Revanth Reddy: ప్రజాభవన్ వేదికగా జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై, రాబోయే కరువు ప్రమాదంపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల వల్ల కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయని, మన రాష్ట్రంలోనూ రాబోయే రోజుల్లో తాగు, సాగునీటి ఎద్దడి తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ వాస్తవాలను ప్రజల నుంచి దాచడం క్యాన్సర్ కంటే ప్రమాదకరమని, నిజాలను ధైర్యంగా ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ మాటలు నమ్మినోళ్లు సచ్చారు..
కేంద్రంలో ప్రధాని మోదీ అనుసరిస్తున్న రాజకీయ కుట్రలను రాహుల్ గాంధీ నాయకత్వంలో సమర్థవంతంగా తిప్పికొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అలాగే, గత బిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, వారి బాధ్యతారాహిత్యాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. కరోనా సమయంలో కేసీఆర్ చెప్పిన మాటలను నమ్మి ప్రజలు ఎంతగా నష్టపోయారో గుర్తుచేస్తూ, ఇప్పుడు హరీష్ రావు ఇచ్చే తప్పుడు సలహాలను నమ్మి రైతులు పంటలు వేసి నష్టపోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాల సోషల్ మీడియా దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు.
వచ్చే సీజన్‌లో చుక్క నీరు కూడా సాగుకు ఇవ్వలేమ్
రాష్ట్రంలో జలాశయాల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందన్న విషయాన్ని సీఎం స్పష్టం చేశారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు 20 శాతానికి కంటే తక్కువగా ఉన్నాయని, పరిస్థితి డెడ్ స్టోరేజీకి చేరిందని తెలిపారు. రాబోయే 8 నుండి 10 నెలల పాటు తీవ్రమైన కరువును ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సుమారు 30 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లలో ఇప్పటికే 15 లక్షల పంప్‌సెట్లు ఎండిపోయాయని, అందుకే వచ్చే సీజన్‌లో చుక్క నీరు కూడా సాగుకు ఇవ్వలేమని తేల్చిచెప్పారు.
తాగునీటికి మొదటి ప్రాధాన్యం
ప్రస్తుత సంక్షోభ సమయంలో తాగునీటికి మాత్రమే మొదటి ప్రాధాన్యం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. రైతులు ఎట్టిపరిస్థితుల్లోనూ వరి సాగు చేయకుండా, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలు, కూరగాయల సాగు వైపు మళ్లేలా రైతు వేదికల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. పెరిగిన విద్యుత్ డిమాండ్‌ను తట్టుకుంటూ రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఎంతో కష్టపడి కరెంట్ కొనుగోలు చేస్తోందని, ప్రజల సంక్షేమమే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి పిలుపు
రైతులతో పాటు గ్రామాల్లోని మూగజీవాలను కాపాడుకోవడం కూడా మన బాధ్యత అని సీఎం గుర్తుచేశారు. కరువు కాలంలో పశువులకు తాగునీరు, పశుగ్రాసం కొరత రాకుండా ఉపాధి హామీ పథకం ద్వారా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరలో జరగబోయే ఆరు ఉమ్మడి జిల్లాల ఎంఎల్‌సి ఎన్నికల విషయంలో కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి, ప్రభుత్వ వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read: అమెరికాలో లక్ష డాలర్ల జీతం.. ఇండియాలో ఎంత సంపాదనతో సమానం?