Tamil Legal Crime Thriller Series: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని ఉల్లంఘిస్తే బాధితులకు న్యాయం చేసేది ఎవరు ? పోలీసుల కస్టడీలో ఓ వ్యక్తి చనిపోతే… అది నిజంగా ప్రమాదమా, లేక అధికారాన్ని అడ్డుపెట్టుకుని జరిగిన నేరమా ? ఇలాంటి కేసుల్లో నిజం బయటకు రావడం అంత ఈజీ కాదు. సాక్ష్యాలు మాయమవ్వొచ్చు, సాక్షులు భయంతో వెనక్కి తగ్గొచ్చు, నిందితులకు అండగా నిలిచేవారు కూడా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం కోసం కోర్టులో పోరాడే ఓ లాయర్ కథతో రూపొందిన తమిళ లీగల్ క్రైమ్ డ్రామా ‘సట్టముం నీతియుం’ (Sattamum Needhiyum) రెండో సీజన్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓటీటీ మూవీ లవర్స్ ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చు అనే వివరాల్లోకి వెళ్తే…
ఈ సిరీస్ లో సుందరమూర్తి ఓ న్యాయవాది. న్యాయం కోసం పోరాడాలని నమ్మే అతడు, తన ముందుకొచ్చే కేసుల్లో నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. కానీ చట్టపరమైన పోరాటం అంటే కోర్టులో వాదనలు వినిపించడం మాత్రమే కాదు. కేసులోని వ్యక్తుల నేపథ్యం, పోలీసుల విచారణ, సాక్ష్యాల విశ్వసనీయత, న్యాయ వ్యవస్థలోని చిక్కులు అన్నీ కీలకంగా మారతాయి. ముఖ్యంగా పోలీసులపై ఆరోపణలు వచ్చినప్పుడు పరిస్థితి మరింత సున్నితంగా మారుతుంది.
పెద్ద కేసులు లేకుండా, ఆర్థిక ఇబ్బందులతో అతను తన జీవితాన్ని నెట్టుకొస్తుంటాడు. అదే సమయంలో కూతురి పెళ్లి బాధ్యత కూడా అతడి మీద ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్‌స్పెక్టర్ కనగవేల్ ఓ ఫామ్‌హౌస్ పార్టీలో మర్డర్ అవుతాడు. ఈ హత్య కేసులో అతడి స్టేషన్ కు చెందిన నలుగురు పోలీసులపై ఆరోపణలు వస్తాయి. వారిని అరెస్ట్ చేయడంతో కేసు ఒక్కసారిగా సంచలనంగా మారుతుంది.
చనిపోయిన కనగవేల్ భార్య చంద్ర కూడా న్యాయవాదే. ఆమె బార్ కౌన్సిల్ అధ్యక్షురాలు కావడంతో, ఈ కేసులో నిందితుల తరఫున ఎవరూ వాదించకూడదనే పరిస్థితి ఏర్పడుతుంది. తన భర్తను చంపిన వారికి శిక్ష పడాలనే పట్టుదలతో చంద్ర స్వయంగా నిందితులకు వ్యతిరేకంగా కోర్టులో వాదిస్తుంది. మరోవైపు, అరెస్టయిన పోలీసుల్లో ఒకరి భార్య సుందరమూర్తిని కలిసి తమ తరఫున వాదించాలని వేడుకుంటుంది. ఆమె పరిస్థితిని చూసి కదిలిపోయిన సుందరమూర్తి, బార్ కౌన్సిల్ వ్యతిరేకతను పట్టించుకోకుండా ఆ నలుగురు పోలీసుల తరఫున కేసు తీసుకుంటాడు.
ఇక్కడి నుంచే అసలు కోర్టు రూమ్ డ్రామా మొదలవుతుంది. ఒకవైపు భర్తను కోల్పోయిన చంద్ర నిందితులకు శిక్ష పడాలని పోరాడుతుంటే, మరోవైపు సుందరమూర్తి వారిపై ఉన్న ఆరోపణల్లో నిజానిజాలను ప్రశ్నిస్తాడు. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా రంగంలోకి దిగుతుంది. సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ ఆధారాలు, హత్యకు ఉపయోగించిన తుపాకీ నుంచి పేలిన బుల్లెట్ దూరం వంటి వివరాలు కీలకంగా మారతాయి. కనగవేల్ ధరించిన చొక్కా ఫోరెన్సిక్ పరీక్షల్లో ఎలా పరిశీలించబడిందన్న అంశం కూడా కేసులో సందేహాలకు దారితీస్తుంది.
ప్రతి విచారణలోనూ కొత్త విషయం బయటపడటంతో, మొదట స్పష్టంగా కనిపించిన కేసు క్రమంగా చిక్కుముడిగా మారుతుంది. అసలు హత్య చేసింది ఎవరు ? నలుగురు పోలీసులపై ఉన్న ఆరోపణలు ఎంతవరకు నిజం ? కనగవేల్ మరణానికి ముందు ఏం జరిగింది ? సాక్ష్యాలు చెబుతున్న కథే నిజమా, లేక వాటి వెనుక మరో కోణం ఉందా ? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే సిరీస్ ను మిస్ అవ్వకుండా చూడండి.
‘సట్టముం నీతియుం’ రెండో సీజన్ అక్టోబర్ 23 నుంచి జీ5 (ZEE5)లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, హిందీ ఆడియోలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ లేదు. సుందరమూర్తిగా శరవణన్ (Saravanan), చంద్రగా వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar), కనగవేల్‌గా ప్రేమ్ కుమార్ (Prem Kumar) నటించారు. బాలాజీ సెల్వరాజ్ (Balaji Selvaraj) దర్శకత్వం వహించారు. దర్శకుడు బాలాజీ సెల్వరాజ్ ఈ క్రైమ్, కోర్టు డ్రామాను తెరకెక్కించారు.
Read Also: కూతురి జాడ వెతికితే షాకింగ్ ట్విస్ట్… మైండ్ బ్లాక్ చేసే మర్డర్ మిస్టరీ