Psychological Drama OTT: ఓటీటీలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక మూవీ స్ట్రీమింగ్ లో ఉంది. ఇది బయటి ప్రపంచంతో అస్సలు సంబంధం లేకుండా, తమ ముగ్గురు పిల్లలను ఒక పెద్ద గోడ మధ్య బంధించి పెంచే తల్లిదండ్రుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇది మామూలు సినిమా కాదు, బుర్ర తిరిగిపోయే ఒక వింత సైకలాజికల్ డ్రామా. బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా, ఒక తండ్రి తన పిల్లల్ని అబద్ధాలతో బానిసల్లా ఎలా పెంచాడో ఇందులో చూపిస్తారు. మనుషుల్ని బ్రెయిన్ వాష్ చేసి కంట్రోల్ చేయడం అనే కాన్సెప్ట్‌ని చాలా డార్క్ గా చూపించారు ఇందులో. ఇది అందరికీ నచ్చే సినిమా కూడా కాదు.. కేవలం డిఫరెంట్ అటెంప్ట్స్ ఇష్టపడే వాళ్లకి మాత్రమే సెట్ అవుతుంది.
ఈ గ్రీక్ సైకలాజికల్ డ్రామా సినిమా పేరు ‘డాగ్ టూత్’ (Dogtooth). 2009లో వచ్చిన ఈ సినిమాకు యోర్గోస్ లాంథిమోస్ దర్శకత్వం వహించారు. దీనినే ‘గ్రీక్ వైర్డ్ వేవ్’ (Greek Weird Wave) సినిమా అంటారు. ఈ సినిమా 83వ ఆస్కార్ అవార్డుల్లో ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం’ కేటగిరీలో నామినేట్ అయ్యింది. అలాగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘అన్ సర్టెన్ రిగార్డ్’ (Un Certain Regard) అవార్డును గెలుచుకుంది. గ్రీస్ దేశం నుండి ఈ స్థాయి గుర్తింపు పొందిన అతికొద్ది సినిమాల్లో ఇది ఒకటి. చాలా తక్కువ ఖర్చుతో, తక్కువ నటీనటులతో ఒకే ఇంట్లో ఈ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారు. మీరు ఈ సినిమాను MUBI ప్లాట్‌ఫామ్‌లో సబ్‌స్క్రిప్షన్ ద్వారా చూడవచ్చు. ఒకవేళ రెంటల్, పర్చేస్ చేయాలనుకుంటే Apple TV లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
ఇందులో ఒక తండ్రి తన ముగ్గురు పిల్లలను (ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి) బయటి ప్రపంచానికి పూర్తిగా దూరంగా, ఒక పెద్ద కాంపౌండ్ వాల్ ఉన్న ఇంట్లోనే చిన్నప్పటి నుంచి బంధించి పెంచుతాడు. వాళ్లకు బయటి ప్రపంచం గురించి అన్నీ అబద్ధాలే చెప్తాడు. ఇంట్లో ఉండే వస్తువులకు తప్పుడు పేర్లు నేర్పించడం, ‘టెలిఫోన్’ అంటే ఉప్పు అని, బయట పిల్లి అనే భయంకరమైన జంతువు ఉంటుందని భయపెట్టడం వంటివి చేస్తాడు. దవడ పన్ను ఊడినప్పుడే బయటి ప్రపంచానికి వెళ్లడానికి సిద్ధమవుతారని నమ్మిస్తాడు.
అయితే తండ్రి తన కొడుకు శారీరక అవసరాల కోసం బయట నుంచి క్రిస్టీన్ అనే ఒక ఆఫీస్ సెక్యూరిటీ గార్డ్‌ని ఇంటికి తీసుకువస్తుంటాడు. కొడుకు కోసం బయట నుంచి ఒక అమ్మాయితో వాడి అవసరాలు తీరుస్తూ, కూతుళ్లకు మాత్రం ఆ కాంపౌండ్ లోపలే నరకం చూపిస్తాడు. బయటి గాలి తగలకుండా, బయటి మనుషులను చూడకుండా ఆ ముగ్గురిని బొమ్మల్లా ఆడిస్తూ ఆ తండ్రి ఒక నియంతలా రాజ్యమేలుతుంటాడు.
ఇక్కడే స్టోరీ మలుపు తీతుగుతుంది. ఇప్పుడు క్రిస్టీన్ వల్ల ఆ ఇంట్లోని పెద్ద కూతురికి బయటి ప్రపంచం గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి. బయటి ప్రపంచం తండ్రి చెప్పినంత భయంకరంగా లేదని ఆమె అర్థం చేసుకుంటుంది. ఆ ఇంట్లో నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని పెద్ద కూతురు నిర్ణయించుకుంటుంది. ఈ క్లైమాక్స్ క్రేజీగా ఉంటుంది. చివరికి ఆమె అక్కడి నుంచి బయట పడుతుందా ? తన తండ్రి వేసిన ఉచ్చులోనే ఉండిపోతుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.