Malayalam Crime Thriller OTT : ఒక జర్నలిస్ట్ అకస్మాత్తుగా కనిపించకుండా పోతే పోలీసులు మొదట అతడి ఆచూకీ కోసం వెతుకుతారు. కానీ ఆ దర్యాప్తులో ఒక్కో విషయం బయట పడుతూ, కేసు వెనుక ఊహించని రహస్యాలు ఉన్నాయని తెలుసుకుంటే, అదృశ్యమైన వ్యక్తి కోసం మొదలైన అన్వేషణ కుటుంబ సంబంధాలు, వ్యక్తిగత విభేదాలు, పాత సంఘటనల వైపు దారి తీస్తే ? ఇలాంటి పరిశోధనాత్మక కథతో తెరకెక్కిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘ఒరు అన్వేషణత్తింటే తొడక్కం’ (Oru Anweshanathinte Thudakkam). మరి ఈ సినిమా తెలుగులో అందుబాటులో ఉందా ? అసలు ఏ ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ కి వచ్చింది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
జీవన్ థామస్ ఓ జర్నలిస్ట్. సమాజంలో జరిగే అన్యాయాలు, వివాదాస్పద అంశాలపై తనదైన శైలిలో కథనాలు రూపొందించే వ్యక్తిగా అతడికి గుర్తింపు ఉంటుంది. అయితే, ఒకరోజు జీవన్ అకస్మాత్తుగా కనిపించకుండా పోతాడు. అతడి ఆచూకీ తెలియకపోవడంతో ఈ కేసు పోలీసులకు సవాలుగా మారుతుంది. ఈ అదృశ్య ఘటన వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో తెలుసుకునేందుకు దర్యాప్తు మొదలవుతుంది.
ఈ కేసును కొట్టాయం క్రైమ్ బ్రాంచ్ బృందం చేపడుతుంది. డీఎస్పీ ఐజాక్ మమ్మెన్ నేతృత్వంలో పోలీసులు జీవన్ వ్యక్తిగత జీవితం, అతడికి పరిచయమైన వ్యక్తులు, కుటుంబ సంబంధాల గురించి వివరాలు సేకరిస్తారు. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ జీవన్ జీవితానికి సంబంధించిన అనేక కోణాలు బయటపడతాయి. ఒక్కో వ్యక్తిని ప్రశ్నిస్తున్నప్పుడు వారి మాటల్లోని తేడాలు, దాచి పెట్టిన విషయాలు పోలీసులకు కొత్త అనుమానాలను కలిగిస్తాయి.
ఈ దర్యాప్తు కేవలం ఒక వ్యక్తి ఆచూకీ తెలుసుకోవడంతో ముగిసిపోదు. కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, పాత సంఘటనలు కేసును మరింత సంక్లిష్టంగా మారుస్తాయి. మొదట కనిపించిన విషయాలే అసలు నిజం కాకపోవచ్చనే అనుమానం పోలీసులను మరో దిశగా ఆలోచించేలా చేస్తుంది. అసలు జీవన్ ఎందుకు అదృశ్యమయ్యాడు ? అతడికి ఏదైనా ప్రమాదం జరిగిందా ? అతడి చుట్టూ ఉన్న వారిలో ఎవరు నిజం చెబుతున్నారు ? చివరికి అతను దొరికాడా లేదా ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే సినిమాపై ఒక లుక్కేయాల్సిందే.
‘ఒరు అన్వేషణత్తింటే తొడక్కం’ అక్టోబర్ 16 నుంచి సన్ నెక్స్ట్ (Sun NXT)లో స్ట్రీమింగ్కు వచ్చింది. ప్రస్తుతం ఇది మలయాళ చిత్రంగా అందుబాటులో ఉంది. తెలుగు ఆడియో లేకపోవడం టాలీవుడ్ ఆడియన్స్ కు నిరాశను కలిగించే విషయం. షైన్ టామ్ చాకో (Shine Tom Chacko), సముద్రకని (Samuthirakani), ముకేశ్ (Mukesh), వాణి విశ్వనాథ్ (Vani Viswanath), స్వాసిక (Swasika), శివద (Sshivada), దుర్గా కృష్ణ (Durga Krishna) తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఎం.ఏ. నిషాద్ (M. A. Nishad) దర్శకత్వం వహించారు.