Fish Seed: స్వేచ్చ బ్యూరో: చేపల పెంపకాన్ని ప్రోత్సహించి మత్స్యకారుల ఆదాయాన్ని పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యానికి నీటి కొరత సవాల్గా మారింది. వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో చెరువులు, కుంటల్లో నీటిమట్టాలు తగ్గుతుండటం చేపపిల్లల పెంపకంపై ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఈ ఏడాది 17 జిల్లాల్లో చేపపిల్లల పంపిణీకి ప్రభుత్వం నిర్ణయించడం, ఇందుకోసం రూ.116 కోట్లు కేటాయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నీటి లభ్యతను అంచనా వేయకుండా చేపపిల్లలను చెరువుల్లో వదిలితే కొద్దిరోజులకే నీరు లేక అవి మృత్యువాతపడే ప్రమాదం ఉంది. అదే జరిగితే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతినడంతోపాటు ప్రజాధనం వృథా అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సాధారణంగా చెరువులు, కుంటల్లో నీటి లభ్యత, విస్తీర్ణం, చేపల పెంపకానికి అనుకూలత ఆధారంగా చేపపిల్లలను వదులుతారు. అయితే ప్రస్తుతం అనేక ప్రాంతాల్లో నీటి నిల్వలు తగ్గుతుండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, ఎండల తీవ్రత, నీటి వినియోగం పెరగడం వంటి కారణాలు చెరువులపై ప్రభావం చూపుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న మూడు నెలల్లో కొన్ని చెరువులు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉందనే అంచనాలు మత్స్యరంగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.చేపపిల్లలను చెరువుల్లో వదిలిన తర్వాత అవి ఎదిగే వరకు తగినంత నీరు ఉండటం కీలకం. నీటిమట్టం తగ్గితే చేపలకు అవసరమైన ఆక్సిజన్ లభ్యతపై ప్రభావం పడటంతోపాటు నీటి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఫలితంగా చేపల ఎదుగుదల మందగించడం, వ్యాధులు ప్రబలడం, చివరకు పెద్ద సంఖ్యలో చేపలు చనిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. చెరువులో నీరు పూర్తిగా అడుగంటితే అప్పటివరకు చేసిన ఖర్చంతా వృథా అవుతుంది.
చేపల ఉత్పత్తిని పెంచడం, మత్స్యకారులకు ఉపాధి కల్పించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతోంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గాను 32 జిల్లాల్లో తొలుత పంపిణీకి ప్రణాళికలు రూపొందించినప్పటికీ ఎల్ నినో తో ఈ ఏడాది 17 జిల్లాల్లో పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి టెండర్లను సైతం ఆహ్వానించారు. ఇందుకోసం రూ.116 కోట్లను కేటాయించింది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా అమలు చేయాలన్నది కీలకంగా మారింది.చేపపిల్లల పంపిణీకి ముందే ఆయా జిల్లాల్లోని చెరువులు, కుంటల్లో నీటి నిల్వలపై సమగ్ర అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నీటి పరిమాణం ఆధారంగా కాకుండా, రానున్న నెలల్లో నీటి లభ్యత ఎలా ఉండనుందన్న అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. నీటి నిల్వలు తగినంతగా ఉన్న చెరువులకే ప్రాధాన్యం ఇవ్వడం, నీటి లభ్యతపై స్పష్టత లేని చోట్ల పంపిణీని వాయిదా వేయడం వంటి చర్యలు తీసుకుంటే నష్టాలను తగ్గించే అవకాశం ఉంది.
Also read: పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!
