్ణయించుకుంటుంది. స్నేహితురాలి సలహాతో బ్లైండ్ డేట్స్‌కు వెళ్లడం మొదలుపెడుతుంది. మొదట్లో ఇది కూడా తన జీవితంలోని మరో ప్రాక్టికల్ ప్రాసెస్‌లానే అనిపిస్తుంది. కానీ అక్కడే ఆమె ఊహించని భావోద్వేగాల్లో చిక్కుకుంటుంది. ఆమె జీవితంలోకి వచ్చే సాంగ్ టే-సియోప్ పాత్రలో పార్క్ సంగ్-హూన్ కనిపిస్తాడు. ఫర్నిచర్ డిజైనింగ్ స్టూడియోకు సీఈఓగా ఉండే అతడు బాధ్యతగా, పద్ధతిగా, స్పష్టంగా ఆలోచించే వ్యక్తి. మొదటి డేట్‌లోనే పెళ్లి గురించి నేరుగా మాట్లాడటం ఉయ్-యాంగ్‌ను ఇబ్బంది పెట్టినా, అతడి నిజాయితీ క్రమంగా ఆమెను ఆకట్టుకుంటుంది. జీవితంలో భద్రత, స్థిరత్వం కోరుకునే వారికి టే-సియోప్ సరైన వ్యక్తిలా కనిపిస్తాడు.
మరోవైపు షిన్ జీ-సూ పాత్రలో లీ కి-టీక్ నటించాడు. తన స్నేహితుడి స్థానంలో తప్పుడు ఐడెంటిటీతో బ్లైండ్ డేట్‌కు వచ్చిన అతడు, అనుకోకుండా ఉయ్-యాంగ్ జీవితంలోకి ప్రవేశిస్తాడు. జీ-సూ ఆమెకు కొత్త ఉత్సాహాన్ని పరిచయం చేస్తాడు. అతడితో ఉన్నప్పుడు ఉయ్-యాంగ్ తనలో దాచుకున్న భావాలను బయటపెట్టడం మొదలుపెడుతుంది. ఇద్దరిలో ఒకరు ఆమెకు స్థిరత్వాన్ని ఇస్తే… మరొకరు ప్రేమలోని ప్యాషన్‌ను పరిచయం చేస్తాడు.
ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. జీవితాంతం తనకు తోడుగా ఉండే వ్యక్తిని ఎంచుకోవాలా ? లేక తన మనసును నిజంగా కదిలించే వ్యక్తిని ఎంచుకోవాలా ? అనే ప్రశ్న ఉయ్-యాంగ్‌ను వెంటాడుతుంది. ప్రేమను కూడా బిజినెస్ డీల్ లా చూసే ఈ యువతి… చివరకు ప్రేమకు లెక్కలు వేసి ఏం చేసింది? ఇద్దరిలో తన లైఫ్ పార్ట్నర్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంది ? అనేది తెలియాలంటే సిరీస్ ను చూడాల్సిందే.
మొత్తం 12 ఎపిసోడ్‌లతో రూపొందిన ‘ది ప్రాక్టికల్ గైడ్ టు లవ్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు ఈ సిరీస్‌ను తెలుగు డబ్బింగ్‌తో పాటు హిందీ, తమిళం, కొరియన్ భాషల్లో చూడవచ్చు. రొమాంటిక్ కామెడీ, రిలేషన్‌షిప్ డ్రామాలు ఇష్టపడేవారికి ఈ సిరీస్ మంచి ఆప్షన్. ముఖ్యంగా ప్రేమను ప్రాక్టికల్‌గా చూసే ఓ యువతి… చివరకు తన మనసు చెప్పే మాటను ఎలా అర్థం చేసుకుందో తెలుసుకోవాలంటే ఈ సిరీస్‌ను చూడొచ్చు.