Romantic Comedy: సింగిల్ లైఫ్ అంటే పార్టీలు, ఫ్రెండ్స్‌తో ఫుల్ ఎంజాయ్మెంట్… పెళ్లి అంటే స్వేచ్ఛకు బైబై చెప్పాల్సిందేనా ? ఇన్నాళ్లూ బెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి లైఫ్‌ను ఎంజాయ్ చేసిన ఓ అమ్మాయికి, తన ఫ్రెండ్ బాయ్‌ఫ్రెండ్ పెళ్లి ప్రపోజల్ పెట్టడంతో అసలు టెన్షన్ మొదలవుతుంది. ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటే తమ ఫ్రీడమ్ ఏమవుతుంది ? తమ ఫ్రెండ్షిప్ మునుపటిలా ఉంటుందా ? స్నేహం, ప్రేమ, పెళ్లి మధ్య జరిగే ఈ ఫన్నీ డ్రామానే ‘సీరియస్లీ సింగిల్ టూ’ (Seriously Single Too). మరి సింగిల్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది.
దినియో, నోని మంచి స్నేహితులు. పార్టీలు, సరదాలు, తమకు నచ్చినట్లు జీవించడం వాళ్లకు ఇష్టం. ప్రేమ, పెళ్లి కోసం తొందర పడకుండా సింగిల్‌గా ఉండటంలోనే అసలైన స్వేచ్ఛ ఉందని భావిస్తుంటారు. కలిసి బయటకు వెళ్లడం, కొత్త అనుభవాలను ఆస్వాదించడం, జీవితాన్ని తమకు నచ్చినట్లు గడపడం వాళ్ల దినచర్యలో భాగంగా మారుతుంది. అయితే నోని బాయ్‌ఫ్రెండ్ అనూహ్యంగా పెళ్లి ప్రపోజల్ పెట్టడంతో కథలో అసలు గందరగోళం మొదలవుతుంది.
నోని పెళ్లికి ఓకే చెబితే, ఇప్పటి వరకు ఇద్దరూ కలిసి గడిపిన సమయం తగ్గిపోతుందనే ఆలోచన దినియోను ఇబ్బంది పెడుతుంది. స్నేహితురాలి సంతోషాన్ని కోరుకుంటూనే, తమ మధ్య ఉన్న బాండింగ్ మారిపోతుందేమో అనే భయం ఆమెను వెంటాడుతుంది. మరోవైపు, నోని కూడా తన రిలేషన్షిప్ గురించి సీరియస్‌గా ఆలోచించాల్సి వస్తుంది. ప్రేమలో ఉండటం ఒక ఎత్తయితే, పెళ్లి చేసుకుని కొత్త బాధ్యతలను స్వీకరించడం మరో ఎత్తు. ఇప్పటివరకు సరదాగా సాగిన జీవితం, ఇప్పుడు భవిష్యత్తు గురించి కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితికి చేరుతుంది.
తనకు నిజంగా పెళ్లి కావాలా ? లేక ఇప్పటిలాగే స్వేచ్ఛగా జీవించాలా ? అనే సందేహాలు ఆమెను వెంటాడుతాయి. ఇద్దరు స్నేహితురాళ్ల మధ్య వచ్చే చిన్నచిన్న అపార్థాలు, ప్రేమ గురించి వాళ్లకు ఉన్న భిన్నమైన అభిప్రాయాలు కథలో కామెడీని పండిస్తాయి. అయితే ఈ సరదా సంఘటనల వెనుక స్నేహం మారిపోతుందనే భయం, జీవితంలో కొత్త దశలోకి అడుగుపెట్టే సంకోచం కూడా కనిపిస్తాయి. పెళ్లి చేసుకోవడం అంటే తమకు నచ్చిన జీవితాన్ని వదులుకోవడమేనా ? స్నేహితులు జీవితంలో కొత్త ప్రయాణాలు మొదలు పెట్టినప్పుడు తమ బంధాన్ని ఎలా కాపాడుకోవాలి ? అనే అంశాలను ఈ కథలో సరదాగా చూపించారు.
‘సీరియస్లీ సింగిల్ టూ’ అక్టోబర్ 16 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతుంది. దక్షిణాఫ్రికాలో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ చిత్రంలో స్నేహం, ప్రేమ, పెళ్లి వంటి నిర్ణయాల చుట్టూ జరిగే సరదా సంఘటనలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. అయితే తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. పెద్దగా సీరియస్‌గా ఆలోచించకుండా, రిలేషన్ షిప్స్‌లోని సరదా కోణాన్ని ఆస్వాదించాలనుకునేవారు దీన్ని తమ వాచ్‌లిస్ట్‌లో పెట్టుకోవచ్చు.
Read Also: కార్గిల్ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా