Tamil Crime Thriller: ఓ మేకను చంపి ఓ పేద రైతు పొట్టకొట్టిన ఇసుక మాఫియా… చివరకు అతడిని న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కేలా చేస్తుంది. కానీ పలుకుబడి ఉన్న మాఫియాను ఎదిరించి ఆ రైతుకు అండగా నిలబడేదెవరు ? పోలీస్ శాఖలోనే పనికిరాని వాడిగా ముద్రపడిన ఓ కానిస్టేబుల్‌కు ఈ బాధ్యత అప్పగిస్తారు. తనను చిన్నచూపు చూసిన వాళ్ల ముందు సత్తా చాటుకోవడంతో పాటు, ఓ సామాన్యుడికి న్యాయం చేయడం కోసం అతడు చేసే పోరాటమే ‘లెనిన్ పాండియన్’ (Lenin Pandian). అక్రమ ఇసుక తవ్వకాల చుట్టూ అల్లుకున్న ఈ తమిళ కథలో కానిస్టేబుల్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడో చూడాల్సిందే.
లెనిన్ పాండియన్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తుంటాడు. అతడి తండ్రి కూడా పోలీస్ విధుల్లోనే ప్రాణాలు కోల్పోవడంతో, ఆయన ఉద్యోగం లెనిన్ కు వస్తుంది. అయితే శాఖలోని తోటి సిబ్బంది అతడిని పెద్దగా పట్టించుకోరు. కీలకమైన బాధ్యతలు అప్పగించకుండా చిన్నచిన్న పనులకే పరిమితం చేస్తుంటారు. తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలని లెనిన్‌కు ఉన్నా, అందుకు సరైన అవకాశం దక్కదు.
మరోవైపు, ఓ గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల సమస్యలు తీవ్రమవుతాయి. ఇసుక మాఫియా కార్యకలాపాల కారణంగా ఓ పేద రైతు తనకు జీవనాధారంగా ఉన్న మేకను కోల్పోతాడు. అది అతడికి కేవలం ఓ మూగజీవాన్ని కోల్పోవడం మాత్రమే కాదు… తన జీవనోపాధికి తీరని నష్టం కలిగినట్లవుతుంది. జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నా, అతడికి ఆశించిన స్పందన లభించదు. అక్రమ వ్యాపారం వెనుక బలమైన వ్యక్తులు ఉండటంతో, వారిని ఎదిరించడం అంత సులభం కాదని అర్థమవుతుంది.
చివరకు ఆ రైతు న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తాడు. దీంతో అతడికి రక్షణ కల్పించే బాధ్యత పోలీసులకు చేరుతుంది. అనూహ్యంగా ఈ డ్యూటీ లెనిన్ పాండియన్‌కు వస్తుంది. ఇన్నాళ్లూ చిన్నచూపు చూసిన ఉద్యోగంలోనే తన సత్తా నిరూపించుకునే అవకాశం అతడికి దక్కుతుంది. అయితే ఇది సాధారణ విధి నిర్వహణ కాదు. రైతును కాపాడాలంటే ఇసుక మాఫియా బెదిరింపులను ఎదుర్కోవాలి.
తనకు ఉన్న పరిమిత అధికారాలతోనే లెనిన్ పోరాటం మొదలుపెడతాడు. రైతుకు రక్షణ కల్పిస్తూనే, అక్రమ ఇసుక తవ్వకాల వెనుక ఉన్న వ్యక్తుల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఓ సామాన్య రైతుకు న్యాయం చేయాలనే ప్రయత్నం, లెనిన్ జీవితాన్నే ప్రమాదంలోకి నెట్టే పోరాటంగా మారుతుంది. మరి ఇసుక మాఫియా ఆగడాలకు అతడు ఎలా అడ్డుకట్ట వేశాడు? రైతుకు న్యాయం జరిగేలా చేయగలిగాడా? పోలీస్ శాఖలో తనను తక్కువగా చూసినవారికి తన సత్తా ఎలా చూపించాడు? అనేది సినిమాలో చూడాలి.
‘లెనిన్ పాండియన్’ తమిళ భాషలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా అక్టోబర్ 16 నుంచి ప్రైమ్ వీడియో (Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు డబ్బింగ్ లేదు. దర్శన్ గణేశన్ (Darshan Ganesan), గంగై అమరన్ (Gangai Amaran), రోజా (Roja), శ్రితా రావు (Shrita Rao) తదితరులు ఈ చిత్రంలో నటించారు. డి.డి. బాలచంద్రన్ (D. D. Balachandran) దర్శకత్వం వహించగా, ఇళయరాజా (Ilaiyaraaja) సంగీతం అందించారు.
Read Also: డెత్ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్