MLC Survey: స్వేచ్చ బ్యూరో: వచ్చే ఏడాది మార్చిలో జరగబోయే ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక పై కాంగ్రెస్ పార్టీ ఇప్పట్నుంచే ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే అభ్యర్ధుల ఎంపికలో సర్వేలను ప్రమాణికంగా తీసుకోవాలని నిర్ణయించారు. ఆశావహులు, ఆయా జిల్లాల్లో పాపులర్ పర్సన్లు ఇలా రెండు కేటగిరీల్లో సర్వేలు చేయాలని పార్టీ నిర్ణయించింది. వరుసగా మూడు ఫేజ్ లలో సర్వేలు చేయనున్నారు. మూడింట్లో పాజిటివ్ గా నిలుస్తేనే టిక్కెట్ ఎంపిక చేయాలని పార్టీ, ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించింది.
బడా లీడర్ల సిఫారసులను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించవద్దని ఇటీవల ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా టీపీసీసీ కి నొక్కి చెప్పారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూ వివరించారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే గ్రాడ్యుయేట్ ఎన్నికలకు అభ్యర్ధులను ఫిల్టర్ చేయనున్నారు. ఇప్పటికే టిక్కెట్ ఆశిస్తున్న నాయకులు ఒక్కొక్కరూ క్షేత్రస్థాయిలో తమ తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే, కేవలం నాయకుల ఒత్తిడికో లేక రికమండేషన్లకో లొంగకుండా పార్టీ స్పష్టంగా సర్వే మూడ్ తోనే సెలక్ట్ చేయనున్నది.
ఇందులో భాగంగా ఆశావాహుల ప్రాథమిక జాబితాతో పాటు, సమాజంలో గుర్తింపు ఉన్న ప్రముఖులు, మేధావులు, ఉద్యమకారులు ప్రజాదరణ ఉన్న వర్గాలకు చెందిన “పాపులర్ వ్యక్తుల” కేటగిరీని ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. ఈ రెండు కేటగిరీలపై మూడు విడతలుగా సర్వేలు చేస్తారు. తొలి దశలో నియోజకవర్గంలో ఆయా ఆశావహులకు ఉన్న ప్రాథమిక గుర్తింపు, పార్టీ శ్రేణుల్లో ఉన్న సఖ్యత, సమన్వయం వంటి వాటిపై స్టడీ చేయనున్నారు. రెండో దశలో నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్ ఓటర్ల ఆధారంగా, అభ్యర్థి యొక్క చదువు, వివాదరహిత వ్యక్తిత్వం, విద్యావంతులను ఆకట్టుకునే సామర్థ్యంపై లోతైన అధ్యయనం జరుగుతుంది. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలు, క్షేత్రస్థాయిలో చివరి నిమిషంలో పనిచేసే సమీకరణాలు , ఆర్థిక, సామాజిక బలాబలాలను బేరీజు వేస్తూ తుది సర్వే నిర్వహిస్తారు.ఈ మూడంచెల సర్వే ఫలితాల్లోనూ ఎవరైతే స్థిరంగా ముందంజలో ఉండి, సానుకూల నివేదికలు సాధిస్తారో వారికే అంతిమంగా టిక్కెట్ కేటాయించాలని నిర్ణయించారు. ఒక్క సర్వేలో గ్రాఫ్ తగ్గినా .. ప్రతికూల అంశాలు వెలుగుచూసినా ప్రత్యామ్నాయ అభ్యర్థులను పరిశీలిస్తారు.
Also Read: మేడ్చల్‌లో ఉద్యమ యోధులకు ఘన నివాళులు.. ఒక్కటైన కీలక నేతలు!
గ్రాడ్యుయేట్ స్థానాల్లో ఓటర్లు సాధారణ ఎన్నికల ఓటర్ల కంటే భిన్నంగా ఆలోచిస్తారు.రాజకీయ ప్రాతిపదికన మాత్రమే కాకుండా అభ్యర్థి వ్యక్తిత్వం,విద్యావంతుల సమస్యలపై పోరాడే నైజం,నిరుద్యోగ సమరంలో చూపే చొరవ వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో జరిపినట్లే కఠినమైన ఫిల్టరింగ్ ప్రక్రియను ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు.మార్చిలో జరిగే ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకుని క్షేత్రస్థాయిలో తమ పట్టును చాటుకోవాలని కాంగ్రెస్ భావిస్తుండగా, ఈ ‘ట్రిపుల్ సర్వే’ విధానం ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ రెండు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది. పైగా రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పరిధిలోని దాదాపు రాష్ట్రంలోని 60 శాతానికి పైగా నియోజకవర్గాలను కలిగి ఉన్నట్లు పార్టీ పెద్దలు చెబుతున్నారు.దీంతో ఈ రెండు స్థానాలను కచ్చితంగా దక్కించుకోగలిగితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ని సులువుగా గెలిపించుకోవచ్చని హస్తం పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు. దీనిలో భాగంగానే మంత్రులు పొంగులేటిశ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహా, వాకిటి శ్రీహరి లు ఆయా సెగ్మెంట్ల పరిధిలోని ఎమ్మెల్యేలతో కంటిన్యూగా రివ్యూలు చేస్తున్నారు. అంతేగాక ఆరు ఉమ్మడి జిల్లాల్లో సుమారు 14 లక్షల మంది పట్టభద్రులు ఉన్నట్లు పార్టీ అంచనా వేసింది. దీంతో ఆ ఓటర్లను ఆకట్టుకునేలా పార్టీ ప్రిపేర్ అవుతున్నది.
Also Read: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం బ్రేక్.. షాకైన ఏపీ ప్రభుత్వం
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణీదేవి, వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తీన్మార్ మల్లన్న పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 27తో ముగియనుంది. దీంతో మార్చి 29 కల్లా ఈ స్థానాల్లో కొత్త ఎమ్మెల్సీలు ఎన్నిక కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించేందుకు సెప్టెంబరు 20 నుంచి 30 తేదీల మధ్య ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్ ఉన్నది. అక్టోబరు నుంచి డిసెంబరు 31 వరకు ఓటరు నమోదు ప్రక్రియను కొనసాగించి జనవరిలో అభ్యంతరాలు, సవరణ ప్రక్రియ జరగనున్నది. అనంతరం ఫిబ్రవరి చివరి వారం, మార్చి మొదటి వారంలో నోటిఫికేషన్ జారీ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానం నుంచి అభ్యర్థిత్వం కోసం ప్రధానంగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి, తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శివసేనారెడ్డి, సీడబ్ల్యూసీ మెంబర్ వంశీచంద్ రెడ్డి తదితరులు పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక వరంగల్-ఖమ్మం-నల్లగొండ స్థానం నుంచి రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, విజయా డెయిరీ మాజీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, ఓయూ జేఏసీ నేత మనవతా రాయ్ తదితరులు ప్రయత్నిస్తున్నారు.
Also Read: తరుణ్ తేజ్‌పాల్ లైంగిక వేధింపుల కేసులో బిగ్ ట్విస్ట్.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు!