Mystery Thriller Series: కనిపించకుండా పోయిన కూతురు కళ్లముందు కనిపిస్తే ఏ తల్లిదండ్రులకైనా అంతకంటే సంతోషం ఉండదు. కానీ అదే కూతురు ఓ హత్య కేసులో అనుమానితురాలిగా మారితే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? కూతురిని కాపాడుకోవాలా, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలా? ఈ రెండింటి మధ్య నలిగిపోయే ఓ కుటుంబం చుట్టూ తిరిగే మిస్టరీ కథే ‘వేర్ ఈజ్ వాండా?’ (Where’s Wanda?) రెండో సీజన్. కూతురి కోసం మొదలైన అన్వేషణ ఇప్పుడు ఓ హత్య వెనుక ఉన్న నిజాన్ని తెలుసుకునే పోరాటంగా మారుతుంది. మరి ఈ సిరీస్‌ను ఎక్కడ చూడొచ్చు? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? తెలుసుకుందాం.
జర్మనీలోని ఓ చిన్న పట్టణంలో నివసించే క్లాట్ కుటుంబానికి వాండా కనిపించకుండా పోవడంతో వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోతాయి. కూతురి ఆచూకీ కోసం తల్లిదండ్రులు కార్లోట్టా, డెడో ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. పోలీసుల దర్యాప్తుతో సరైన సమాధానం దొరక్కపోవడంతో వాళ్లే రంగంలోకి దిగుతారు. చుట్టుపక్కల వాళ్లపై నిఘా పెట్టడం, రహస్యంగా సమాచారం సేకరించడం మొదలుపెడతారు. తమ కూతురికి ఏమైందో తెలుసుకోవాలనే ఆరాటం వాళ్లను ఊహించని పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది.
మొదటి సీజన్‌లో వాండా కోసం తల్లిదండ్రులు చేసే అన్వేషణ, అందుకోసం వాళ్లు ఎంచుకున్న విచిత్రమైన మార్గాలు కథలో ఆసక్తిని పెంచుతాయి. రెండో సీజన్‌లో మాత్రం కథ మరో మలుపు తిరుగుతుంది. వాండా ఓ మృతదేహం పక్కన కనిపించడంతో ఆమెపైనే హత్య అనుమానాలు మొదలవుతాయి. అప్పటివరకు కూతురి ఆచూకీ కోసం ఆరాటపడిన తల్లిదండ్రులు ఇప్పుడు ఆమెను ఈ కేసు నుంచి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. తమ కూతురు నిజంగానే హత్య చేసిందా, లేక ఈ ఘటన వెనుక మరో రహస్యం ఉందా అనే అనుమానాలు మొదలవుతాయి.
అసలు హత్యకు గురైన వ్యక్తి ఎవరు? వాండా అక్కడికి ఎలా వచ్చింది? ఈ ఘటనతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో కుటుంబం మరిన్ని చిక్కుల్లో పడుతుంది. కూతురిని కాపాడుకునే ప్రయత్నంలో తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ఆ నిర్ణయాలు వారిని ఎలాంటి పరిణామాల వైపు నడిపిస్తాయనేదే ఈ సీజన్‌లో ఆసక్తికరమైన అంశం.
‘వేర్ ఈజ్ వాండా?’ రెండో సీజన్ యాపిల్ టీవీ (Apple TV)లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మిస్టరీ, డార్క్ కామెడీ అంశాలతో రూపొందిన జర్మన్ సిరీస్ ఇది. తెలుగు డబ్బింగ్ అందుబాటులో ఉందో లేదో యాప్‌లో పరిశీలించాలి. కుటుంబ అనుబంధాలతో పాటు హత్య మిస్టరీలు, ఊహించని మలుపులు ఇష్టపడేవారికి ఈ సిరీస్ నచ్చవచ్చు. సస్పెన్స్ కథలను ఇష్టపడేవారు ఈ సిరీస్‌ను మీ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవచ్చు.