Legal Drama OTT : ఓటీటీలో ఒక కొరియన్ లీగల్ డ్రామా సిరీస్ టాప్ రేటింగ్ తో ఆకట్టుకుంటోంది. నిజానికి దీనిని కోర్ట్ రూమ్ డ్రామా అనేకన్నా, ఒక ఫీల్ గుడ్ లీగల్ డ్రామా అనవచ్చు. ఇందులో కోర్టు కేసులు, లాయర్ల వాదనలు ఉన్నప్పటికీ.. అనవసరమైన టెన్షన్ లేకుండా చాలా సరదాగా, గుండెకు హత్తుకునేలా సాగుతుంది. ఆటిజం ఉన్న ఒక అమ్మాయి లాయర్ గా ఎలా నెట్టుకొచ్చిందనేదే ఈ సిరీస్. దీనికి ఐయండిబిలో 8.5 రేటింగ్ ఉందంటే ఈ సిరీస్ ఏ పాటిదో అర్థం అయిపోతుంది. 16 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ లో కామెడీ, ఎమోషన్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ అన్నీ కలిపి ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే, చూస్తున్నంత సేపు మన మొహంలో ఒక చిరునవ్వు ఉండేలా చేసే క్లాస్ సిరీస్ ఇది.
2022లో వచ్చిన ఈ లీగల్ డ్రామా కొరియన్ సిరీస్ పేరు ‘ఎక్స్‌ట్రార్డినరీ అటార్నీ వూ'(Extraordinary Attorney Woo). ఇందులో వూ యంగ్-వూ పాత్రలో పార్క్ యున్-బిన్ అద్భుతంగా నటించింది. ఆమె నటనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఆమె ఆటిజం ఉన్న అమ్మాయి పాత్ర కోసం చాలా కష్టపడింది. ఆటిజం ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవడానికి ప్రొఫెసర్లను కలిసి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌ను పక్కాగా నేర్చుకుంది. అందుకే ఆమె నటనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఈ డ్రామా కొరియన్ టీవీ చరిత్రలోనే ఒక అద్భుతం. మొదట్లో తక్కువ రేటింగ్‌తో స్టార్ట్ అయినా, నెమ్మదిగా పాపులర్ అయ్యి ఏకంగా 28 భాషల్లోకి అనువదించబడింది. అమెరికాలో కూడా దీనిని రీమేక్ చేయడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా, సమాజంలో ఆటిజం పట్ల ఉన్న వివక్షను తగ్గించడానికి ఒక గొప్ప ప్రయత్నం చేసింది. ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో తెలుగు ఆడియోతో కూడా అందుబాటులో ఉంది.
వూ యంగ్-వూ అనే అమ్మాయికి చిన్నప్పటి నుంచే ఆటిజం సమస్య ఉంటుంది. ఈ సమస్య ఉన్న వాళ్ళు నలుగురితో కలవడం, మాట్లాడటం కొంచెం కష్టం. కానీ అమ్మాయి బుర్ర మాత్రం మామూలు షార్ప్ కాదు, ఒకసారి ఏదైనా చదివితే అస్సలు మర్చిపోదు. లా చదివి టాపర్‌గా నిలిచిన ఈమె, ఒక పెద్ద లా ఫర్మ్‌లో లాయర్‌గా జాయిన్ అవుతుంది. అయితే ఆటిజం ఉందని అందరూ ఆమెను తక్కువగా చూస్తారు. కానీ తన తెలివితేటలతో కోర్టులో పెద్ద పెద్ద కేసులను చిటికెలో డీల్ చేసి అందరి నోళ్లు మూయిస్తుంది. ఈమెకు చిన్నప్పటి నుంచి తిమింగలాలు అంటే పిచ్చి. ఏ టైంలోనైనా, ఎవరితోనైనా వాటి గురించే లెక్చర్లు దంచుతుంటుంది.
అంతేకాదు ఏదైనా కేసు చిక్కుల్లో పడ్డప్పుడు, అకస్మాత్తుగా ఒక తిమింగలం ఆమె కళ్ల ముందు మెరిసినట్లు అనిపిస్తుంది. అంతే ఆ ఊహతోనే ఆ కేసును ఎలా గెలవాలో ఒక అదిరిపోయే ఐడియా కనిపెట్టేస్తుంది. ఆఫీసులో అందరూ తనను దూరం పెట్టినా, జున్-హో అనే కుర్రాడు మాత్రం ఆమెను అర్థం చేసుకుని ప్రేమిస్తాడు. ఈ సిరీస్ కేవలం కోర్టు కేసుల గురించి మాత్రమే కాదు. లోకం తనను వింతగా చూసినా, తనకున్న లోపాన్నే బలంగా మార్చుకుని ఒక అమ్మాయి ఎలా ఎదిగిందనేదే అసలు కథ. తండ్రి చాటు బిడ్డగా పెరిగిన ఆమె, తన తల్లి ఎవరనే నిజాన్ని తెలుసుకోవడం.. ఆఫీసులో రాజకీయాలను తట్టుకుని నిలబడటం వంటివి చాలా ఎమోషనల్‌గా, సరదాగా సాగుతాయి.
Read Also : ఇలాంటి స్నేహితుడు కోటికొక్కడుంటాడు… మనసున్న ప్రతి ఒక్కరూ చూడాల్సిన నిజమైన స్టోరీ