Sci Fi Horror Thriller: గేమింగ్ లో గెలవడానికి కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తే… అదే టెక్నాలజీ మన మెదడుతో ఆటలాడటం మొదలు పెడితే ఎలా ఉంటుందో ఊహించడం కష్టం. దానివల్ల కళ్ల ముందు కనిపించేది నిజమో, భ్రమో తెలియని పరిస్థితి ఎదురైతే… మనకు ఎంతో ఇష్టమైన గేమింగే భయపెట్టడం మొదలుపెడితే ఎలా ఉంటుంది ? ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన సైఫై హారర్ థ్రిల్లర్ ‘లేటెన్సీ’ (Latency). ఏఐ టెక్నాలజీతో మెదడును అనుసంధానించే ప్రయోగం ఓ యువతి జీవితాన్ని ఎలా మార్చేసిందో ఈ సినిమాలో చూపించారు. మరి ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో వచ్చిన ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు అనే వివరాల్లోకి వెళ్తే…
హనా ఓ ప్రొఫెషనల్ గేమర్. గేమింగ్ లో మంచి టాలెంట్ ఉన్నా, అగోరాఫోబియా అనే సమస్య కారణంగా ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయపడుతుంది. అందుకే ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతూ గేమ్స్ ఆడుతుంటుంది. బయట ప్రపంచానికి దూరంగా ఉన్నా, గేమింగ్‌లో మాత్రం తన ప్రతిభను నిరూపించుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఓ కొత్త గేమింగ్ పరికరాన్ని పరీక్షించే అవకాశం వస్తుంది. ఈ పరికరం అత్యాధునిక ఏఐ టెక్నాలజీతో పని చేస్తుంది. మెదడు స్పందనలను గుర్తించి, గేమింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడం దీని ప్రత్యేకత.
తన ఆటలో వేగం, ఏకాగ్రత పెరుగుతాయని భావించిన హనా ఈ ప్రయోగానికి అంగీకరిస్తుంది. ఆమె బెస్ట్ ఫ్రెండ్ జెన్ కూడా ఈ సమయంలో తోడుగా ఉంటుంది. మొదట ఈ కొత్త టెక్నాలజీ హనాకు బాగానే పని చేస్తుంది. గేమింగ్ లో తన సామర్థ్యాన్ని మరింత పెంచుకునే అవకాశం దొరికిందని సంతోషిస్తుంది. కానీ కొద్దిరోజులకే పరిస్థితి మారిపోతుంది. ఆ పరికరాన్ని ఉపయోగిస్తున్నప్పుడు హనాకు వింత అనుభవాలు ఎదురవుతాయి. కళ్ల ముందు కనిపించే దృశ్యాలు నిజమో, తన మెదడు సృష్టిస్తున్న భ్రమలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. మొదట వీటిని పెద్దగా పట్టించుకోకపోయినా, ఆ తర్వాత తన చుట్టూ జరుగుతున్న విషయాలను కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోతుంది.
ఈ పరిణామాలతో హనాకు ఆ పరికరంపై అనుమానం మొదలవుతుంది. తన భయాలు, ఆలోచనలపై టెక్నాలజీ ప్రభావం చూపిస్తోందా, లేక తన మెదడులోనే ఏదైనా మార్పు జరుగుతోందా అనే సందేహం వెంటాడుతుంది. గేమింగ్‌లో తనకు ఉపయోగపడుతుందని నమ్మిన పరికరమే ఇప్పుడు భయానికి కారణమవుతుంది. నిజం ఏంటో తెలుసుకోవాలనే ప్రయత్నంలో హనా మరింత ఇబ్బందుల్లో పడుతుంది. తనకు ఎదురవుతున్న అనుభవాల వెనుక అసలు కారణం ఏంటి ? ఈ పరిస్థితి నుంచి ఆమె ఎలా బయట పడుతుంది ? అనేది సినిమాలో చూడాలి.
‘లేటెన్సీ’ 2024లో విడుదలైన ఇంగ్లీష్ సైఫై హారర్ థ్రిల్లర్. ఈ సినిమా జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. కావాలంటే ఇంగ్షీషులో చూడాల్సిందే. సాషా లస్ (Sasha Luss), అలెక్సిస్ రెన్ (Alexis Ren) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జేమ్స్ క్రోక్ (James Croke) దర్శకత్వం వహించారు. గేమింగ్, ఏఐ టెక్నాలజీ, సైకలాజికల్ హారర్‌తో వంటి అంశాలున్న ఈ సినిమా మూవీ లవర్స్ కి ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ను అందించవచ్చు.
Read Also: డెత్ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్