Mythological Animation Series: చిన్నప్పటి నుంచి రామాయణంలోని హనుమంతుడి కథలు వింటూ పెరిగిన వాళ్లు చాలామందే ఉంటారు. రాముడిపై అపారమైన భక్తి, అసాధారణమైన బలం, ఎంతటి ప్రమాదం ఎదురైనా వెనక్కి తగ్గని ధైర్యం హనుమంతుడి పాత్రను ప్రత్యేకంగా నిలబెడతాయి. అదే కథను ఆధునిక యానిమేషన్ రూపంలో, భారీ యుద్ధాలు, విజువల్ ఎఫెక్ట్స్, ఎమోషనల్ సీన్లతో చూడాలంటే ప్రేక్షకులకు ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ (The Legend of Hanuman) గుర్తుకొస్తుంది. ఇప్పటికే ఆరు సీజన్లతో ప్రేక్షకులను అలరించిన ఈ యానిమేటెడ్ సిరీస్ ఏడో సీజన్‌తో తిరిగొచ్చింది. ఈసారి లంక యుద్ధం మరింత కీలకమైన దశకు చేరుకోవడంతో హనుమంతుడి సాహసాలపై ఆసక్తి పెరుగుతోంది. ఇంతకీ ఈ సీజన్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అన్నది తెలియాలంటే కథలోకి వెళ్దాం పదండి.
ఈ సిరీస్ రామాయణంలోని సంఘటనలను హనుమంతుడి ప్రయాణం, అతడి ధైర్యం, భక్తి కోణాల నుంచి చూపిస్తుంది. రాముడి కోసం సీతను వెతకడం నుంచి లంకలో అడుగు పెట్టడం, రావణుడి సైన్యాన్ని ఎదుర్కోవడం వరకు ఎన్నో కీలక ఘట్టాలు ఇప్పటికే గత సీజన్లలో చోటు చేసుకున్నాయి. ఏడో సీజన్ వచ్చేసరికి యుద్ధం మరింత తీవ్రంగా మారుతుంది. రావణుడి సైన్యం బలంగా ఎదురుదాడి చేస్తుండగా, వానర సైన్యానికి పరిస్థితులు కఠినంగా మారతాయి. ఈ సమయంలో హనుమంతుడి ధైర్యం, తెలివితేటలు, భక్తి మరింత కీలకంగా మారతాయి.
కొత్త సీజన్ లో హనుమంతుడు యమరాజుకు సంబంధించిన ఓ ప్రత్యేకమైన మరణ బాణాన్ని వెతికే ప్రయాణంలోకి వెళ్తాడనే అంశం కథలో ప్రధానంగా నిలుస్తుంది. రావణుడి రక్షణను ఛేదించడానికి యుద్ధం సరిపోని పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు ఆ బాణం కోసం చేసే అన్వేషణ కొత్త సవాళ్లకు దారి తీస్తుంది. హనుమంతుడు తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంటాడు ? ఆ ప్రయాణం లంక యుద్ధంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ? రాముడి సైన్యానికి ఎదురైన క్లిష్ట పరిస్థితులు ఎలా మారతాయి ? అనే అంశాలు ఈ సీజన్ ఉత్కంఠను పెంచుతాయి.
యానిమేషన్ ద్వారా పురాణ పాత్రలను కొత్త తరానికి పరిచయం చేయడం వల్ల పిల్లలు, యువ ప్రేక్షకులు కూడా ఈ కథతో కనెక్ట్ అవుతున్నారు. అదే సమయంలో రామాయణంలోని ప్రధాన సంఘటనలను గుర్తుచేసే సన్నివేశాలు పెద్దవారికి కూడా ఆసక్తి కలిగిస్తాయి.
‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ సీజన్ 7 అక్టోబర్ 23 నుంచి జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో స్ట్రీమింగ్ కు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంది. కాబట్టి తెలుగు ప్రేక్షకులు తమకు నచ్చిన భాషలో ఈ యానిమేటెడ్ మైథాలజీ సిరీస్ ను చూడొచ్చు. పురాణ కథలను ఆధునిక యానిమేషన్‌లో చూడాలనుకునేవారికి, ఫ్యామిలీతో కలిసి కొత్త సీజన్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ సిరీస్ ను శరద్ దేవరాజన్, జీవన్ జే కంగ్, శేఖర్ కపూర్ రూపొందించిన టీమ్, గ్రాఫిక్ ఇండియా నిర్మించింది. హనుమంతుడి పాత్రకు సంబంధించిన వాయిస్ పెర్ఫార్మెన్స్‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ ఎపిసోడ్‌లు సిరీస్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. కొత్త సీజన్‌లోనూ యుద్ధం, భక్తి, సాహసం కలిసిన కథ కొనసాగుతుంది.