Power Demand: రాష్ట్రంలో వ్యవసాయం, గృహావసరాలు, వాణిజ్య సంస్థలు, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో పెరుగుతున్న విద్యుత్ వినియోగంతో రాష్ట్రంలో డిమాండ్ సరికొత్త గరిష్ఠ స్థాయికి చేరింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఈనెల 15న ఉదయం 10:29 గంటలకు రాష్ట్రవ్యాప్త గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 20,003 మెగావాట్లకు చేరింది. అయితే.. తెలంగాణలో విద్యుత్ అవసరాలు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, రికార్డు స్థాయి డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు విద్యుత్ సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరం(2025-26) ఇదే తేదీన నమోదైన గరిష్ఠ డిమాండ్ 18,548 మెగావాట్లు కాగా, తాజా రికార్డు దానికంటే 1,455 మెగావాట్లు అధికం. అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వినియోగం 334.54 మిలియన్ యూనిట్లకు చేరింది. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర సగటు గరిష్ఠ డిమాండ్ 19,289 మెగావాట్లుగా, సగటు రోజువారీ విద్యుత్ వినియోగం 321.34 మిలియన్ యూనిట్లుగా నమోదైంది.
ఎస్పీడీసీఎల్ పరిధిలో ఈనెల 15న 12,281 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదవగా, రోజువారీ విద్యుత్ వినియోగం 228.14 మిలియన్ యూనిట్లకు చేరింది. గత సంవత్సరం నమోదైన గరిష్ఠ రోజువారీ వినియోగం 222.34 మిలియన్ యూనిట్లతో పోలిస్తే ఇది 5.80 మిలియన్ యూనిట్లు అధికం. ఇక ఎస్పీడీసీఎల్ పరిధిలో సెప్టెంబర్ 30న సాయంత్రం 4:16 గంటలకు 12,299 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం గరిష్ఠ డిమాండ్ 11,318 మెగావాట్లతో పోలిస్తే ప్రస్తుత గరిష్ఠ డిమాండ్ గణనీయంగా పెరిగింది.
ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి అనుగుణంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఈనెల 15న సాయంత్రం 6:19 గంటలకు 4,220 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. అక్టోబర్ 9న రోజువారీ విద్యుత్ వినియోగం 88.22 మిలియన్ యూనిట్లకు చేరింది. గత సంవత్సరం అక్టోబర్‌లో నమోదైన గరిష్ఠ డిమాండ్ 3,552 మెగావాట్లతో పోలిస్తే ఈసారి డిమాండ్ గణనీయంగా పెరిగింది. నగరంలో గృహావసరాలు, వాణిజ్య కార్యకలాపాలు, ఐటీ సంస్థలు, పారిశ్రామిక అవసరాలతో పాటు అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత కారణంగా శీతలీకరణ పరికరాల వినియోగం పెరగడం కూడా విద్యుత్ డిమాండ్ పెరుగుదలకు కారణమవుతోంది.
Also rread: న్యాయంపై నమ్మకం పోయిన లాయర్… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్
రాష్ట్రంలో విద్యుత్ ను పొదుపుగా వినియోగించుకోవాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ తెలిపారు. తెలంగాణలో వ్యవసాయ రంగం, గృహావసరాలు, వాణిజ్య, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ అవసరాలు, ముఖ్యంగా భూగర్భ జలమట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో బోర్లపై ఆధారపడటం, మోటార్ల వినియోగం పెరగడం వల్ల విద్యుత్ డిమాండ్‌పై అదనపు ఒత్తిడి ఏర్పడుతోందని పేర్కొన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను సమకూర్చుకునేందుకు కొనుగోలు, ఉత్పత్తి సామర్థ్యాల పెంపు తదితర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
విద్యుత్‌ను అవసరమైన మేరకే వినియోగిస్తూ, వృథాను నివారించాలని సీఎండీ వినియోగదారులకు విజ్ఞప్తి చేశారు. నీటిని కూడా పొదుపుగా వినియోగించాలని కోరారు. ఇదిలాఉండగా జితేష్ పాటిల్ ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు విద్యుత్ శాఖ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ, వ్యవసాయ విద్యుత్ సరఫరాను పర్యవేక్షిస్తున్నారు. రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, సత్వర పరిష్కారం చూపించేందుకు గత వారం రోజులుగా అధికారులు ప్రతిరోజూ ఉదయం నుంచే ‘పొలం బాట’ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. భూగర్భ జలాల పరిస్థితి, పంటల సాగు అవసరాలు, పెరుగుతున్న వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన సహకారం అందిస్తున్నారు.
Also read: ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!