Family Entertainer: ఇంట్లో ముగ్గురు పిల్లలు… వాళ్లను చూసుకోవడం, ఇంటి పనులు చేయడం అంటేనే తెలియని ఓ తండ్రి. భార్య కొన్ని రోజులు బయటకు వెళ్లడంతో ఒక్కసారిగా ఇంటి బాధ్యత మొత్తం అతని చేతుల్లో పడితే ? బట్టలు ఉతకడం నుంచి పిల్లల స్కూల్ పనుల వరకు అన్నీ తానే చూసుకోవాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఈ క్రమంలో అతనికి భార్య విలువ, తండ్రిగా తన బాధ్యత ఎంత పెద్దదో అర్థమైతే ? ఇదే కాన్సెప్ట్‌తో నవ్విస్తూనే కుటుంబ బంధాలను గుర్తు చేసే ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ది బ్రెడ్‌విన్నర్’ (The Breadwinner – 2026). మరి ఈ మూవీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ? అనే విషయంపై ఒక లుక్కేద్దాం పదండి.
నేట్ విల్కాక్స్ ఓ కార్ సేల్స్‌మెన్. భార్య కేటీ మాత్రం ఇంటిని చాలా పర్ఫెక్ట్ గా నడిపించే సూపర్ మామ్. ముగ్గురు కుమార్తెలను చూసుకోవడం, ఇంటి పనులు చక్కబెట్టడం… ఇలా ప్రతి విషయాన్ని కేటీ ఎంతో క్రమశిక్షణతో నిర్వహిస్తుంది. కానీ నేట్ కు మాత్రం ఇంటి బాధ్యతల గురించి పెద్దగా అవగాహన ఉండదు. అయితే ఓ రోజు కేటీ రూపొందించిన ఓ గృహోపకరణానికి ‘షార్క్ ట్యాంక్’లో భారీ డీల్ వస్తుంది. ఆ బిజినెస్ కోసం ఆమె కొన్ని రోజులు వేరే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. దీంతో మొదటిసారిగా నేట్ తన ముగ్గురు కుమార్తెలతో ఇంట్లో ఒంటరిగా మిగిలిపోతాడు.
అక్కడి నుంచే కథలో కామెడీ మొదలవుతుంది. బట్టలు ఉతకడం, పిల్లలకు ఆహారం సిద్ధం చేయడం, స్కూల్ పనులు చూసుకోవడం, ఇంట్లో చిన్నచిన్న సమస్యలు పరిష్కరించడం.. ఇలా ప్రతి విషయంలోనూ నేట్ తడబడుతుంటాడు. ఒక్క నెల రోజుల పాటు ఇంటిని నడపడం అతనికి ఊహించని పరీక్షగా మారుతుంది. అయితే ఈ కష్టాల మధ్య పిల్లలతో అతని బంధం మరింత బలపడుతుంది. ఇంతకాలం భార్య చేస్తున్న పనులను తేలిగ్గా తీసుకున్న నేట్ కు, ఆమె పడే కష్టం ఏ స్థాయిలో ఉంటుందో అర్థమవుతుంది.
అదే సమయంలో తండ్రిగా తన బాధ్యతను కూడా కొత్తగా తెలుసుకుంటాడు. నవ్వులతో పాటు కుటుంబం, భార్యాభర్తల బంధం, తల్లిదండ్రుల బాధ్యతలను టచ్ చేసేలా కథ సాగుతుంది. మరి ఇంతకీ భార్య వచ్చేదాకా హీరో ఫ్యామిలీని ఎలా చూసుకున్నాడు ? ఇంటి బాధ్యతలతో అతను పడిన కష్టం ఏంటి ? అన్నది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.
ప్రముఖ స్టాండప్ కమెడియన్ నేట్ బార్గాట్జే ఈ సినిమాతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆయనతో పాటు మాండీ మూర్, కోలిన్ జోస్ట్, జాక్ చెర్రీ, కుమాయిల్ నంజియాని, విల్ ఫోర్టే కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఎరిక్ అప్పెల్ దర్శకత్వం వహించగా, నేట్ బార్గాట్జే, డాన్ లగానా కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ‘ది బ్రెడ్‌విన్నర్’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు ఆడియో లేదు. ఇంగ్లీష్, హిందీ ఆడియోలతో పాటు తెలుగు సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుతూ ఓ మంచి సినిమా చూడాలనుకునే వారికి ఇది మంచి వీకెండ్ ఎంటర్‌టైనర్.
Read Also: అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా