Hyderabad Accident: పెద్ద అంబర్పేట సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పండుగ పూట ఇంట ఆనందాలు నిండాల్సిన వేళ, ఊహించని దుర్ఘటన ఆ ఇంట ఆరని శోకాన్ని మిగిల్చింది.
పండుగకు వస్తూ మృత్యుఒడిలోకి..
పెద్ద అంబర్పేటకు చెందిన నవీన్, శంషాబాద్లో నివాసముంటున్న తన చెల్లి రేఖను దసరా పండుగ కోసం ఇంటికి తీసుకొచ్చేందుకు స్కూటీపై బయలుదేరాడు. రేఖతో పాటు ఒక చిన్నారి కూడా వారితో ఉంది. మార్గమధ్యంలో పెద్ద అంబర్పేట వద్దకు రాగానే, వేగంగా వచ్చిన ఒక కారు వీరి స్కూటీని బలంగా ఢీకొట్టింది.
అన్నాచెల్లెళ్లు మృతి..
ఈ ప్రమాద తీవ్రతకు అన్నాచెల్లెళ్లు నవీన్, రేఖ అక్కడికక్కడే మృతి చెందారు. వారితో పాటు ఉన్న చిన్నారి తీవ్రంగా గాయపడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
కేసు నమోదు..
క్షతగాత్రురాలైన చిన్నారికి ప్రస్తుతం అత్యవసర వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, ప్రమాదానికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు జరుపుతున్నారు. పండుగ వేళ అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.
Also Read: దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు