Mahesh Kumar: స్వేచ్ఛ బ్యూరో: ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా రెండేళ్ల పదవిని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. 6 సెప్టెంబరు 2024న పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను ఏఐసీసీ ప్రకటించింది. 15 సెప్టెంబరున ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ రెండేళ్ల కాల వ్యవధిలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీని కేవలం అధికార పీఠానికి పరిమితం చేయకుండా, గ్రామస్థాయి నుంచి సంస్థాగతంగా బలోపేతం చేయడం, ప్రజా సమస్యలపై నిరంతరం సమరశంఖం పూరించడం, ప్రభుత్వం–పార్టీ యంత్రాంగం మధ్య బలమైన వారధిగా నిలవడంలో ఆయన తనదైన ముద్ర వేశారు. సంక్లిష్టమైన రాజకీయావరణలో సమయస్ఫూర్తి, సామాజిక న్యాయం, కేడర్‌కు కొండంత అండగా నిలిచే వైఖరితో ఆయన వ్యవహరించారని సొంత పార్టీ నేతలు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భగా టీపీసీసీ చీఫ్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని విజయవంతంగా నడిపిస్తూ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తున్నారంటూ వెల్లడించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియను విజయవంతం చేయడంలో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌కుమార్ గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించారు. పార్టీ పదవులతో పాటు డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో సామాజిక సమతుల్యతకు పెద్దపీట వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తూ సామాజిక న్యాయ నినాదాన్ని ఆచరణలో చూపి రికార్డు సృష్టించారు.అంతేగాక అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తల ప్రాధాన్యత తగ్గకుండా చూసేందుకు ఆయన వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. గాంధీభవన్‌లో ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, సామాన్య కార్యకర్తలు, స్థానిక నాయకులు నేరుగా రాష్ట్ర మంత్రులను కలసి సమస్యలు విన్నవించుకునే వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, పాలనాపరమైన ఫలాలను క్షేత్రస్థాయికి చేర్చడంలోనూ పార్టీ యంత్రాంగాన్ని విజయవంతంగా నడిపించారు. టీపీసీసీ అధ్యక్షుడి సమర్థ నిర్వహణపై స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించడం ఆయన పనితీరుకు నిదర్శనం.
ఇక ‘సంఘటన్ సృజన్ అభియాన్’ ద్వారా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలిపారు. వికారాబాద్‌లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు నిర్వహించిన భారీ శిక్షణ శిబిరం పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి హాజరైన రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రత్యేకంగా మహేష్‌కుమార్ గౌడ్ కార్యాచరణను ప్రశంసించారు. జిల్లాల్లో డీసీసీ అధ్యక్షుల నియామక పత్రాలను టీపీసీసీ అధ్యక్షుడే స్వయంగా వెళ్లి అందజేయడం ద్వారా రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా కేడర్‌కు మధ్య ప్రత్యక్ష బంధాన్ని ఏర్పరిచారు.
Also read: ఆట షురూ.. చిచ్చుపెట్టి విడగొట్టేసావ్ కదయ్యా బిగ్ బాసూ!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొదలుకొని,ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల వరకు కాంగ్రెస్ సాధించిన విజయాల్లో మహేష్‌కుమార్ గౌడ్ వ్యూహాత్మక పాత్ర పోషించారు. టిక్కెట్ల ఎంపికలో వివాదాలు లేని నిష్పాక్షిక వైఖరి, గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పార్టీ తిరుగులేని ఫలితాలను సాధించింది.ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూ, ఏఐసీసీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన మహేష్‌కుమార్ గౌడ్, తన రెండేళ్ల పదవీకాలంలో టీపీసీసీ అధ్యక్ష పదవికి కొత్త శోభ తెచ్చారు. కార్యకర్తల పక్షపాతిగా, పార్టీ యంత్రాంగాన్ని ముందుకు నడిపించే దిశా నిర్దేశకుడిగా ఆయన సేవలు తెలంగాణ కాంగ్రెస్‌కు సుదీర్ఘ కాలం బలమైన పునాదిగా నిలవనున్నాయి.
బీసీ కులగణన: రాహుల్ గాంధీ ఆశయ సాధనలో భాగంగా రాష్ట్రంలో కులగణనను విజయవంతం చేయడంలో కీలక భాగస్వామ్యం.
జై బాపు–జై భీమ్–జై సంవిధాన్: రాజ్యాంగ పరిరక్షణ, గాంధీ-అంబేడ్కర్ ఆశయాల వ్యాప్తిలో దేశంలోనే తెలంగాణను నంబర్-1 స్థానంలో నిలపడం.
జనహిత పాదయాత్రలు: గాంధీభవన్‌కే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి, నేరుగా కార్యకర్తల చెంతకు వెళ్లడం.
మంత్రులతో ముఖాముఖి: గాంధీభవన్‌లో కార్యకర్తలు-మంత్రుల మధ్య నేరుగా సమస్యల పరిష్కార వేదిక.
ఉపాధి హామీ పరిరక్షణ: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గ్రామగ్రామాన నిరసనలు, రాంజీ పాలసీకి వ్యతిరేకంగా పంచాయతీ తీర్మానాలు.
ఓట్ చోరీపై ఉద్యమం: ప్రజాస్వామ్య పరిరక్షణకు గ్రామ స్థాయిలో విస్తృత సంతకాల సేకరణ.
సంఘటన్ సృజన్ అభియాన్: జిల్లా, మండలం, డివిజన్, పట్టణ కమిటీల వేగవంతమైన నియామకాల్లో దేశంలోనే అగ్రస్థానం.
న్యాయ్ భోజ్: ఏఐసీసీ పిలుపు మేరకు సామాజిక ఐక్యత కోసం విజయవంతంగా నిర్వహించిన విందు కార్యక్రమాలు.
చాత్రోంకీ గూంజ్: విద్యార్థి, యువజన సమస్యలపై క్యాంపస్‌లలో పార్టీ గళాన్ని వినిపించడం.
ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో అగ్రస్థానం: ఓటర్ల జాబితా సవరణ, పరిశీలన ప్రక్రియలో దేశంలోనే అత్యుత్తమ పనితీరు ప్రదర్శన.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ విజయంలో కీలక పాత్ర పోషించడం.
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు: పట్టణ ప్రాంతాల్లో పార్టీ ఆధిపత్యాన్ని నిలబెట్టేలా ఎన్నికల వ్యూహాలు.
సర్పంచ్ ఎన్నికల విజయం: గ్రామస్థాయిలో పార్టీకి తిరుగులేని ప్రజామోదం దక్కేలా కేడర్‌ను సమాయత్తం చేయడం.
జిల్లా అధ్యక్షులకు శిక్షణ: డీసీసీ అధ్యక్షులకు నైపుణ్య, నాయకత్వ శిక్షణ శిబిరాల నిర్వహణ.
Also read: DSC జూడో సర్టిఫికెట్ల వివాదంపై.. క్లారిటీ ఇచ్చిన ఎండీ భరణి!