గత నెల 28న వనపర్తిలో మంత్రి వాకిటిశ్రీహరి ఉచితచేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే రాష్ట్రంలోని 41వేల చెరువులు, కుంటలతో పాటు జలశయాలు ఉన్నాయి. అయితే వాటిలో చేపపిల్లల పంపిణీకి అనుకూలమైన చెరువులను గుర్తించేందుకు నీటి లభ్యతపై జిల్లా కలెక్టర్ల నుంచి నివేదికలను మత్స్యశాఖ కోరింది. జిల్లాలవారీగా చెరువుల్లో నీటిమట్టాలు, నీటి నిల్వలు ఎంతకాలం సరిపోతాయి? చేపల పెంపకానికి అవి అనువుగా ఉన్నాయా? ఎన్ని రోజూలు నీటి నిల్వ ఉంటాయి? తదితర అంశాలపై నివేదికలు ఇస్తున్నట్లు సమాచారం. ఈ నివేదికల ఆధారంగానే రెండుమూడు రోజుల్లో పంపిణీపై తుది నిర్ణయంను శాఖ ఉన్నతాధికారులుసమావేశమై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే నివేదికలు రూపొందించేటప్పుడు ప్రస్తుతం చెరువుల్లో ఉన్న నీటి నిల్వలను నమోదు చేయడమే కాకుండా, వర్షపాతం పరిస్థితులు, ఆవిరీభవనం, సాగునీరు ఇతర అవసరాలకు జరిగే వినియోగం వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. నీరు ప్రస్తుతం ఉన్నప్పటికీ మరో రెండు మూడు నెలల్లో చెరువు ఎండిపోయే పరిస్థితి ఉంటే అక్కడ చేపపిల్లలను వదలడం ప్రయోజనకరం కాదు. దీంతో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఎల్నినో ప్రభావం వర్షపాతంలో హెచ్చుతగ్గులకు, ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమయ్యే అవకాశం ఉండటంతో నీటి వనరుల నిర్వహణపై అప్రమత్తత అవసరం. రాష్ట్రంలోని సగం నీటి ట్యాంకుల్లోనే ప్రస్తుతం నీరు అందుబాటులో ఉందన్న అంచనాల నేపథ్యంలో చేపల పెంపకంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నీటి కొరత ఉన్న చెరువుల్లో చేపపిల్లలను వదిలితే వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. మరోవైపు నీటి లభ్యత తగినంతగా ఉన్న చెరువుల్లో సకాలంలో పంపిణీ చేస్తే మత్స్యకారులకు ప్రయోజనం చేకూరుతుంది.అన్ని చెరువులకు ఒకే విధమైన విధానాన్ని అనుసరించకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించడం అవసరం.
Also read: తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!
చేపపిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.116 కోట్లు కేటాయించిన నేపథ్యంలో నిధుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. చేపపిల్లల కొనుగోలు, రవాణా, పంపిణీ వంటి ప్రక్రియలు పూర్తయిన తర్వాత చెరువుల్లో నీరు లేక అవి చనిపోతే ప్రభుత్వ వ్యయం ఆశించిన ఫలితాలు రావు. మత్స్యకారులకూ నష్టం వాటిల్లుతుంది. అందుకే పంపిణీ లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా, వదిలిన చేపపిల్లలు మనుగడ సాగించి ఎదిగేలా చర్యలు తీసుకోవాలి.నీటి నిల్వలు సరిపోని చెరువులకు చేపపిల్లలను పంపకుండా ప్రత్యామ్నాయ చెరువులను గుర్తించడం, నీటి లభ్యత ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యం ఇవ్వడం, పంపిణీ తర్వాత కూడా చెరువుల పరిస్థితిని పర్యవేక్షించడం వంటి చర్యలు చేపట్టాలి. అవసరమైతే పంపిణీని దశలవారీగా నిర్వహించాలి. ఈ విధానం వల్ల అందుబాటులో ఉన్న నిధులను సమర్థంగా వినియోగించడంతోపాటు మత్స్యకారులకు నష్టాలు కలిగిస్తాయి.
చేపపిల్లల పంపిణీ కార్యక్రమం విజయవంతం కావాలంటే నిధుల కేటాయింపు, పంపిణీ లక్ష్యాల నిర్ణయంతోపాటు క్షేత్రస్థాయిలో నీటి లభ్యతపై నిరంతర పర్యవేక్షణ అవసరం. చెరువుల్లో నీటి నిల్వలు, చేపల పెంపకానికి అనుకూల పరిస్థితులు, రానున్న వాతావరణ పరిస్థితులను సమన్వయంగా పరిశీలించాలి. కలెక్టర్ల నివేదికల ఆధారంగా చెరువులవారీగా ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయించాలి.లేకుంటే చేపల ఉత్పత్తిని పెంచాలన్న ప్రభుత్వ ఉద్దేశం నెరవేరకపోగా, మత్స్యకారులకు ఆర్థిక నష్టం, ప్రభుత్వానికి అదనపు భారం తప్పకపోవచ్చు. అందువల్ల చేపపిల్లల పంపిణీకి ముందే నీటి లభ్యతపై శాస్త్రీయ అంచనా వేసి, మనుగడకు అనుకూలమైన చెరువులనే ఎంపిక చేయడం అత్యవసరం. చేపపిల్లలను చెరువుల్లో వదలడమే కాదు.. అవి ఎదిగేంతవరకు నీరు ఉండేలా చూడటమే అసలైన సవాల్. ఏది ఏకమైనప్పటికీ ప్రభుత్వం చేపపిల్లల పంపిణీపై ఏం నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.
Also read: చిన్న స్థాయి నుంచి మ్యూజిక్ సెన్సేషన్గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