ఒకే కూటమి.. మూడు పార్టీలు.. కానీ ఆశావహులు మాత్రం వందల్లో. ఏపీలో స్థానిక ఎన్నికల నామినేషన్లతో సీట్ల సర్దుబాటు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నామినేషన్లు వేసినవాళ్లలో ఎవరిని బరిలో ఉంచాలి? ఎవరికి సర్దిచెప్పాలి? అన్నది నాయకత్వానికి సవాల్‌గా మారింది. రెండు రోజులుగా చర్చలు సాగుతున్నా.. అన్ని స్థానాలపైనా ఇంకా క్లారిటీ రాలేదు. దీంతో కూటమి పార్టీల నేతల్లో ఉత్కంఠ పెరుగుతోంది.
ఇక సీట్ల లెక్కల్లో ఎవరి డిమాండ్లు వారివే. బీజేపీకి 30 జడ్పీటీసీలు, 30 ఎంపీపీ స్థానాలతో పాటు వందకు పైగా ఎంపీటీసీ స్థానాలు కేటాయించే అంశం చర్చకు వచ్చినట్లు సమాచారం. మరోవైపు జనసేన ఏకంగా 30 శాతం స్థానాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. తొమ్మిది జడ్పీ ఛైర్‌పర్సన్ స్థానాల డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. అల్లూరి జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ స్థానం జనసేనకు ఇచ్చే ప్రతిపాదనకు చంద్రబాబు అంగీకరించినట్లు సమాచారం.
మరోవైపు పల్నాడు వంటి ప్రాంతాల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలు బయటపడుతుండటం టెన్షన్ పెంచుతోంది. నామినేషన్లు వేసిన ఆశావహులను ఎలా సముదాయిస్తారు? మూడు పార్టీల నేతల మధ్య సమన్వయం ఎలా కుదురుస్తారు? అన్నది కీలకంగా మారింది. సీట్ల పంపకాలపై ఏకాభిప్రాయం కుదరకపోతే.. స్థానికంగా కూటమి అభ్యర్థుల మధ్యే పోటీ వచ్చే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది.
Also Read: ‘వైసీపీది క్రిమినల్ పాలిటిక్స్.. జగన్ మనస్తత్వం రాష్ట్రానికే ప్రమాదం’.. సీఎం చంద్రబాబు సంచలనం
సీట్ల పంపకాలతో కూటమి బలం మరింత పెరుగుతుందా..? లేక ఆశావహుల అసంతృప్తి కొత్త తలనొప్పులు తెస్తుందా..? చంద్రబాబు, పవన్ తీసుకునే తుది నిర్ణయాలపైనే ఇప్పుడు అందరి చూపు. నామినేషన్ల ఉపసంహరణ సమయానికి సీట్ల పంచాయితీ తేలితే.. రెబల్స్ బెడద తప్పుతుంది. లేదంటే కొన్ని స్థానాల్లో కూటమి నుంచే ఇద్దరు ముగ్గురు కూడా పోటీ పడే ప్రమాదం ఉంది.