Cyber Crime Series on OTT : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాన్ని సులభతరం చేస్తున్నా, అదే టెక్నాలజీ తప్పుడు ఆలోచనలు ఉన్న వ్యక్తుల చేతుల్లో పడితే ఎంత ప్రమాదకరంగా మారుతుందో ఊహించడం కూడా కష్టం. ముఖ్యంగా డీప్‌ఫేక్ వీడియోలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సమస్యగా మారాయి. వాటికి ఒకరి జీవితాన్ని కేవలం కొన్ని నిమిషాల్లో నాశనం చేసే శక్తి ఉంది. అలాంటి సున్నితమైన అంశాన్ని సైబర్ క్రైమ్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన వెబ్ సిరీస్ ‘సర్వీస్ గర్ల్’ (Service Girl). సామాజిక అవమానం, సైబర్ నేరాలు, డార్క్ వెబ్, బ్లాక్‌మెయిల్… ఇవన్నింటినీ ఒకే కథలో మిళితం చేస్తూ రూపొందిన ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ నుంచే ఆసక్తిని పెంచుతుంది. నిమిషానికో ట్విస్ట్ తో కథ చివరి వరకు సస్పెన్స్ ఫుల్ గా సాగుతుంది. మరి ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎక్కడ ? అనేది తెలుసుకుందాం పదండి.
దివ్య ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువతి. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుని ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని గడుపుతుంటుంది. వివాదాలకు దూరంగా ఉండే ఆమె జీవితం ఒక్క రాత్రిలో పూర్తిగా మారిపోతుంది.
ఒకరోజు ఆమెకు తెలియకుండానే డీప్‌ఫేక్ టెక్నాలజీతో ఆమె ముఖాన్ని ఉపయోగించి తయారు చేసిన అశ్లీల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది తనది కాదని ఎంత చెప్పినా ఎవరూ నమ్మరు. భర్త, కుటుంబ సభ్యులు, సమాజం… అందరూ ఆమెనే తప్పుపడతారు. చేయని తప్పుకు దివ్య తీవ్ర అవమానాన్ని ఎదుర్కొంటుంది. అవమానం భరించలేక జీవితాన్ని ముగించుకోవాలని కూడా అనుకుంటుంది. కానీ చివరి క్షణంలో తాను నిర్దోషిని అని నిరూపించుకోవాలని నిర్ణయించుకుంటుంది. అక్కడి నుంచే ఆమె అసలు పోరాటం మొదలవుతుంది.
నిజం కోసం వెతుకుతూ దివ్య ఒక ప్రమాదకరమైన సైబర్ క్రైమ్ ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. డార్క్ వెబ్, లైవ్ స్ట్రీమింగ్ మాఫియా, ఆన్‌లైన్ బ్లాక్‌మెయిల్ నెట్‌వర్క్ వెనుక ఉన్న అసలు నేరస్థులను వెతికే ప్రయత్నంలో ఊహించని నిజాలు బయటపడతాయి. ప్రతి అడుగు ఆమె ప్రాణాలకే ముప్పుగా మారుతుంది.
ఈ మొత్తం నెట్‌వర్క్ వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ జాకీ భయ్యా ఎవరు ? దివ్య తనపై జరిగిన కుట్రను ఎలా బయట పెట్టింది ? తన కుటుంబానికి తిరిగి దగ్గరైందా ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ‘సర్వీస్ గర్ల్’ వెబ్ సిరీస్‌ను చూడాల్సిందే.
‘సర్వీస్ గర్ల్’ ప్రధాన బలం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన AI డీప్‌ఫేక్ అంశాన్ని ఎంచుకోవడమే. ఒక ఫేక్ వీడియో వల్ల అమాయకుల జీవితాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతాయో సిరీస్ లో ఎమోషనల్ గా చూపించారు. ఖుషీ దూబే ఇందులో ప్రధాన పాత్రను పోషించారు. ముఖ్యంగా డార్క్ వెబ్ నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్‌లు ఉత్కంఠను మరింత పెంచుతాయి.
Read Also :
‘సర్వీస్ గర్ల్’ వెబ్ సిరీస్ ప్రస్తుతం హంగామా (Hungama) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 2026 జూలై 30 నుంచి అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ హిందీ ఆడియోలో మాత్రమే లభిస్తోంది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు. సైబర్ క్రైమ్‌లు, డీప్‌ఫేక్, సోషల్ మీడియా ప్రమాదాలతో తెరకెక్కిన థ్రిల్లర్ కథలు చూడాలనుకుంటే ఈ సిరీస్ ను మస్ట్ వాచ్. నేటి డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక కీలక సమస్యను ఉత్కంఠభరితంగా చూపించే ఈ వెబ్ సిరీస్‌ను ఒకసారి తప్పకుండా చూడొచ్చు.