Revenge Thriller: సెలవుల్లో సరదాగా గడపడానికి వెళ్లిన కూతురు ప్రాణాల కోసం పోరాడుతూ ఇంటికి తిరిగొస్తే ఏ తల్లిదండ్రులైనా తట్టుకోలేరు. పైగా ఆమెకు ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్లే తెలియకుండా తమ ఇంటికి అతిథులుగా వస్తే ? అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా ప్రతీకారంతో రగిలిపోతుంది. కూతురికి జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పాలని నిర్ణయించుకుంటుంది. ఒక కుటుంబానికి ఎదురైన భయంకరమైన అనుభవం, ఆ తర్వాత మొదలయ్యే ప్రతీకార పోరాటమే ‘ది లాస్ట్ హౌస్ ఆన్ ది లెఫ్ట్’ (The Last House on the Left). భయం, ఆవేదన, కోపం, ఉత్కంఠతో సాగే ఈ సినిమా ప్రేక్షకులను చివరి వరకు ఆసక్తిగా చూసేలా చేస్తుంది. మరి ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ స్ట్రీమింగ్ ఈ ఓటీటీలో అన్నది తెలుసుకుందాం పదండి.
మారి అనే యువతి తన తల్లిదండ్రులు జాన్, ఎమ్మాతో కలిసి సెలవుల కోసం ఓ ప్రశాంతమైన ప్రాంతానికి వస్తుంది. అక్కడ సంతోషంగా గడపాలనుకున్న ఆమె, తన స్నేహితురాలు పైజ్ తో కలిసి బయటకు వెళ్తుంది. ఆ సమయంలో జస్టిన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడుతుంది. అయితే అతడితో పాటు ఉన్న క్రూగ్, అతడి అనుచరుల కారణంగా ఇద్దరూ ఇబ్బందుల్లో పడతారు. వారి చేతుల్లో చిక్కుకున్న మారి, పైజ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆ ప్రయత్నం మరింత భయంకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. ఈ ఘటనలో పైజ్ ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మారి ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని తన ఇంటికి చేరుకుంటుంది.
కూతురి పరిస్థితి చూసి జాన్, ఎమ్మా షాక్ కు గురవుతారు. అసలు ఆమెకు ఏం జరిగిందో తెలుసుకున్న తర్వాత వారి బాధ కోపంగా మారుతుంది. తమ బిడ్డకు ఇంతటి అన్యాయం చేసిన వాళ్లను వదిలి పెట్టకూడదని భావిస్తారు. అయితే వాళ్లకు మరో ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. క్రూగ్, అతడి అనుచరులు అనుకోకుండా జాన్, ఎమ్మా ఇంటికి చేరుకుంటారు. తమకు ఆశ్రయం ఇచ్చిన వాళ్లు ఎవరో, ఆ కుటుంబానికి తాము చేసిన నష్టం ఏమిటో వారికి తెలియదు.
కానీ మారి తల్లిదండ్రులకు మాత్రం వచ్చిన వాళ్లే తమ కూతురికి హాని చేసిన వ్యక్తులని అర్థమవుతుంది. దీంతో ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. కూతురిని కాపాడుకోవడంతో పాటు, ఆమెకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని జాన్, ఎమ్మా నిర్ణయించుకుంటారు. అప్పటివరకు సాధారణంగా కనిపించిన ఇల్లు నేరస్థుల రాకతో భయంకరంగా మారిపోతుంది. తమ కుటుంబానికి జరిగిన దారుణానికి న్యాయం చేసుకోవాలనే ప్రయత్నంలో వాళ్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ? ఆ పోరాటం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది ? అనేదే మిగతా కథలో ఆసక్తిని పెంచుతుంది.
2009లో విడుదలైన ‘ది లాస్ట్ హౌస్ ఆన్ ది లెఫ్ట్’లో సారా పాక్స్టన్, టోనీ గోల్డ్‌విన్, మోనికా పాటర్ తదితరులు నటించారు. భయానక సంఘటనలు, హింసాత్మక సన్నివేశాలు, ప్రతీకారంతో కూడిన కథాంశం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అయితే హింస ఎక్కువగా ఉండటంతో ఇది అందరికీ నచ్చకపోవచ్చు. రివెంజ్ థ్రిల్లర్లు, తీవ్రమైన ఉత్కంఠతో సాగే కథలు ఇష్టపడేవారు ఈ సినిమాను చూడచ్చు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ (Netflix)లో అందుబాటులో ఉంది.