Crime Comedy Heist Film OTT : ప్రపంచ ప్రసిద్ధ చిత్రమైన మోనాలిసాను దొంగిలించాలంటే అందరికీ ఉండే తెలివితేటలు ఉంటే సరిపోవు. భద్రతా వ్యవస్థలను దాటాలి, పోలీసుల కంట పడకుండా ప్రణాళిక అమలు చేయాలి. ఇలాంటి భారీ దొంగతనానికి ఓ అనుభవజ్ఞుడైన దొంగ ఇద్దరు యువ నిపుణులను ఎంపిక చేసుకుంటాడు. కానీ ఆ ఇద్దరూ విడిపోయిన తన పిల్లలని చివర్లో తెలిస్తే… దొంగతనం కోసం మొదలైన ప్రయాణం కుటుంబ కలయికగా మారితే ? క్రైమ్, కామెడీ, కుటుంబ గందరగోళంతో సాగే చిత్రం ‘మాస్టర్ ప్లాన్’ (Masterplan). మరి ఈ సినిమా ఎక్కడ చూడొచ్చు ? తెలుగులో ఉందా లేదా ? ఉంటే ఏ ఓటీటీలో ఉంది ? అంటే…
రోజర్ దొంగతనంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న దొంగ. అతడి తదుపరి లక్ష్యం ప్రపంచ ప్రసిద్ధ కళాఖండం మోనాలిసా. ఇంతటి భారీ దొంగతనాన్ని విజయవంతం చేయాలంటే ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న వారు అవసరమని భావిస్తాడు. అందుకే ఇటలీకి చెందిన సైబర్ నేరాల నిపుణురాలు చియారా, ఫ్రాన్స్కు చెందిన పేలుడు పదార్థాల నిపుణుడు జేలను తన ప్రణాళికలో పార్టనర్స్ గా చేర్చుకుంటాడు. చియారా కంప్యూటర్ వ్యవస్థలు, సాంకేతిక అడ్డంకులను ఎదుర్కోవడంలో మంచి నైపుణ్యం కలిగిన యువతి. జేకు బాంబులు వంటి పేలుడు పదార్థాలు, ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కోవడంలో అనుభవం ఉంటుంది.
ఇద్దరి నైపుణ్యాలు దొంగతనానికి ఉపయోగ పడతాయని రోజర్ భావిస్తాడు. అయితే వారిని ఒకే బృందంగా మార్చే ముందు అతడు అప్పటికే దాచిన ఓ విషయం బయట పెడతాడు. చియారా, జే ఇద్దరూ తన పిల్లలని చెబుతాడు. కానీ అప్పటిదాకా వీళ్లిద్దరికీ ఆ విషయం తెలీదు. ఈ విషయం తెలిసిన తర్వాత వారి మధ్య పరిస్థితి మరింత గందరగోళంగా మారుతుంది. ఒకరినొకరు సరిగ్గా తెలియని ఇద్దరు యువతీ యువకులు ఒక్కసారిగా అన్నాచెల్లెళ్లుగా మారడమే కాకుండా, తమ తండ్రితో కలిసి ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ చిత్రాల్లో ఒకదాన్ని దొంగిలించాల్సి వస్తుంది. కుటుంబ బంధాన్ని అంగీకరించడం ఒక సవాలైతే, దొంగతనం ప్రణాళికను విజయవంతం చేయడం మరో సవాలుగా మారుతుంది.
రోజర్ వేసిన ప్రణాళిక ఎంత తెలివైనదైనా, ముగ్గురి మధ్య ఉన్న విభేదాలు దానికి అడ్డంకిగా మారవచ్చు. చియారా, జే తమ నైపుణ్యాలను కలిపి పని చేయగలరా ? తండ్రి చెప్పిన మాటలను నమ్మగలరా ? మోనాలిసాను దొంగిలించే ప్రయత్నం విజయవంతం అవుతుందా ? అనే ప్రశ్నల చుట్టూ కథ సాగుతుంది. క్రైమ్ కథకు కుటుంబ సంబంధాలతో పాటు హాస్యాన్ని మిళితం చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మేకర్స్.
Also Read : జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి
‘మాస్టర్ ప్లాన్’ అక్టోబర్ 16 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులోకి వచ్చింది. ఇది ఇంగ్లీష్ భాషలో రూపొందిన అంతర్జాతీయ చిత్రం. అయితే తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది. ఇందులో స్టాన్లీ టుచీ (Stanley Tucci), సిమోనా టబాస్కో (Simona Tabasco), విక్టర్ బెల్మోండో (Victor Belmondo) ప్రధాన పాత్రల్లో నటించారు. థామస్ విన్సెంట్ (Thomas Vincent) దర్శకత్వం వహించారు. ఫ్యామిలీతో కలిసి మంచి హీస్ట్ థ్రిల్లర్ చూడాలి అనుకునే వాళ్లు ఈ మూవీని డోంట్ మిస్.