Sci-Fi Horror Movie: నగరానికి దూరంగా ప్రశాంతంగా బతకాలని ఓ కుటుంబం ఫామ్హౌస్ కు వెళ్తుంది. కానీ వాళ్ల ఇంటి దగ్గర ఆకాశం నుంచి ఓ వింత ఉల్క పడటంతో అంతా మారిపోతుంది. మొదట్లో ఎవరికీ అది ప్రమాదం అనిపించదు. కానీ కొద్దిరోజులకే అక్కడి చెట్లు, జంతువులు వింతగా మారిపోతాయి. చివరకు ఆ వింత ప్రభావం మనుషుల మీద కూడా పడుతుంది. తమ ఇంట్లోనే ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితిలో ఆ కుటుంబం చిక్కుకుంటుంది. తెలియని శక్తి మనుషుల జీవితాలను ఎలా తలకిందులు చేస్తుందో చూపించే సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ ‘కలర్ అవుట్ ఆఫ్ స్పేస్’ (Color Out of Space).
నాథన్ గార్డ్నర్, అతని భార్య థెరిసా, పిల్లలు నగర జీవితానికి దూరంగా ఉండాలని ఓ గ్రామీణ ప్రాంతంలోని ఫామ్హౌస్కు వస్తారు. అక్కడ ప్రశాంతంగా జీవితం గడపాలని అనుకుంటారు. కానీ ఓ రాత్రి వారి ఇంటి ప్రాంగణంలో ఆకాశం నుంచి ఓ ఉల్క పడుతుంది. ఆ సంఘటనతో తమ జీవితాలు ఎలా మారిపోతాయో వాళ్లు కనీసం ఊహించరు. ఉల్క పడిన ప్రాంతంలో మొదట చిన్నచిన్న మార్పులు కనిపిస్తాయి. చెట్లు, మొక్కలు వింత రంగుల్లోకి మారతాయి. అక్కడి జంతువుల ప్రవర్తన కూడా అసాధారణంగా ఉంటుంది.
ఈ మార్పులకు కారణం ఏమిటో తెలుసుకునేలోపే ఆ ప్రభావం చుట్టు పక్కల ప్రాంతానికి వ్యాపిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఆ వింత శక్తి ప్రభావానికి గురవుతారు. కొద్దిరోజులకు నాథన్ ప్రవర్తనలో మార్పులు కనిపించడం మొదలవుతుంది. పిల్లలు కూడా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇంట్లో జరిగే సంఘటనలు వింతగా ఉన్నాయని థెరిసాకు అర్థమవుతుంది. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతుంది. బయట ప్రపంచంతో సంబంధాలు తగ్గిపోవడం, కుటుంబ సభ్యుల మధ్య భయం పెరగడంతో అక్కడి నుంచి బయటపడటం కష్టం అవుతుంది.
ఆ వింత ఉల్కలో ఉన్న శక్తి కేవలం ప్రకృతినే కాదు, మనుషుల ఆలోచనలను, శరీరాలను కూడా మార్చేస్తుంటుంది. ఒకప్పుడు తమకు ఎంతో ఇష్టమైన ఇల్లు ఇప్పుడు భయంకరమైన ప్రదేశంగా మారిపోతుంది. కుటుంబాన్ని కాపాడుకోవడానికి నాథన్, థెరిసా చేసే ప్రయత్నాలు కథను మరింత భయంకరంగా మారుస్తాయి. అసలు ఆ ఉల్కలో ఏముంది ? దాని ప్రభావం నుంచి కుటుంబం బయట పడగలదా ? అనేదే సినిమాలో చూడాల్సిన అసలైన కథ.
‘కలర్ అవుట్ ఆఫ్ స్పేస్’ 2019లో విడుదలైన ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ సినిమా. నాథన్ పాత్రలో నికోలస్ కేజ్ (Nicolas Cage), థెరిసా పాత్రలో జోలీ రిచర్డ్సన్ (Joely Richardson) నటించారు. రిచర్డ్ స్టాన్లీ (Richard Stanley) ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జియో హాట్స్టార్ (Jio Hostar)లో ప్రస్తుతం సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. విభిన్న కథలు ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ ఆప్షన్.
Read Also: గేమ్ ఆడితే మెదడునే కంట్రోల్ చేసే డేంజరస్ టెక్నాలజీ… సైకలాజికల్ సైఫై థ్రిల్లర్ ఓటీటీలోకి