Crime Thriller movie: కారులో తిరుగుతూ వైర్లెస్ నెట్‌వర్క్‌ల సాయంతో బ్యాంక్ ఖాతాలను హ్యాక్ చేసే ఓ యువకుడు… అనుకోకుండా భారీ డబ్బు దొంగతనం చేసే ప్లాన్‌లో చిక్కుకుంటాడు. మొదట ఇదో చిన్న హ్యాకింగ్ పని అనుకున్న అతడికి, ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు ఊహించని షాక్ ఇస్తాయి. లక్షల డాలర్ల డబ్బు, ప్రమాదకరమైన నేరగాళ్లు, మధ్యలో చిక్కుకున్న ఓ యువతి… వీటి నుంచి బయటపడేందుకు తన తెలివినే నమ్ముకోవాల్సి వస్తుంది. టెక్నాలజీని ఉపయోగించి డబ్బు సంపాదించే ఓ యువకుడి జీవితం ఒక్కసారిగా ఎలా మారిపోయిందో చూపించే క్రైమ్ థ్రిల్లర్ వార్‌డ్రైవర్ (Wardriver). యూత్‌కు కనెక్ట్ అయ్యే హ్యాకింగ్, రాబరీ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఏ ఓటీటీలో అందుబాటులో ఉందో తెలుసుకుందాం.
కోల్ ఓ తెలివైన హ్యాకర్. కారులో తిరుగుతూ చుట్టుపక్కల ఉన్న వైర్లెస్ నెట్‌వర్క్‌లను గుర్తించి, వాటి సాయంతో బ్యాంక్ ఖాతాల్లోకి చొరబడుతుంటాడు. బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఉన్న లోపాలను ఉపయోగించుకుని డబ్బు సంపాదిస్తుంటాడు. తన పని ఎవరికీ నేరుగా హాని చేయడం లేదని అనుకుంటాడు. కానీ తాను చేస్తున్న పని ఎప్పుడైనా పెద్ద సమస్యగా మారొచ్చనే విషయం మొదట్లో పట్టించుకోడు. ఓ రోజు కోల్ టాలెంట్ గురించి తెలుసుకున్న కొందరు వ్యక్తులు అతడిని భారీ మొత్తంలో డబ్బు దొంగిలించే ప్లాన్ లోకి లాగుతారు.
మొదట ఇదో సాధారణ హ్యాకింగ్ పని అనుకుని అంగీకరించినా, ఆ తర్వాత అసలు విషయం బయట పడుతుంది. ఈ ప్లాన్ వెనుక ఉన్నది మామూలు వ్యక్తులు కాదు. డబ్బు కోసం ఎంతకైనా తెగించే నేరగాళ్లు. వాళ్లతో చేతులు కలిపిన తర్వాత కోల్ కు పరిస్థితులు తన చేతుల్లో లేకుండా పోతాయి. ఈ వ్యవహారంలో సారా అనే యువతి కూడా కీలకంగా మారుతుంది. ఆమెతో కోల్ కు ఏర్పడిన పరిచయం అతడి ఆలోచనలను మార్చేస్తుంది. ఓవైపు భారీ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశం… మరోవైపు ఎప్పుడు ఏ ప్రమాదం ఎదురవుతుందో తెలియని పరిస్థితి.
ఈ రెండింటి మధ్య కోల్ నలిగిపోతాడు. ప్లాన్ నుంచి వెనక్కి తగ్గాలన్నా నేరగాళ్లు అతడిని వదిలిపెట్టేలా కనిపించరు. ముందుకు వెళ్లినా ప్రాణాలకే ప్రమాదం. తనకు తెలిసిన హ్యాకింగ్ విద్యతోనే ఈ సమస్య నుంచి బయటపడాలని కోల్ ప్రయత్నిస్తాడు. కానీ ఈసారి తనను, సారాను కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. డబ్బు కోసం మొదలైన ఈ వ్యవహారం చివరకు ఎలాంటి మలుపులు తిరుగుతుంది ? కోల్ తన తెలివితో నేరగాళ్ల నుంచి తప్పించుకోగలడా ? అనేదే సినిమాలో ఆసక్తికరమైన అంశం.
‘వార్‌డ్రైవర్’ 2026లో విడుదలైన ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్. కోల్ పాత్రలో డేన్ డీహాన్ (Dane DeHaan), సారా పాత్రలో సాషా కాలే (Sasha Calle) నటించారు. రెబెక్కా థామస్ (Rebecca Thomas) ఈ క్రైమ్ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే జియో హాట్‌స్టార్ (Jio Hotstar)లో కూడా అందుబాటులో ఉంది. కానీ తెలుగు డబ్బింగ్ లేదు. హ్యాకింగ్, సైబర్ నేరాలు, భారీ డబ్బు దొంగతనాల చుట్టూ సాగే ఈ రాబరీ థ్రిల్లర్ వర్త్ వాచింగ్ అన్పిస్తుంది.
Read Also: కార్గిల్ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా