Romantic Comedy Series: ప్రేమలో ఉన్నప్పుడు ఒకరి కోసం మరొకరు ఏమైనా చేయాలనిపిస్తుంది. కానీ ఆ ప్రేమ కోసం మన నమ్మకాలను, అలవాట్లను, చివరికి మనల్ని మనమే మార్చుకోవాల్సి వస్తే… ఎదుటివారి కోసం మారడం ప్రేమేనా, లేక మన వ్యక్తిత్వాన్ని కోల్పోవడమా ? ఇలాంటి ప్రశ్నలతో పాటు నవ్వులు, చిన్న చిన్న గొడవలు, కుటుంబ బంధాలను కలిపి చూపించే రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘నోబడీ వాంట్స్ దిస్ సీజన్ 3’ (Nobody Wants This Season 3). జోఆన్, నోహా ప్రేమకథలో ఈసారి ఎలాంటి మలుపులు ఎదురవుతాయో చూడాలంటే మూడో సీజన్‌పై ఓ లుక్కేయాల్సిందే.
జోఆన్ ఓ పాడ్‌కాస్ట్ నిర్వహించే మహిళ. నోహా యూదు మతానికి చెందిన రబ్బీ. ఇద్దరి జీవితాలు, ఆలోచనలు వేర్వేరుగా ఉన్నా ఒకరిపై మరొకరికి ప్రేమ పెరుగుతుంది. అయితే వీళ్ల ప్రేమకథలో సమస్యలు కేవలం ఇద్దరి మధ్య వచ్చే గొడవలతోనే ఆగిపోవు. కుటుంబాల అభిప్రాయాలు, మతపరమైన నమ్మకాలు, భవిష్యత్తుపై ఆశలు కూడా వారి బంధాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రేమ ఎంత బలంగా ఉన్నా, కలిసి జీవించాలంటే కొన్ని విషయాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది.
రెండో సీజన్ లో జోఆన్, నోహా తమ సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. నోహాను వదులుకోవడం ఇష్టం లేని జోఆన్, అతడితో కలిసి జీవించేందుకు యూదు మతంలోకి మారాలనే ఆలోచన చేస్తుంది. కానీ ఈ నిర్ణయం తీసుకోవడం అంత ఈజీ కాదు. నోహా కోసం తన జీవితంలో ఇంత పెద్ద మార్పు చేసుకోవడం సరైనదేనా అనే సందేహం ఆమెను వెంటాడుతుంది. ఆమె ప్రేమ కోసం తీసుకునే ఈ నిర్ణయం మనస్ఫూర్తిగా తీసుకున్నదేనా ? లేక బంధాన్ని కాపాడుకోవాలనే భయంతో తీసుకున్నదా ? అనే అంశం కథలో కీలకంగా మారుతుంది.
మూడో సీజన్Vలో ఈ జంట తమ బంధంలో మరో అడుగు ముందుకేస్తుంది. కలిసి కొత్త ఇంట్లో జీవితం ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. అయితే ప్రేమలో ఉన్నప్పుడు కనిపించని కొన్ని విషయాలు ఒకే ఇంట్లో ఉంటే బయటపడతాయి. ఒకరి అలవాట్లను మరొకరు అర్థం చేసుకోవడం, చిన్న చిన్న విషయాలకు సర్దుకుపోవడం, భవిష్యత్తు గురించి ఒకే నిర్ణయానికి రావడం వంటి అంశాలు వారి జీవితంలో భాగమవుతాయి.
ఇక జోఆన్ సోదరి మోర్గాన్ కెరీర్‌లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ఆమె జీవితంలో వచ్చే మార్పులు వ్యక్తిగత సంబంధాలపైనా ప్రభావం చూపిస్తాయి. మరోవైపు సాషా, ఎస్తర్ జీవితాల్లోనూ ప్రేమకు సంబంధించిన కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయి. వీటన్నింటి మధ్య నవ్వులు, భావోద్వేగాలు, చిన్న చిన్న అపార్థాలతో కథ ముందుకు సాగుతుంది. మరి మూడో సీజన్ ఎలా ముగిసిందో తెలియాలంటే సిరీస్ ను చూడాల్సిందే.
క్రిస్టెన్ బెల్, ఆడమ్ బ్రాడీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘నోబడీ వాంట్స్ దిస్’ (Nobody Wants This) మూడో సీజన్ అక్టోబర్ 22 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తెలుగు ఆడియో అందుబాటులో లేదు. ప్రేమకథలతో పాటు ఫ్యామిలీ, కామెడీ, ఎమోషన్స్ కలిసిన సిరీస్‌లు ఇష్టపడేవారికి ఇది నచ్చవచ్చు.
Read Also: సముద్రంలో సాహసం… బ్లాక్‌బస్టర్ యానిమేషన్ మూవీ రియల్ మనుషులతో… స్ట్రీమింగ్ తెలుగులోనే