Psychological Crime Thriller OTT : సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో డిఫరెంట్ కంటెంట్ ను పరిచయం చేసింది ఒక కొరియన్ సిరీస్. ఇది రియల్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సిరీస్. 1990కాలంలో జరిగే వరుస హత్యల ఇన్వెస్టిగేషన్ చుట్టూ స్టోరీ ఉంటుంది. మిగతా క్రైమ్ స్టోరీలలా కాకుండా, నేరస్తుల సైకాలజీ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఇందులో గాల్లో ఎగిరి తన్నే ఫైట్లు, భారీ డైలాగులు ఉండవు కానీ, ప్రతి సీన్ చాలా సీరియస్‌గా, ఉత్కంఠగా సాగుతుంది. ఒక మనిషి ఎందుకు క్రూరంగా మారతాడనే సైకాలజీని పట్టుకుని, సీరియల్ కిల్లర్ లను హీరో పట్టుకునే పద్దతి మనల్ని కట్టిపడేస్తుంది. మీరు క్రైమ్ కథలను ఇష్టపడే వారైతే, ఆ కిల్లర్ల కళ్లలోకి చూస్తూ హీరో చేసే ఇన్వెస్టిగేషన్ మీకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. దీనికి ఐయండిబిలో 8/10 రేటింగ్ ఉందంటేనే సిరీస్ ఏపాటిదో చెప్పచ్చు.
ఈ కొరియా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘త్రూ ది డార్క్‌నెస్’ (Through the Darkness). ఈ సిరీస్ దక్షిణ కొరియాలో మొదటి క్రిమినల్ ప్రొఫైలర్ అయిన క్వాన్ ఇల్-యోంగ్ రాసిన ‘నాన్-ఫిక్షన్’ పుస్తకం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో చూపించిన హత్యలన్నీ 1990 నుండి 2000 మధ్య కొరియాను వణికించిన నిజమైన సీరియల్ కిల్లర్ల కేసులే. ఉదాహరణకు, ‘రెయిన్ కోట్ కిల్లర్’గా పిలవబడే యూ యంగ్-చుల్, మహిళలను లక్ష్యంగా చేసుకున్న కాంగ్ హో-సన్ వంటి కరుడుగట్టిన నేరస్తుల కేసులను ఇందులో చూపించారు. అందుకే ఈ డ్రామా ఇతర క్రైమ్ షోల కంటే చాలా సీరియస్‌గా, నేరస్తుల సైకాలజీని విశ్లేషిస్తూ సాగుతుంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించిన కిమ్ నామ్-గిల్ తన అద్భుతమైన నటనకు గాను 2022లో ‘దాసాంగ్’ (గ్రాండ్ ప్రైజ్) అవార్డును గెలుచుకున్నారు. కేవలం 12 ఎపిసోడ్లలోనే ఆ కాలం నాటి పరిస్థితులను చాలా స్పష్టంగా చూపించారు. 2022 నుంచి ఈ సిరీస్ Netflix, Rakuten Viki ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది.
1990 నాటి కాలంలో కొరియాలో వరుస హత్యలు జరుగుతుంటాయి. అయితే హంతకుడి ఆచూకీ మాత్రం దొరకదు. అప్పట్లో పోలీసులకు కేవలం సాక్ష్యాల ద్వారానే నేరస్తులను పట్టుకోవడం తెలుసు. కానీ సాంగ్ హా-యంగ్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రం, నేరస్తుడు ఎందుకు అలా చేస్తున్నాడో వాడి ఆలోచనా విధానాన్ని బట్టి పట్టుకోవచ్చని నమ్ముతాడు. అలా కొరియాలో మొదటిసారిగా ‘క్రిమినల్ బిహేవియర్ అనాలిసిస్’ టీమ్ మొదలవుతుంది. నేరస్తుల మనసుల్లో ఏముందో తెలుసుకోవడానికి హీరో జైలులో ఉన్న క్రూరమైన హంతకులను కలుస్తుంటాడు. గంటల తరబడి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ ఆలోచనలను విశ్లేషిస్తాడు.
ఈ క్రమంలో తోటి పోలీసుల నుండే అతనికి వ్యతిరేకత ఎదురవుతుంది. హంతకులకు మర్యాద ఇచ్చి మాట్లాడటం ఏంటని అందరూ విమర్శించినా, భవిష్యత్తులో జరగబోయే హత్యలను ఆపడానికి ఈ మైండ్ గేమ్ అవసరమని అతను మొండిగా ముందుకు వెళ్తాడు. ఒక్కో కిల్లర్‌ని పట్టుకునే కొద్దీ, కిల్లర్ల ఆలోచనలు హీరో మెదడుపై కూడా ప్రభావం చూపుతాయి. ఆ సైకో కిల్లర్ లా ఆలోచించడం వల్ల అతను మానసిక ఒత్తిడికి లోనవుతాడు. కానీ ఆ భయంకరమైన సీరియల్ కిల్లర్లను పట్టుకోవడానికి తన ప్రాణాలను పణంగా పెట్టి చివరికి విజయం సాధిస్తాడు. ఒక సాధారణ పోలీస్ ఆఫీసర్ దేశంలోనే గొప్ప ‘ క్రిమినల్ ప్రొఫైలర్’గా ఎలా ఎదిగాడన్నదే ఈ సిరీస్.
Read Also : వికలాంగులపై వికృత చేష్టలు… ప్రభుత్వాన్ని వనికించిన సినిమా